మహాధర్నాలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్/ కవాడిగూడ: బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం దేశ వినాశనానికి పాల్పడుతున్న బీజేపీ నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ఆనాటి స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తితో మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. నిత్యావసర ఆహార వస్తువులపై జీఎస్టీని నిరసిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా నగరంలోని ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి భట్టి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్, అనేక సంస్థలు, వ్యవస్థలు, ఆస్తుల ఏర్పాటుతో నవభారత నిర్మాణం చేస్తే .. 2014 ఎన్నికల్లో మాయమాటలతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ జాతి సంపదను బహుళ జాతి సంస్థలు, అంబానీ, అదానీలకు ధారాదత్తం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. నిత్యావసర ఆహార వస్తువులపై జీఎస్టీ విధించి మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపైకి ప్రధాని మోదీ ఈడీ, ఐటీ, సీబీఐలను ఉసిగొల్పుతూ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే కుట్రలు చేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ తదితరులు మాట్లాడారు.
చలో రాజ్‌భవన్ భగ్నం
మహాధర్నా అనంతరం టీపీసీసీ నేతలు చలో రాజ్‌భవన్ చేపట్టారు. ఇందిరాపార్క్ నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలు జెండాలు చేతపట్టుకుని పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించిన పోలీసులు వివిధ స్టేషన్లకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment