
75 శాతం ద్విచక్రవాహనాలకు బీమా లేదు!
న్యూఢిల్లీ: వాహనం ఏదైనా ఇన్సూరెన్స్ చేయించుకోవడం అనేది తప్పనిసరి. వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత దానికి బీమా చేయించుకోకపోతే అది చట్టరీత్యా నేరం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించడం వల్ల మన వాహనం కారణంగా ప్రమాదం జరిగితే.. అవతలి వాళ్లకు బీమా కంపెనీయే పరిహారం చెల్లిస్తుంది. అయితే ఈ విషయం వాహన వినియోగదారులకు అంతగా బోధపడినట్టు లేదు. దేశంలో 75శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు బీమా అనే అంశాన్ని గాలికి వదిలేశారట. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ విషయం స్పష్టం చేసింది.
కాగా, ఇందులో కొంతమంది వినియోగదారులు తొలిసారి రిజిస్ట్రేషన్ కోసం ఇన్సూరెన్స్ చేసి, దాని కాల పరిమితి ముగిసిన తర్వాత తిరిగి రెన్యువల్ చేయించుకోవడం లేదని రహదారి భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ స్పష్టం చేసింది. దేశంలో 82 శాతం ప్రైవేట్ వాహనాలు ఉంటే వాటిలో అత్యధిక శాతం ద్విచక్రవాహనాలకు బీమా లేదని రిటైర్డ్ జడ్జి కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ స్పష్టం చేసింది.