![govt announced financial incentives for the development of critical minerals](/styles/webp/s3/article_images/2024/08/15/minerals01.jpg.webp?itok=gXLQKN4c)
భారత ప్రభుత్వం అరుదైన ఖనిజాలను వెలికితీసి అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహకాలు అందించాలని యోచిస్తోంది. ‘నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్’పై ఇటీవల జరిగిన బడ్జెట్ సెమినార్‌లో కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి వీణా కుమారి మాట్లాడారు. అరుదైన ఖనిజాలను వెలికితీసే సంస్థలు రుణాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఈ సందర్భంగా వీణా మాట్లాడుతూ..‘లిథియం వంటి కీలకమైన ఖనిజాలను వెలికితీసి అభివృద్ధి చేయాలి. అందుకోసం ప్రభుత్వం సహకారం అందిస్తుంది. సంస్థలు రుణాలు పొందేలా ఏర్పాటు చేస్తాం. మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మైనింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం సంస్థలకు కొన్ని రాయితీలు ఇవ్వాలనే చర్చలు సాగుతున్నాయి. గ్లోబల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సహకారంపై భారత్ దృష్టి సారిస్తుంది. వెలికితీసిన ఖనిజాల తరలింపునకు గనుల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తుంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే బలమైన బ్యాంకులు
ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ వాడకం పెరుగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే ట్రాన్సిస్టర్లు, రెసిస్టర్లు, బ్యాటరీలు, మధర్‌బోర్డులు, ప్రాసెసర్లు, ఇతర వస్తువుల తయారీలో లిథియం వంటి అరుదైన ఖనిజాలను వాడుతున్నారు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఖర్చుతోపాటు, రవాణా క్లిష్టంగా మారుతుంది. ఇప్పటికే ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. అయితే వాటిని వెలికితీసి అభివృద్ధి చేయడం సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా ఖనిజాల అన్వేషణ, మైనింగ్, శుద్ధీకరణ, ప్రాసెసింగ్, రీసైక్లింగ్‌లో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని ప్రభుత్వం కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment