బీమా రంగానికి టెక్నాలజీ ఊతం
♦ అప్పుడే చౌకగా పాలసీలు సాధ్యం
♦ ఐఆర్‌డీఏ చైర్మన్ టీఎస్ విజయన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీని సమర్ధంగా ఉపయోగించడం ద్వారా దేశీయంగా అందరికీ బీమా ప్రయోజనాలను చౌకగా అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ చైర్మన్ టీఎస్ విజయన్ చెప్పారు. బీమాకు కూడా ఆధార్‌ను అనుసంధానిస్తే ఇది మరింత సులభసాధ్యం కాగలదని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రేట్‌మేకింగ్ ఫోరం ఆఫ్ ఏషియా (ఐఐఆర్‌ఎఫ్‌ఏ) 2016 సదస్సులో పాల్గొన్న సందర్భంగా విజయన్ ఈ విషయాలు వివరించారు. ప్రధానంగా ఆరోగ్య బీమా, వాహన బీమాపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
మరోవైపు, దేశీయంగా ఇంకా అత్యధిక శాతం మందికి బీమా కవరేజీ లేని నేపథ్యంలో దీనిపై అవగాహన పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా కంపెనీలు చేతులు కలపాలని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ) సీఈవో ఆర్ రాఘవన్ అభిప్రాయపడ్డారు. అలాగే, వ్యవసాయ బీమా పథకాలను కూడా తక్కువ వ్యయాలతో అందుబాటులోకి తేవడంలో నూ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. వీటన్నింటికి గణాంకాలు, వాటి విశ్లేషణ కీలకమని రాఘవన్ చెప్పారు. భారత్ సహా ఐఐఆర్‌ఎఫ్‌ఏలో ఏడు సభ్య దేశాలకు చెందిన 200 మంది పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. రేట్‌మేకింగ్.. అనలిటిక్స్, కొంగ్రొత్త టెక్నాలజీలు మొదలైన వాటిపై ఇందులో చర్చించారు.