బీమా పాలసీలకూ డీ-మ్యాట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమాతో పాటు ఆరోగ్య, వాహన బీమాలనూ ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయాలని, దీనికి సంబంధించి నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని ఐఆర్‌డీఏను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కోరారు. ప్రస్తుతం జీవిత బీమా పథకాలను మాత్రమే... అది కూడా కోరిన వారికి మాత్రమే ఎలక్ట్రానిక్ రూపంలో అందించే ఏర్పాట్లు చేశారని, దీన్ని సాధారణ బీమా పథకాలకూ వర్తింపజేయాలని, అంతేకాకుండా అందరికీ తప్పనిసరి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాచేస్తే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఇన్సూరెన్స్ రిపాజిటరీ సిస్టమ్‌ను (ఐఆర్‌ఎస్) చిదంబరం సోమవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ రూపంలో బీమా పథకాలు అందించడం వల్ల ఇటు పాలసీదారులతో పాటు, అటు బీమా కంపెనీలకూ నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందన్నారు. గత పదేళ్ళ నుంచీ షేర్లను డీమ్యాట్ రూపంలోనే అందించాలనే నిబంధన విధించామని, దీనివల్ల ఇన్వెస్టర్లు వాటిని సులభంగా భద్రపరచుకునే అవకాశం కలిగిందని, అనేక మోసాలకు అడ్డుకట్ట పడిందని తెలియజేశారు. అలాగే బీమా పథకాలు కూడా డీ-మ్యాట్ రూపంలో అందిస్తే పాలసీదారులు ఒక ఊరి నుంచి మరో ఊరికి వలస వెళ్ళినా, లేదా ప్రకృతి వైపరీత్యాల్లో ఆస్తులను పోగొట్టుకున్నా... పాలసీ డాక్యుమెంట్‌లు ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా ఉండటమే కాకుండా వేగంగా క్లెయిమ్ చేసుకోవచ్చని చెప్పారు. ప్రస్తు తం ఎలక్ట్రానిక్ రూపంలో అకౌంట్ ప్రారంభించడానికి రూ.150 వరకు ఖర్చవుతోందని, అదే గనక సేవలు విస్తరిస్తే ఈ వ్యయం రూ.20 తగ్గుతుందనే ఆశాభావాన్ని చిదంబరం వ్యక్తం చేశారు.
రిపాజిటరీ సేవలకు ఐదు సంస్థలు: బీమా పథకాలను కాగిత రహితంగా ఎలక్ట్రానిక్ రూపంలో అందించడానికి రాష్ట్రానికి చెందిన కార్వీ రిపాజిటరీ లిమిటెడ్‌తో పాటు ఎన్‌ఎస్‌డీఎస్‌ఎల్, సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ, కామ్స్, ఎస్‌హెచ్‌ఐఎల్ వంటి ఐదు సంస్థలను ఐఆర్‌డీఏ ఎంపిక చేసింది. రిపాజిటరీ సేవలు ప్రారంభం సందర్భంగా ప్రారంభ కిట్లను ఈ ఐదు కంపెనీలకు చెందిన ప్రతినిధులకు చిందంబరం చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ మాట్లాడుతూ అన్ని బీమా పథకాలనూ ఒకే అకౌంట్‌లో భద్రపర్చుకునేలా దీన్ని రూపొందించామని, ఒకసారి ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ ప్రారంభిస్తే తదుపరి పాలసీలకు ఎటువంటి కేవైసీ నిబంధనల అవసరం ఉండదని తెలియజేశారు.
బీమా పథకాలను డీ-మ్యాట్ రూపంలో అందించడానికి విశేష కృషి చేసిన ఐఆర్‌డీఏ మాజీ చైర్మన్ జంధ్యాల హరినారాయణకి ఈ సందర్భంగా విజయన్ అభినందనలు తెలిపారు. ప్రపంచ సగటు బీమా సాంద్రత 6.5 శాతంగా ఉంటే అది ఇండియాలో 3.96 శాతంగా ఉందని, బీమా రంగంలో ఇంకా వ్యాపార విస్తరణకు అపారమైన అవకాశాలు ఉన్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. అందుబాటు ధరలో వ్యక్తిగత అవసరాలను తీర్చే విధంగా బీమా పథకాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బీమా కంపెనీల ప్రతినిధులతో పాటు, రిపాజిటరీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.