న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్‌ఐ) కింద కంపెనీలకు ఇచ్చే ద్రవ్యపరమైన ప్రోత్సాహకాల విషయంలో అర్హత నిబంధనలను సరళీకరించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ అనే పరిశోధనా సంస్థ (జీటీఆర్‌ఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఈ పథకం కింద ప్రకటించిన ప్రోత్సాహకాలు దుర్వినియోగం కాకుండా రక్షణ కూడా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. కేంద్ర సర్కారు భారత్‌లో తయారీని పెంచి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, స్వావలంబన సాధించేందుకు పీఎల్‌ఐ పథకాన్ని తీసుకురావడం తెలిసిందే. దీని కింద 14 రంగాల్లో అదనపు ఉత్పత్తిని సాధించేందుకు రూ.1.97 లక్షల కోట్ల ద్రవ్య ప్రోత్సాహకలను ప్రకటించడం గమనార్హం.
ఈ క్రమంలో జీటీఆర్‌ఐ చేసిన సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. కంపెనీలు కాంట్రాక్టు తయారీదారులు లేదా గ్రూపు సంస్థల మద్దతుతో ఉత్పత్తి గణాంకాల్లో మోసాలకు పాల్పడే అవకాశం లేకపోలేదని జీటీఆర్‌ఐ హెచ్చరించింది. ఇందుకు 2003–06 మధ్య టార్గెట్ ప్లస్ పథకం కింద జరిగిన దుర్వినియోగాన్ని ప్రస్తావించింది. ‘‘పీఎల్‌ఐ పథకాన్ని అమలు చేసే ప్రభుత్వ విభాగాలు గతంలో టార్గెట్ ప్లస్ పథకం దుర్వినియోగాన్ని అధ్యయనం చేసి, అప్రమత్తంగా ఉండాలి. త్రైమాసికం వారీగా ప్రోత్సాహకాలను విడుదల చేసే సమయంలో ఈ రిస్క్ మరింత పెరుగుతుంది’’అని జీటీఆర్‌ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ సూచించారు.
విడిభాగాల తయారీని ప్రోత్సహించాలి..
నిర్ధేశిత పెట్టుబడులు, ఉత్పత్తి, అమ్మకాలు, స్థానిక విడిభాగాలు/ముడి పదార్థాల వినియోగం తదితర అర్హత నిబంధనల్లో అన్నింటికీ తయారీ దారులు అర్హత పొందలేకపోవచ్చని జీటీఆర్‌ఐ తన నివేదికలో ప్రస్తావించింది. ‘‘చాలా కేసుల్లో ఉత్పత్తి అసలు విలువ లేదా ఇన్‌వాయిస్ వ్యాల్యూని తెలుసుకోవడం కష్టం. నిబంధనలు తక్కువగా, పారదర్శకంగా ఉండాలి’’అని పేర్కొంది. తుది ఉత్పత్తికి బదులు విడిభాగాల స్థానిక ఉత్పత్తికి ప్రోత్సాహకాలు ఇవ్వడం మెరుగైన విధానంగా అభిప్రాయపడింది. ఐరోపా యూనియన్ విధించిన కార్బన్ బోర్డర్ పన్నును త్వరలో మరిన్ని దేశాలు కూడా అనుసరించొచ్చని, ఈ అనుభవాల నేపథ్యంలో భారత్ శుద్ధ ఇంధన టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment