విదేశాలవాళ్లందరూ ఫ్రీ వల్చర్స్, మన దంతా ఫైన్ అండ్ రిఫైన్డ్ కల్చర్ అని గొప్పలు పోతుంటాం గానీ... నిజానికి మనదే నిజమైన ‘ఫ్రీ’ సంస్కృతి. ఇది వినగానే ఫెడేల్మంటూ గుండెలవీ బాదుకోనక్కర్లేదు. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల్ని హాయిగా అనుభవించే ఫ్రీడమ్ కాదిది. ‘ఫ్రీగా వస్తే ఫినాయిలైనా’ అనే అద్భు త సంస్కృతి మనది. ఎన్నికలన్నప్పుడల్లా ‘అయ్యో... పింఛన్లంటూ, ఫ్రీలంటూ ఎడాపెడా పంచేస్తున్నారూ, దేశాన్ని వంచిస్తున్నారం’టూ శోకాలు పెడుతుంటారుగానీ అది సరి కాదు. ఉచితమనేది మన సంస్కృతిలో భాగమెలాగో గుర్తెరిగి... ఉచితరీతిన నడవాలి.
మాంఛి హోటలుకెళ్లి డాబుగా బిర్యానీ ఏదో ఆర్డరిస్తామా! వాడిచ్చిన ‘నీంబూ, ప్యాజ్’ కాకుండా సిగ్గుపడకుండా ఎగస్ట్రా ‘ఫ్రీ’లడిగి మళ్లీ మళ్లీ తీసుకుంటుంటాం.
అంతెందుకు... మొన్నెప్పుడో పంజాగుట్టలోని ఓ హోటల్లో ఫ్రీ రైతా (పెరుగు) అడిగినందుకు పంజా విసిరారు కొందరు బేరర్స్. బహుశా... ఉచితాలవీ ఇచ్చేసి ప్రజల్ని సోమరుల్ని చేయడం నచ్చని నికార్సైన కష్టజీవుల బ్యాచీ తాలూకు క్యాపిటలిస్టిక్, కార్పొరేటిక్, కన్సర్వేటిక్ (ఫ్లాగ్)‘బేరర్స్’ కాబోలు వాళ్లంతా.
పాపం... అమాయకుడైన ఆ వినియోగదారుడు చచ్చిపోయి, ‘ఫ్రీ’ల కోసం ప్రాణాలర్పిం చిన త్యాగధనుల లిస్టులోకి చేరిపోయాడు. నిజానికి అందరి సానుభూతికీ ఎంతో అర్హుడతడు. ఎందుకంటే... హోటల్‌వాడు ఎంత ఫ్రీగా ఇచ్చి నా, లెక్కలుగట్టి చూస్తే... మొత్తం ఆ ఫ్రీ ఉల్లిముక్కలూ, నిమ్మచెక్కలూ, రైతా విలువ సదరు కస్టమరిచ్చే టిప్పు–డబ్బు కంటే చాలా చాలా తక్కువ.
అదే లెక్క సోంపుకీ వర్తిస్తుంది. ఎంతగా ‘ఫిల్దీ రిచ్చు’ ఆసామైనా, ఎంతగా డబ్బున్న మొనగాడైనా... ఆ ఫ్రీ సోంపును ఆబగా, ఆత్రంగా తినేవాళ్లే అందరూ! కొందరైతే కక్కుర్తిగా కర్చిఫ్‌లోనో, టిష్యూలోనో పొట్లం కట్టుకుపోతారు. మోజంజాహి మార్కెట్టయినా, మోండా మార్కెట్టయినా, చింతలబస్తీ, చిల్కల్‌గూడా, చింతల్‌కుంటా మరెక్కడైనా... టమాటాలూ, పచ్చి మిరపకాయా, ఉల్లిగడ్డలూ, కూరగాయలూ కొన్నాక, కొసరడగని ఇల్లాలంటూ ఉంటుందా? ఫ్రీగా వస్తే సంతోషించని గృహిణులెవరైనా ఉంటారా?
కేవలం మన నేటివ్స్‌యే కాదు, ఇక్కడే ఓటేసే ఉత్తర భారతీయులు సైతం ‘తర్‌కారీ కే సాథ్... ఫ్రీ ధనియా భీ’ అంటూ కూరగాయల్తో పాటూ కొసరి కొసరి కొత్తిమీర అడిగి మరీ తీసుకుంటుంటారు. అడక్కపోయినా వాళ్ళయినా ఇచ్చిపోతుంటారు.
ఇన్ని ఉదాహరణల తర్వాత చెప్పేదొక్కటే... ‘ఫ్రీ’ కాన్సెప్టు ఇంతగా రక్తంలోకి ఇంకిపోయాక, ‘ఉచితాలం’టూ లేకుండా ఓటేద్దామా? ఓటేస్తామా? చివరగా ఒక్కమాట... సాక్షాత్తూ దేశ పాలకుల సొంత రాష్ట్రానికి చెందిన ‘సంజయ్ ఎఝావా’ అనే సామాజిక కార్యకర్తగారు... ఓ ‘ఆర్టీఐ’ అభ్యర్థన ద్వారా ఆర్‌బీఐని అడిగినప్పుడు వచ్చిన సమాధానం ప్రకారం... ఏలినవారి ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్లకు ‘రైటాఫ్’ చేసిన మొత్తం రూ. 25 లక్షల కోట్లు! బ్యాంకు సొమ్ములెగ్గొట్టేసి సోగ్గా పారిపోయినవారి సొమ్ములకివి అదనం. కార్పొరేట్ ఇన్‌సెంటివ్‌లనీ ఇతర ప్రోత్సాహకాలనేవి మరో ఎక్స్‌ట్రా. ఇవన్నీ కలుపుకుంటే సంక్షేమానికి ఇచ్చేది... ఆ్రస్టిచ్‌గుడ్డు పక్కన ఆవగుండంత!
ఓటర్లను ‘ఉచిత’రీతినే గౌరవించుకుందాం
Published Mon, Oct 23 2023 4:27 AM | Last Updated on Mon, Oct 23 2023 4:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment