
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మార్కెట్ వాటా 70 శాతం లోపునకు పడిపోయింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎల్‌ఐసీ వాటా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 71.81 శాతం నుంచి 69.36 శాతానికి తగ్గింది. ఈ వివరాలను ఐఆర్‌డీఏ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా సంస్థల మార్కెట్ వాటా 30.64 శాతానికి పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా కంపెనీల వాటా 28.19 శాతంతో పోలిస్తే రెండు శాతానికి పైగా ఇవి వాటాను పెంచుకున్నాయి. నూతన వ్యాపార ప్రీమియం (కొత్త పాలసీల నుంచి) విభాగంలోనూ ప్రైవేటు కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. నూతన పాలసీల్లో 8.47 శాతం వృద్ధి నమోదు చేశాయి. అదే సమయంలో ఎల్‌ఐసీ కొత్త పాలసీల వృద్ధి 5.99%గా ఉంది. పాత పాలసీల రెన్యువల్ ప్రీమియంలో ఎల్‌ఐసీ వాటా 72.31 శాతం నుంచి క్రితం ఆర్థిక సంవత్సరంలో 69.35 శాతానికి తగ్గింది.
ఎల్‌ఐసీ ఓపెన్ ఆఫర్‌కు పరిమిత స్పందన
ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ (వాటాల కొనుగోలు) ను మైనారిటీ వాటాదారుల్లో 22 శాతం మంది వినియోగించుకున్నారు. మెజారిటీ వాటాదారులు మాత్రం ఎల్‌ఐసీ యాజమాన్యంపై నమ్మకంతో ఆఫర్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment