కోల్‌కతా: తయారీ సంస్థలకు మరిన్ని బాధ్యతలు కట్టబెట్టడం (ఈపీఆర్) వంటి విధానపరమైన చర్యల ద్వారా రీసైక్లింగ్‌ను మరింతగా ప్రోత్సహించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా వ్యర్ధాలను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని, పునర్వినియోగాన్ని పెంపొందించవచ్చని భావిస్తోంది. కేంద్ర గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఉపేంద్ర సి జోషి ఈ విషయాలు తెలిపారు. ఈపీఆర్ విధానం కింద వాడేసిన ఉత్పత్తుల సేకరణకు నిధులు సమకూర్చడం, రీసైక్లింగ్ ఖర్చులను భరించడం తద్వారా పర్యావరణంపై ప్రభావాలను తగ్గించడం వంటి వాటికి తయారీ సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
దీనివల్ల రీసైక్లింగ్ పరిశ్రమకు తోడ్పాటు లభిస్తుంది. అధునాతన సాంకేతికత తోడ్పాటుతో వనరుల వినియోగ సామర్థ్యాలను పెంచుకునేలా పరిశ్రమను అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోందని జోషి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈపీఆర్ వంటి విధానపరమైన చర్యలను పరిశీలిస్తోందని వివరించారు. మరోవైపు మెటల్ స్క్రాప్‌పై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలని మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఆర్‌ఏఐ) సీనియర్ వైస్–ప్రెసిడెంట్ ధవళ్ షా కేంద్రాన్ని కోరారు. 2030 నాటికి 30 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు రీసైక్లింగ్ రంగంలో పెట్టుబడులు వచ్చేలా ఆకర్షణీయమైన పాలసీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశీయంగా ఉక్కు ఉత్పత్తిలో రీసైకిల్ చేసిన స్టీల్ వాటా 22 శాతంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment