పాత బీమా పాలసీలకు గడువు పొడిగించం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతమున్న జీవిత బీమా పాలసీలను విక్రయించడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే అనుమతిస్తామని, వచ్చే జనవరి 1 నుంచి కొత్త మార్గదర్శకాలతో కూడిన పాలసీలనే విక్రయించాల్సి ఉంటుందని నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ స్పష్టం చేసింది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా పథకాలను విక్రయించడానికి అన్ని బీమా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, ఈ గడువును ఇక పెంచేది లేదని ఐఆర్‌డీఏ మెంబర్ (లైఫ్) సుధీన్ రాయ్ చౌదరి తెలిపారు.
కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా సుమారు 460 కొత్త పథకాలు అనుమతి కోసం రాగా ఇప్పటికే 400 పథకాలకు ఓకే చెప్పినట్లు ఆయన తెలిపారు. తొలుత అక్టోబర్ 1లోపు పాత పథకాల స్థానే కొత్త మార్గదర్శకాలతో కూడిన ప్రోడక్టులను ప్రవేశపెట్టాలని ఐఆర్‌డీఏ నిబంధన విధించినా, బీమా కంపెనీల కోరిక మేరకు ఈ గడువును డిసెంబర్ 31 వరకు పెంచుతూ ఐఆర్‌డీఏ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే పాలసీదారులకు అధిక బీమా రక్షణతో పాటు, పాలసీలను మధ్యలో ఆపేస్తే వచ్చే సరెండర్ వేల్యూ కూడా పెరుగుతుంది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఐఐఆర్‌ఎం-ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఏడవ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్న చౌదరి మాట్లాడుతూ మూడేళ్ల తర్వాత జీవిత బీమా రంగం తిరిగి ఈ ఏడాది వృద్ధిని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐఆర్‌ఎం మేనేజింగ్ డెరైక్టర్ టి.నరసింహారావు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎండీ, సీఈవో సందీప్ బక్షి తదితరులు పాల్గొన్నారు.