ఇందిరాపార్కు వద్ద జరిగిన మహాధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఎల్‌ఐసీ ఏజెంట్లు
కవాడిగూడ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏ) డ్రాఫ్ట్‌ను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఎల్‌ఐసీ ఏజెంట్లు పెద్దఎత్తున ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను ఆగ్రభాగాన నిలబెట్టడంలో ఎల్‌ఐసీ ఏజెంట్ల పాత్ర మహోన్నతమైందని పేర్కొన్నారు.
ఎల్‌ఐసీ ఏజెంట్ల సమస్యలను దేశ ప్రధాని, తెలంగాణ సీఎంలకు లేఖల ద్వారా పంపించి వివరిస్తామన్నారు. శుక్రవారం ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీఏవోఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఎల్‌ఐసీ ఏజెంట్లు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌ఐసీఏవోఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి దిలీప్ మాట్లాడుతూ ఐఆర్‌డీఏ డ్రాఫ్ట్ వల్ల ఎల్‌ఐసీ ఏజెంట్ల మనుగడకే తీవ్రమైన నష్టం కలగడమే కాకుండా ఎల్‌ఐసీ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఎల్‌ఐసీఏవోఐ సౌత్ జోన్ అధ్యక్షుడు మంజునాథ్, ప్రధాన కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ బీమా సంగం పేరుతో ఎల్‌ఐసీని నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ ఆలిండియా వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ వాసుదేవ్ ఆచార్య, ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment