సాక్షి, బిజినెస్ బ్యూరో/సిటీబ్యూరో : డ్రైవర్లకు చెల్లించే నగదు ప్రోత్సాహకాలు నిలిచిపోవటంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉబెర్, ఓలా ట్యాక్సీ డ్రైవర్లు ఆదివారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగారు. హైదరాబాద్‌లో దాదాపు 50 శాతం మంది స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నట్లు సమాచారం. ముంబైలో ఈ నిరసన ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడింది. ఢిల్లీ, బెంగళూరు, పుణేలో మాత్రం ప్రభావం తక్కువే ఉంది. ఇరు కంపెనీలు ఒప్పంద సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఆదాయాలు రావటం లేదని, అందుకే సమ్మెకు దిగామని డ్రైవర్లు చెబుతున్నారు.
హైదరాబాద్‌లోనూ సమ్మె ప్రభావం...
దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ట్యాక్సీ డ్రైవర్లు సర్వీసులను నిలిపేశారు. దీంతో చాలాచోట్ల మధ్యాహ్నం వరకు క్యాబ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఓలా, ఉబెర్‌లు తమను మొదట భాగస్వాములుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించి ఎలాంటి ఒప్పందాలు, అంగీకార పత్రాలు లేకుండా నిలువుదోపిడీ చేస్తున్నాయని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సలావుద్దీన్ ఈ సందర్భంగా విమర్శించారు.
నగరంలో రెండు క్యాబ్ సంస్థల్లో వాహనాల సంఖ్య ఒకానొక స్థాయిలో 1.25 లక్షలకు పెరిగింది. డ్రైవర్ ఓనర్లు ప్రత్యామ్నాయాలు చూసుకోవడంతో ఇప్పుడు ఈ సంఖ్య సగానికి పడిపోయిందని సమాచారం. మరోవైపు ఓలా సంస్థ లీజు ప్రాతిపదికన పెద్ద ఎత్తున వాహనాలను సమకూర్చుకుంది. దీంతో అప్పటి వరకు బుకింగ్‌లపైన ఆధారపడి వాహనాలు నడిపిన డ్రైవర్ల పరిస్థితి తలకిందులైంది. అన్నిచోట్లా ఇదే వాతావరణం ఉండటంతో లీజ్ ఒప్పందాలను రద్దు చేయాలనేది కూడా డ్రైవర్ల సమ్మె డిమాండ్లలోకి చేరింది.
నెలకు రూ.75,000 ఉండాలి..
ప్రతి నెలా కనీసం రూ.75 వేలు లభించేలా బుకింగ్‌లు, ఇన్సెంటివ్‌లు ఇవ్వాలనేది డ్రైవర్ల ప్రధాన డిమాండ్. ప్రస్తుతం చాలా మంది డ్రైవర్లు నెలకు రూ.25 వేలు కూడా సంపాదించలేని పరిస్థితి నెలకొంది. లీజు క్యాబ్‌లకు అధిక బుకింగ్‌లు ఇవ్వటం, సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లకు బుకింగ్‌లను భారీగా తగ్గించడమే దీనికి అసలు కారణం. హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్‌లకు ప్రత్యామ్నాయంగా క్యాబ్ డ్రైవర్లే స్వయంగా నిర్వహించుకునేలా ‘టీసీడీఓఏ’ పేరిట మొబైల్ యాప్‌ను తెచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
క్యాబ్ డ్రైవర్ల ఉపాధికి కనీస గ్యారెంటీ లభించేలా దీన్ని రూపొందిస్తున్నట్లు టీసీడీఓఏ అధ్యక్షుడు శివ చెప్పారు. శంషాబాద్ కేంద్రంగా రెండు నెలల్లో ఈ సంస్థను ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. 5,000 మంది డ్రైవర్లతో ప్రారంభించి క్రమంగా దీన్ని విస్తరిస్తామన్నారు. ఈ మేరకు సోమవారం బాగ్ లింగంపల్లిలో సమావేశం కూడా నిర్వహించారు.
టీసీడీఓఏ లక్ష్యాలు...
♦ ప్రతి డ్రైవర్‌కు రోజుకు రూ.3000 నుంచి రూ.5000 ఆదాయం
♦ ఆర్టీసీ డ్రైవర్ల తరహాలో 8 గంటల పని విధానం
♦ లాభాపేక్ష లేకుండా డ్రైవర్లే స్వయంగా నిర్వహించుకొనే వెసులుబాటు
♦ ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాలు
♦ డ్రైవర్ల బీమా, ఇతర అన్ని సదుపాయాలు ఒకే వేదిక నుంచి అమలయ్యేలా చర్యలు
తప్పనిసరి కావటంతోనే...
ఓలా, ఉబెర్ సంస్థల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకొనేందుకు, బుకింగ్‌లు పెంచుకొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేశాం. రెండేళ్ల పాటు పోరాటం చేశాం. జైలుకు కూడా వెళ్లాం. కానీ ఫలితం లేదు. ప్రభుత్వం కూడా మా బాధలను పట్టించుకోలేదు. గత్యంతరం లేక మేమే స్వయంగా మొబైల్ యాప్‌ను తెస్తున్నాం. –శివ (టీసీడీఓఏ)
బండ్లు తాకట్టు పెట్టాను
ఓలా, ఉబెర్‌లో ఉపాధి బాగుందని మంచిర్యాల నుంచి హైదరాబాద్ వచ్చా. ఏడాది పాటు బాగానే ఉంది. రెండు బండ్లు కొన్నా. ఓలాలో పెట్టా. కానీ క్రమంగా ఆదాయం పడిపోయింది. బండి ఫైనాన్స్ కూడా కష్టమైంది. వాహనాలు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఎవరిపైనా ఆధారపడకుండా మేమే ఒక యాప్ ఏర్పాటు చేసుకోవడం మంచిదనిపిస్తోంది. –కమలహాసన్, డ్రైవర్
Comments
Please login to add a commentAdd a comment