జీవిత బీమా కంపెనీల లాభాల్లో కోత
న్యూఢిల్లీ: దేశీయ జీవిత బీమా కంపెనీల లాభాలు 2015–16లో కొద్దిగా క్షీణించాయి. రూ.7,415 కోట్ల పన్ను అనంతర లాభాల్ని ఆర్జించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.7,611 కోట్లతో పోలిస్తే ఈ రంగం లాభాలు మొత్తం మీద 2.57 శాతం తగ్గాయి. జీవిత బీమా రంగంలో మొత్తం 24 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా గత ఆర్థిక సంవత్సరం నాటికి 19 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఈ మేరకు జీవిత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) నివేదిక విడుదల చేసింది. లాభాల్లో ఉన్న 19 కంపెనీల్లో... ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ రూ.2,517 కోట్ల లాభంతో అగ్ర స్థానంలో ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలతో పోలిస్తే 38% పెరిగాయి. నష్టాల్లో ఉన్న జీవిత బీమా కంపెనీల్లో ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్, భారతీ ఆక్సా, ఫ్యూచర్ జనరాలి, రిలయన్స్ నిప్పన్ ఉన్నాయి. మిగిలినవన్నీ లాభాల్లో ఉన్నవే. ఇక జీవిత బీమాయేతర రంగం నికర లాభం సైతం 2014–15లో రూ.4,639 కోట్లుగా ఉండగా... గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,238 కోట్లకు క్షీణించింది.