Market shares
-
వొడాఫోన్‌కు గోల్డ్‌మన్ శాక్స్ షాక్
న్యూఢిల్లీ: టెలికం రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా రానున్న 3–4 ఏళ్ల కాలంలో తగ్గుతూనే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా అభిప్రాయపడింది. వొడాఫోన్ ఐడియా ఇటీవల చేపట్టిన మూలధన సమీకరణ సానుకూల అంశమే అయినప్పటికీ మార్కెట్ వాటా కోల్పోవడాన్ని అరికట్టబోదని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. రానున్న 3–4 ఏళ్లలో 300 బేసిస్ పాయింట్ల(3 శాతం)మేర మార్కెట్ వాటాకు కోత పడనున్నట్లు అంచనా వేసింది. ఈ సందర్భంగా పెట్టుబడి వ్యయాలు, ఆదాయ మార్కెట్ వాటా మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ప్రస్తావించింది. వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే ప్రత్యర్ధి కంపెనీలు 50 శాతం అధికంగా పెట్టుబడులను వెచి్చస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల నిధులను సమీకరించడం ఈ టెలికం కంపెనీకి సానుకూల అంశమేనని, అయితే మార్కెట్ వాటా బలహీనపడటాన్ని నివారించలేదని విదేశీ బ్రోకింగ్ సంస్థ వ్యాఖ్యానించింది. వెరసి సానుకూల ధోరణితో చూస్తే షేరు అంచనా విలువను రూ. 19గా పేర్కొంది. ప్రస్తుత రేటు(గురువారం ముగింపు)తో పోలిస్తే 26 శాతం అధికమైనప్పటికీ బేస్కేసుగా చేసిన మదింపుతో చూస్తే మాత్రం 83 శాతం పతనంకావచ్చని తెలియజేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి వొడాఫోన్‌కు సర్దుబాటుచేసిన స్థూల ఆదాయ(ఏజీఆర్) స్పెక్ట్రమ్ సంబంధ చెల్లింపులు ప్రారంభంకానున్నట్లు తెలియజేసింది. వీటిలో కొంతమేర బకాయిలను ఈక్విటీగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి అవకాశమున్న విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఫ్రీక్యా‹Ùఫ్లో స్థితికి చేరేందుకు ఏఆర్పీయూ రూ. 200–270కు జంప్చేయవలసి ఉన్నట్లు అంచనా వేసింది. సమీపకాలంలో ఇది జరిగేందుకు అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడింది. టారిఫ్‌ల పెంపు, పెట్టుబడుల సమీకరణ నేపథ్యంలోనూ 2025 మార్చికల్లా నికర రుణభారం– నిర్వహణ లాభం(ఇబిటా) నిష్పత్తి మెరుగుపడకపోవచ్చని వివరించింది. ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 11.5% పతనమై రూ. 13.36 వద్ద ముగిసింది. -
ఐఫోన్ అమ్మకాలతో యాపిల్ ఉక్కిరిబిక్కిరి,భారత్‌లో దూసుకెళ్తున్న సేల్స్!!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డ్‌లు నమోదు చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా భారత్‌లో ఐఫోన్లు ఈ స్థాయిలో అమ్మడుపోవడంపై ఐఫోన్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాపిల్ సంస్థ గతేడా కేలండర్ ఇయర్ 2021లో ఐఫోన్ షిప్మెంట్లో 48శాతం వృద్దిని సాధించింది. దీంతో మార్కెట్ షేర్ మరో 4శాతం పెరిగినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టెక్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ ప్రకారం..యాపిల్ ఈ ఏడాది మనదేశంలో రికార్డు స్థాయిలో 5.4 మిలియన్ ఐఫోన్లను డెలివరీ చేసింది. ముఖ్యంగా క్యూ4లో 2.2 మిలియన్లను డెలివరీ చేసింది. క్యూ4 ఫలితాల ప్రకారం..టెక్ దిగ్గజం అక్టోబర్-డిసెంబర్ కాలంలో 34 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సందర్భంగా సీఎంఆర్ ప్రతినిధి ప్రభురామ్ మాట్లాడుతూ..ఐఫోన్ అమ్మకాల్లో యాపిల్ భారత్‌లో ముందంజలో ఉంది. 5 మిలియన్లకు పైగా ఐఫోన్లను షిప్పింగ్ చేసింది. కాంపిటీటివ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రికార్డ్ స్థాయిలో మరో 4.4 శాతం మార్కెట్ షేర్‌ను పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.ఏడాది పొడవునా దేశీయంగా పెరిగిన ఐఫోన్ల తయారీ , రిటైల్ మార్కెట్లో అమ్మకాలు జోరందుకోవడంతో పాటు పెస్టివల్ సీజన్ కారణంగా ఐఫోన్లకు డిమాండ్ పెరగడంతో లాభాలు నమోదు చేసిందని ప్రభురామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఫోన్ 12కు భారీ డిమాండ్ భారత్‌లో 40 శాతం మార్కెట్ వాటాతో ఐఫోన్ 12 కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఐఫోన్ 11, ఎస్ఈ, ఐఫోన్ 13,ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా జూలై-సెప్టెంబర్ కాలంలో (క్యూ3) యాపిల్ దేశంలో 1.53 మిలియన్లకు పైగా ఐఫోన్ యూనిట్లను డెలివరీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: యాపిల్ లోగోలో ఇంత విషయం ఉందా..! టచ్ చేసి చూడండి..అదిరిపోద్దంతే..! -
మళ్లీ లాభాల్లోకి మార్కెట్
ముంబై: నాలుగు రోజుల నష్టాల ముగింపు తర్వాత స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల పట్టాలెక్కింది. కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించవచ్చనే ఆశలతో సోమవారం స్టాక్ సూచీలు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. మెటల్, ఆర్థిక, ఐటీ, ఇంధన రంగాల షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 534 పాయింట్లు పెరిగి 59,299 వద్ద నిలిచింది. నిఫ్టీ 159 పాయింట్లు ర్యాలీ చేసి 17,691 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణతలు సూచీల ర్యాలీని అడ్డుకోలేకపోయాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. గతవారంలో పతనాన్ని చూసిన మెటల్ షేర్లకు అధిక డిమాండ్ లభించింది. ప్రైవేటీకరణ ఆశలతో ప్రభుత్వ కంపెనీల షేర్లు పెరిగాయి. ఫార్మాస్యూటికల్స్, స్పెషాలిటీ కెమికల్ కౌంటర్లకు కొనుగోళ్లతో కళకళలాడాయి. క్యూ2 ఆర్థిక ఫలితాల సీజన్‌ను ప్రారంభించనున్న ఐటీ షేర్లలో కన్సాలిడేషన్ చోటు చేసుకుంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు రెండు శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.860 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.228 కోట్ల షేర్లను కొన్నారు. చైనా ఎవర్‌గ్రాండే గ్రూప్ రుణ సంక్షోభం, ద్రవ్యోల్బణ ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు బలహీనపడి 74.31 వద్ద స్థిరపడింది. సూచీల భారీ ర్యాలీతో స్టాక్ మార్కెట్లో ఒక్క రోజులో రూ.3.17 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కె ట్ విలువ రూ.266.77 లక్షల కోట్లకు చేరింది. ‘‘వారం రోజుల స్థిరీకరణ తర్వాత స్టాక్ మార్కెట్ బౌన్స్‌బ్యాక్ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్(జూలై–సెప్టెంబర్)ఫలితాలను అక్టోబర్ 8న దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ బోణీ చేయనుంది. తొలి దశతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థపై మలి దశ కోవిడ్ ప్రభావం తక్కువగా ఉన్నందున క్యూ2లో కార్పొరేట్లు మెరుగైన ఆర్థిక గణాంకాలు ప్రకటించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే పండుగ సీజన్లో డిమాండ్ మరింత ఊపందుకోవచ్చనే ఆశలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు స్టాక్ సూచీల బౌన్స్ బ్యాక్‌కు కారణమయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా... ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.., దేశీయ మార్కెట్ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 377 పాయింట్ల లాభంతో 59 వేలపై 59,143 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 17600 పైన 17,616 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వరుస నాలుగురోజు మార్కెట్ పతనంతో దిగివచ్చిన షేర్లను కొనుగోళ్లు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. తొలి సెషన్లో సెన్సెక్స్ 782 పాయింట్లు ఎగసి 59,548 వద్ద, నిఫ్టీ 219 పాయింట్లు ర్యాలీ చేసి 17,751 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. ఆసియా మార్కెట్ల నష్టాల ముగింపు, యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభంతో సూచీలు కొంతమేర లాభాల్ని కోల్పోయాయి. మిగిలిన లాభాల్ని చివరి వరకు నిలుపుకోవడంలో సూచీలు సఫలమయ్యాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►కోవిడ్ ఔషధ తయారీ అనుమతులు లభించడంతో దివీస్ ల్యాబ్స్ షేరు ఎనిమిది శాతం లాభపడి రూ.5221 వద్ద ముగిసింది. ►ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ వార్తలతో ఎన్టీపీసీ షేరు ర్యాలీ కొనసాగుతోంది. ఇంట్రాడేలో 6.5% ఎగసింది. చివరికి 4% లాభంతో రూ.146 వద్ద స్థిరపడింది. ►వ్యాపార రికవరీ ఆశలతో టాటా మోటార్స్ షేరు 3% పెరిగి రూ.342 వద్ద నిలిచింది. ►ఇన్వెస్కో–గోయెంకా పంచాయితీ బొంబై హైకోర్టుకు చేరిన నేపథ్యంలో జీ ఎంటర్టైన్ మెంట్ 2% పెరిగి రూ.301 వద్ద ముగిసింది. -
ఒక్క గంటలో ఆయన సంపాదన రూ.16వేల కోట్లు
షేర్ మార్కెట్ ఓడలను బండ్లను చేస్తుంది.. బండ్లను ఓడలు చేస్తుందన్నది పాతమాట. ఈ మధ్య ట్రెండ్ మారింది. దిగ్గజ కంపెనీలు ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకుంటూ సంపదను పోగు చేసుకుంటున్నాయి. స్పేస్ ఎక్స్, టెస్లా కార్ల సంస్థ అధినేత ఎలన్ మస్క్ సంపాదన ఒక్క గంటలోనే దాదాపు 2.3 బిలియన్ డాలర్లు (రూ.16వేల కోట్లకు పైగా) పెరిగిపోయింది. టెస్లా షేర్లు మార్కెట్లో బలంగా ట్రేడవుతున్నాయి. నాలుగో త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగానే ఉంటాయనే అంచనాలు, మోడల్ వై క్రాసోవర్ కారు తయారీ వేగవంతం చేయడం వంటి కారణాలతో నిన్న వాల్ స్ట్రీట్‌లో ఈ కంపెనీల షేర్లు పరుగులుపెట్టాయి. టెస్లా సీఈవో స్టెప్పులు, వీడియో వైరల్ 580.99 డాలర్లు వద్ద ఈ షేరు ట్రేడింగ్ ముగించింది. ఒక దశలో 12శాతం పెరిగి 649 వద్దకు చేరింది. ఈ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సంపద దీంతో 36బిలియన్ డాలర్లుగా బ్లూమ్‌బెర్గ్ అంచనా కట్టింది. అతనికి టెస్లాలో ఐదోవంతు షేర్లు, స్పేస్ ఎక్సోప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్లో 14.6 బిలియన్ డాలర్ల షేర్లు ఉన్నాయి. టెస్లా మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లను ఇప్పటికే అధిగమించింది. టెస్లా మూడో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో షేర్ల ధరలు పెరుగుతున్నాయి. చైనాలో మోడల్ వై తయారీ కోసం త్వరలో ప్లాంట్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కంపెనీ 2025 నాటికి రెండు నుంచి మూడు మిలియన్ల వాహనాలు విక్రయించనుందని అంచనాలు ఉన్నాయి. ఎలాన్ మస్క్‌కు భారీ షాక్.. 2 నిమిషాల్లో.. -
తగ్గుతున్న ఎల్ఐసీ ఆధిపత్యం!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ మార్కెట్ వాటా 70 శాతం లోపునకు పడిపోయింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎల్ఐసీ వాటా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 71.81 శాతం నుంచి 69.36 శాతానికి తగ్గింది. ఈ వివరాలను ఐఆర్డీఏ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా సంస్థల మార్కెట్ వాటా 30.64 శాతానికి పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా కంపెనీల వాటా 28.19 శాతంతో పోలిస్తే రెండు శాతానికి పైగా ఇవి వాటాను పెంచుకున్నాయి. నూతన వ్యాపార ప్రీమియం (కొత్త పాలసీల నుంచి) విభాగంలోనూ ప్రైవేటు కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. నూతన పాలసీల్లో 8.47 శాతం వృద్ధి నమోదు చేశాయి. అదే సమయంలో ఎల్ఐసీ కొత్త పాలసీల వృద్ధి 5.99%గా ఉంది. పాత పాలసీల రెన్యువల్ ప్రీమియంలో ఎల్ఐసీ వాటా 72.31 శాతం నుంచి క్రితం ఆర్థిక సంవత్సరంలో 69.35 శాతానికి తగ్గింది. ఎల్ఐసీ ఓపెన్ ఆఫర్‌కు పరిమిత స్పందన ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ (వాటాల కొనుగోలు) ను మైనారిటీ వాటాదారుల్లో 22 శాతం మంది వినియోగించుకున్నారు. మెజారిటీ వాటాదారులు మాత్రం ఎల్ఐసీ యాజమాన్యంపై నమ్మకంతో ఆఫర్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
ఈ ఏడాది 1,500 కొత్త మొబైల్స్
91మొబైల్స్‌డాట్‌కామ్ వెల్లడి న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో 1,400-1,500 వరకూ కొత్త మొబైల్ ఫోన్ మోడళ్లు రానున్నాయని 91మొబైల్స్‌డాట్‌కామ్ తెలిపింది. షియోమి, ఆసుస్, మోటొరొలా, ఒబి వంటి కంపెనీలు భారత్‌లో తమ మార్కెట్ వాటా పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండడమే దీనికి కారణమని 91మొబైల్స్డాట్కామ్కు చెందిన మాధుర్ వివరించారు. గత ఏడాది వచ్చిన కొత్త మోడళ్లు(1,137)తో పోల్చితే ఇది 20 శాతం అధికమని పేర్కొన్నారు. 2013లో 957 కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయని తెలిపారు. షియోమి, ఆసుస్, మోటొరొలా, ఒబి తదితర కంపెనీలు వివిధ ధరల రేంజ్లో వివిధ ఫీచర్లున్న ఫోన్లను అందిస్తున్నాయని మాధుర్ వివరించారు. రెండోసారి, మూడోసారి స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసేవాళ్లు హై ఎండ్ స్మార్ట్ఫోన్ల వైపు మళ్లుతున్నారని వివరించారు. గత ఏడాది షియోమి, మోటొరొలా, లెనొవొ, ఆసుస్ కంపెనీలు రూ.5,000-15,000 రేంజ్లో ఆధునిక ఫీచర్లున్న మొబైళ్లను అందించాయని, ఫలితంగా స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర గత ఏడాది 18 శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఇదే ధోరణి ఈ ఏడాది కూడా కొనసాగుతుందని వివరించారు. ఈ ఏడాది రూ.15,000-20,000 రేంజ్ ఫోన్లకు ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లకు సంబంధించి పరిశోధన, పోలికలను వివరించే ఈ వెబ్సైట్లో 20 వేల డివైస్ల వివరాలున్నాయని అంచనా. గత ఏడాది 4 కోట్ల మంది తమ వెబ్‌సైట్‌ను సందర్శించారని ఈ వెబ్సైట్ అంటోంది.