Alugubelli narsi Reddy
-
ఉద్యోగులను నిరాశపరిచింది..
ఆదాయపన్ను శ్లాబ్‌లలో పెద్ద మార్పులు లేవు. నేషనల్ పెన్షన్ స్కీమును యథావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెసులుబాటు ఉండాలని కోరుకుంటున్నారు. ఐదు లక్షల ఆదాయానికి పన్ను నుండి మినహాయింపు కావాలని కోరుకుంటున్నారు. కానీ మూడు లక్షల దగ్గరనే ఆగిపోయింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. కానీ ఎటువంటి మార్పులూ లేవు. నిత్యావసర సరుకుల ధరలు వేగంగా పెరుగుతున్న క్రమంలో అందుక నుగుణంగా ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో కూడా మార్పులు చేయాలి.బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బడ్జెట్ తర్వాత మీడియాలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ... ఈ బడ్జెట్ మధ్యతరగతి వారికి చేయూతనిస్తుందన్నారు. కానీ బడ్జెట్లో మధ్యతరగతికి వెసులుబాటు కల్పించే ప్రతిపాదనలేమీ కనిపించలేదు. ఈ బడ్జెట్ కూడా మాటల బడ్జెట్‌గానే కనిపించింది. విద్యారంగానికీ, శిక్షణ –ఉపాధి రంగానికీ కలిపి లక్షా 48 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. మొత్తం బడ్జెట్లో ఇది 3 శాతమేనన్న మాట! విద్యారంగం ఒక్కదానికి మాత్రమే కేటాయింపులు చూస్తే 2.5 శాతం లోపే ఉంటాయి. బడ్జెట్ ప్రసంగంలో ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు ఒక్క మాట కూడా లేదు. దీన్ని బట్టి విద్య పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆసక్తీ లేనట్లు కనిపిస్తోంది. విద్య ప్రైవేటీకరణ యథేచ్ఛగా జరిగిపోవడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తోంది.– అలుగుబెల్లి నర్సిరెడ్డి, వ్యాసకర్త తెలంగాణ శాసనమండలి సభ్యులు -
ఐఆర్డీఏ డ్రాఫ్ట్ ఉపసంహరించేదాకా పోరు
కవాడిగూడ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) డ్రాఫ్ట్‌ను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఎల్ఐసీ ఏజెంట్లు పెద్దఎత్తున ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను ఆగ్రభాగాన నిలబెట్టడంలో ఎల్ఐసీ ఏజెంట్ల పాత్ర మహోన్నతమైందని పేర్కొన్నారు. ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలను దేశ ప్రధాని, తెలంగాణ సీఎంలకు లేఖల ద్వారా పంపించి వివరిస్తామన్నారు. శుక్రవారం ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీఏవోఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఎల్ఐసీ ఏజెంట్లు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌ఐసీఏవోఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి దిలీప్ మాట్లాడుతూ ఐఆర్డీఏ డ్రాఫ్ట్ వల్ల ఎల్ఐసీ ఏజెంట్ల మనుగడకే తీవ్రమైన నష్టం కలగడమే కాకుండా ఎల్ఐసీ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్‌ఐసీఏవోఐ సౌత్ జోన్ అధ్యక్షుడు మంజునాథ్, ప్రధాన కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ బీమా సంగం పేరుతో ఎల్ఐసీని నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ ఆలిండియా వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ వాసుదేవ్ ఆచార్య, ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
మీరు ఎమ్మెల్సీనా..?
సాక్షి, చౌటుప్పల్: ‘మీ వాహనంలో గన్మన్లు లేరు. మీరు ఎమ్మెల్సీ అంటే నమ్మేదెలా?’ అంటూ టోల్‌ప్లాజా సిబ్బంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని ప్రశ్నించారు. దీనికి నిరసనగా ఆయన టోల్‌ప్లాజా వద్ద బైఠాయించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఉదయం తన సొంత వాహనంలో నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. పంతంగి టోల్‌ప్లాజాలోని రుసుము చెల్లింపు కౌంటర్ నుంచి వాహనం వెళ్తుండగా సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్సీనని, వాహనాన్ని పంపించాలని కోరారు. వాహనంలో గన్మన్లు లేకపోవడంతో మీరు ఎమ్మెల్సీ అంటే ఎలా నమ్మాలి అని టోల్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆయన తన వద్ద ఉన్న ఐడీ కార్డును చూపించారు. ఆ ఐడీ కార్డును కంప్యూటర్లో పరిశీలించగా అందులో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పేరు నమోదు కాకపోవడంతో వాహనాన్ని పం పించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన వాహనం దిగి టోల్‌బూత్‌ల ముందు బైఠాయించా రు. విషయం తెలుసుకున్న పోలీసులు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. తాను పోలీస్ గన్మన్లను తీసుకోలేదని, దీనిపై టోల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చానన్నారు. అయితే ఇటుగా ప్రయాణం చేసిన ప్రతిసారీ ఇలాగే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న టోల్‌ప్లాజా ఉన్నతాధికారులు ఎమ్మెల్సీని పంపించారు. వాహనంలో గన్మన్లు లేకపోవడంతో సిబ్బంది ఆయనను గుర్తించలేకపోయారని జీఎమ్మార్ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ ఫ్రీ ఫాస్టాగ్‌కు దరఖాస్తు చేసుకున్నారని, అది వస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. -
ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి చేదు అనుభవం
సాక్షి, యాదాద్రి : చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సోమవారం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేదు అనుభవం ఎదురైంది. టోల్ ఫీజు చెల్లించాలంటూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాహనాన్ని టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకుంది. తాను ఎమ్మెల్సీ అని చెప్పినా అనుమతించలేదు. చివరికి ఐడీ కార్డు చూపించినా వదల్లేదు. మొదట గన్‌మెన్ లేకపోవడంతో ఎమ్మెల్సీ అని అనుకోలేదని చెప్పిన సిబ్బంది.. తర్వాత టోల్ మినహాయింపు జాబితాలో ఎమ్మెల్సీ పేరు లేదంటూ బుకాయించారు. చివరికి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వాహనాన్ని అనుమతించారు. కాగా, టోల్ ప్లాజా సిబ్బంది తీరుకు నిరసనగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ధర్నాకు దిగారు. ఏ ఎమ్మెల్సీని ఆపకుండా తనను మాత్రమే ఎందుకు ఆపారో చెప్పాలంటూ టోల్ ఫ్లాజా వద్ద బైఠాయించారు. -
జోనల్ వ్యవస్థ రద్దు తగదు
చేవెళ్ల రూరల్: జోనల్ వ్యవస్థను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తప్పు బట్టింది. జోనల్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల సంఖ్యను ఆరుకు పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. చేవెళ్ల మండల విద్యా వనరుల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చర్చ వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ జోనల్ రద్దుతో నిరుద్యోగులతో పాటు ప్రస్తుత ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు మరింతగా వెనుకబడే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ జిల్లాను ఒక జోన్గానూ, మిగతా జిల్లాలను ఐదు జోన్లుగా విభజించాలని కోరారు. రాష్ట్ర స్థాయి పోస్టులకు అన్ని జిల్లాల ఉద్యోగ, ఉపాధ్యాయులకు అవకాశం ఉండేలా నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేశారు. జోన్ల సంఖ్యను పెంచడానికి నిపుణులతో కమిటీ వేసి పునర్‌వ్యవస్థీకరిచాలని...అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యు.పోచయ్య, స్థానిక ఎంఈఓ సుజాత, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.మానిక్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గాలయ్య, జిల్లా కార్యదర్శి రవీందర్‌గౌడ్, ఎస్టీఎఫ్ జిల్లా కన్వీనర్ రమేశ్, పెంటయ్య, యూటీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మహమ్మద్ అక్బర్, కిరణ్, మహేందర్‌రెడ్డి, ఎస్టీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, రామచంద్రయ్య, టీయూటీఎఫ్ అధ్యక్షుడు సునందం, ఉపాధ్యాయ సంఘాల కార్యవర్గ సభ్యులు గోలవంత, బుగ్గ రాములు, లాలయ్య, యాదగిరి, ప్రవీణ్, కృష్ణ, పరమేష్, శ్రీనివాస్, మధునాచారి, తదితరులు పాల్గొన్నారు.