లాభదాయక సంస్థలనూ అమ్మేస్తే ఎలా? | Government Plans To DisInvestment In LIC | Sakshi
Sakshi News home page

లాభదాయక సంస్థలనూ అమ్మేస్తే ఎలా?

Published Sat, Mar 13 2021 2:09 AM | Last Updated on Sat, Mar 13 2021 2:16 AM

Government Plans To DisInvestment In LIC - Sakshi

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2021–22 బడ్జెట్‌ ప్రవేశపెడుతూ జీవిత బీమా సంస్థలో ఐపీఓ చేపట్ట డానికి వీలుగా ఎల్‌ఐసీ చట్టానికి 27 సవరణలు ప్రతిపాదించారు. అలాగే బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాన్ని 74కు పెంచుతూ కేంద్ర కేబి నెట్‌ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్‌ఐసీని లిస్టింగ్‌ చేసే ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న దీపం సలహాదారులు డెలాయిట్‌ కంపెనీ, ఎస్‌బీఐ కాప్స్‌ కంపెనీలను నియమించింది. ఎల్‌ఐసీ నిజవిలువను మదింపు చేయడానికి మిల్లిమాన్‌ కంపెనీని నియమించింది. ఇందులో వాటాలు అమ్మి ఆర్థిక లోటును పూడ్చుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.(చదవండి: వాహన బీమా వ్యయం తగ్గించుకుందామా...)


మన దేశ బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఐఆర్‌డీఏ  చట్టం 1999 ద్వారా బీమా రంగంలోకి 26 శాతం విదేశీ ఈక్విటీని అనుమతించారు.  తదనంతరం 2015లో ఈ పరిమితిని 49 శాతానికి పెంచారు. ఇప్పుడు దీన్ని 74 శాతానికి పెంచడం తోపాటు బీమా సంస్థలలో విదేశీ యాజమాన్యాన్ని అనుమ తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఎక్కువగా అనుమతిస్తే అవి దేశీయ పొదు పుపై నియంత్రణ సాధిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుభవాలను బట్టి చూస్తే విదేశీ పెట్టుబడులు, దేశీయ పొదుపునకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని నిరూపిత మైంది.

ఇప్పటికే లిస్టింగ్‌ అయిన ప్రైవేటు బీమా కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లు చూస్తే, దేశ నిర్మాణం, మౌలిక వనరుల ప్రయోజనాల కోసం అవి పెట్టిన పెట్టుబడులు నామ మాత్రమే. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను పెంచడం, విదేశీ యాజమాన్యాన్ని అనుమతించడం మొదలైన నిర్ణయాలు  భారతదేశంలోని ప్రజల విలువైన పొదుపును విదేశీ శక్తుల చేతికి అప్పగించడమే.ఎల్‌ఐసీలో వాటాల అమ్మకం పేరుతో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించడం సంస్థ  ప్రైవేటీకరణ దిశగా వేసే మొదటి అడుగు. ప్రజల చిన్న మొత్తాల పొదుపును ప్రీమియంల రూపంలో సమీకరించి, తద్వారా దేశ సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో దీన్ని పార్లమెంటు చట్టం ద్వారా 1956లో ఏర్పరిచారు. ‘ప్రజల సొమ్ము, ప్రజా సంక్షే మానికి’ అనే లక్ష్యంతో నాటి నుండి నేటి వరకు విజయ వంతంగా ఎల్‌ఐసీ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోంది.

లిస్టింగ్‌ వల్ల పారదర్శకత మెరుగుపడుతుందనే ప్రభుత్వ వాదన అసంబద్ధం. ఎల్‌ఐసీ ప్రతి నెలా రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏకు తన పనితీరు నివేదికలను సమర్పిస్తుంది. అలాగే పార్లమెంటు పరిశీలన కోసం తన జమా ఖర్చులు, అకౌంటు పుస్తకాలను ఉంచుతుంది. ఇంత పారదర్శకంగా ఈ సంస్థ పనిచేస్తున్నప్పుడు ఇంకేం పారదర్శకత కావాలి? ‘సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌’ నిర్వహించిన ట్రాన్స్‌పరెన్సీ ఆడిట్‌లో గ్రేడ్‌–ఎ (97 శాతం) సాధించింది. పైగా సంస్థ నిరర్థక ఆస్తులు కేవలం 0.33 శాతం మాత్రమే. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రతి సంవత్సరం రూ. 3.5 లక్షల కోట్ల నుంచి రూ. 4 లక్షల కోట్ల వరకు నిధులను పెట్టుబడులుగా పెట్టగల ఈ సంస్థకు నిధుల కోసం మార్కెట్‌ను ఆశ్ర యించాల్సిన పరిస్థితి లేదు. 2020 మార్చి 31 నాటికి రూ 30.67 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రజా సంక్షేమానికి అందించింది.

దేశ అంతర్గత వనరుల సమీకరణలో సంస్థ వాటా 25 శాతంపైనే. 440 బిలియన్‌ డాలర్ల విలువైన  ఆస్తులు కలిగి (ఐక్యరాజ్యసమితి జాబి తాలో ఉన్న 75 శాతం దేశాల జీడీపీ కంటే ఎక్కువ), ఆర్జించిన ఆదాయ పరంగా ఫార్చూన్‌ 500 కంపెనీల జాబితాలో స్థానం పొందిన ఎల్‌ఐసీకి మార్కెట్‌ నుండి నిధుల అవసరం ఉందనేది హాస్యాస్పదం. లిస్టింగ్‌ చేయటం వలన పాలసీదారులకు లాభం కలుగుతుందనే వాదనలు పూర్తిగా అర్థరహితం. 1956 నుండీ పాలసీదారుల నిధులను పరిపూర్ణంగా సంరక్షిస్తూ వారికి మంచి బోనస్‌ అందిస్తోంది. 98.27 శాతం క్లెయి మ్‌లను పరిష్కరించడం ద్వారా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

2019–20 ఆర్థిక సంవత్సరంలో 2.15 కోట్ల క్లెయిమ్స్‌ చెల్లించి ప్రపంచంలోనే అత్యుత్తమ బీమా సంస్థగా పేరొందింది. ఐఆర్‌డీఏ వార్షిక నివేదిక  2018–19 ప్రకారం 99.57% డెత్‌ క్లెయిమ్‌లను పరిష్కరించింది. పెట్టు బడులు ఉపసంహరించి అందులో 10% షేర్లు పాలసీ దారులకు ఇస్తామని ప్రభుత్వం ఆశ చూపుతోంది. కానీ ప్రభుత్వం చేస్తున్న సవరణలు పాలసీదారుల ప్రయో జనా లకు గండికొట్టేలా ఉన్నాయి. పేద, మధ్యతరగతి, బలహీన వర్గాలకు చౌకగా బీమా సౌకర్యాన్ని అందించే సామాజిక లక్ష్యం కుంటుపడి, లాభరహితంగా గ్రామీణ ప్రాంతాల్లో బీమాను విస్తరించే లక్ష్యం కూడా వీగిపోతుంది.

2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ఏఐజీ వంటి అతిపెద్ద బీమా కంపెనీని కూడా అమెరికా ప్రభుత్వం ఆదుకోక తప్పలేదు. సెప్టెంబర్‌ 11, 2001న అమెరికాలో ట్విన్‌ టవర్లు తీవ్రవాద దాడిలో కూలిపోతే ప్రభుత్వ సాయం ఉంటేనే క్లెయిములు చెల్లిస్తామని అక్కడి బీమా కంపెనీలు తెగేసి చెప్పాయి. ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాత స్టాక్‌ మార్కెట్ల లోని లిస్టింగ్‌ కంపెనీలే. దీనికి భిన్నంగా, దేశంలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా అన్ని నిబంధనలు సడలించి పాలసీదారుల క్లెయిములను ఒక్క రూపాయి ప్రభుత్వ సాయం కోరకుండానే ఎల్‌ఐసీ పరి ష్కరించింది. గత 20 సంవత్సరాలుగా 23 ప్రైవేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ నేటికీ 71 శాతానికి పైగా మార్కెట్‌ షేర్‌తో మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతోంది. తన 2,547 కార్యాలయాలను (52.1%) యాభై వేల కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో నెల కొల్పింది. దీనికి భిన్నంగా ప్రైవేట్‌ బీమా కంపెనీల 77.1% కార్యాలయాలు మెట్రో, అర్బన్‌ ప్రాంతాల్లోనే ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఐపీఓ ప్రయత్నాలను, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు బిల్లుని విరమించుకోవాలని కోరుతూ ఇప్పటికే ఎల్‌ఐసీలోని ఉద్యోగ సంఘాలు, ఏజెంట్లతో కలిసి దేశవ్యాప్తంగా దాదాపు 450 మంది పార్ల మెంట్‌ సభ్యులను కలిసి వినతిపత్రాలు సమర్పించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌ పత్రాలతో పాటే ఎల్‌ఐసీ చట్ట సవరణలను ఆమోదించుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సంస్థలోని దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు, ఏజెంట్ల సంఘాలు ఎల్‌ఐసీ పరిరక్షణే ధ్యేయంగా మార్చి 18న సమ్మెకు పిలుపు నిచ్చాయి.

పి. సతీష్‌
వ్యాసకర్త ఎల్‌ఐసీ ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకులు, మొబైల్‌ : 94417 97900

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement