న్యూఢిల్లీ: ‘ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం’ (పీఎల్‌ఐ) కింద ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీలకు రూ.2,875 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్రం విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, టెలికం, నెట్‌వర్కింగ్ ప్రొడక్టŠస్, ఫార్మాస్యూటికల్స్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్లు తదితర ఎనిమిది రంగాల్లో పీఎల్‌ఐ పథకం కింద అర్హత సాధించిన కంపెనీలకు ఈ మేరకు ప్రోత్సాహకాలు పంపిణీ చేసినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అదనపు సెక్రటరీ రాజీవ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
2020లో కరోనా మహమ్మారి కారణంగా చైనా నుంచి సరఫరాలకు అంతరాయం కలగడం తెలిసిందే. దీంతో దిగుమతులు తగ్గించి, దేశీయంగా తయారీని పెంచడం, తయారీకి భారత్‌ను కేంద్రంగా చేయాలన్న లక్ష్యాలతో కేంద్ర సర్కారు పీఎల్‌ఐ పథకాన్ని తీసుకొచ్చింది. 14 రంగాలకు దీని కింద రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఎనిమిది రంగాల్లోని కంపెనీల నుంచి రూ.3,420 కోట్ల ప్రోత్సాహకాలకు దరఖాస్తులు వచ్చినట్టు రాజీవ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు.
ఇందులో రూ.2,875 కోట్లను విడుదల చేసినట్టు వెల్లడించారు. వచ్చే రెండు మూడేళ్లలో దేశీయంగా మరింత పెద్ద ఎత్తున ఉత్పత్తి సాధ్యపడుతుందన్నారు. 2022 డిసెంబర్ నాటికి 14 రంగాల నుంచి 717 దరఖాస్తులను ఆమోదించామని, ఈ కంపెనీలు రూ.2.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఠాకూర్ తెలిపారు. ‘‘ఇప్పటికి రూ.53,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో రూ.5 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తి దేశీయంగా సాధ్యపడింది. 3 లక్షల మందికి పైగా కొత్తగా ఉపాధి అవకాశాలు వచ్చాయి’’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment