సాక్షి, మిర్యాలగూడ: ఇరువురు ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేస్తోంది. కాగా ఈ కులాంతరం చేసుకున్న వారికి 1980 నుంచి ప్రోత్సాహకాలను అందిస్తుండగా.. అప్పట్లో ఈ ప్రోత్సాహకం రూ. 30వేలు ఉండేది. 1993లో దీనిని రూ. 40వేలకు పెంచింది. 2011లో రూ. రూ. 50వేలకు చేయగా.. 2019 అక్టోబరు 30న ఎస్సీలకు చెందిన యువతీ, యువకులను వివాహ చేసుకున్న వారికి నజరానా రూ. 2.50లక్షలకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. జిల్లాలో ఎస్సీ కులాంతర వివాహాల ప్రోత్సాహకాల బాధ్యతను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులకు అప్పగించింది. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు సమాజంలో ఎదురయ్యే పరిణామాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచే విధంగా ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఇందుకోసం కులాంతర వివాహం చేసుకున్న జంటలు ఆన్‌లైన్‌లో www.telanganaepass.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వధువు కాని వరుడు కాని కులాంతర వివాహం చేసుకొని ఉండాలని, వదుధు లేదా వరుడికి రూ. 2లక్షల లోపు ఆదాయం ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు.
సమర్పించాల్సిన పత్రాలు..
- ఇరువురి ఆధార్ కార్డులను జత చేయాలి
- వధూవరులకు బ్యాంకులో జాయింట్ అకౌంట్ కలిగి ఉండాలి.
- కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి
- వివాహం జరిగినట్లు రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది.
- కులాంతర వివాహం చేసుకున్నట్లు సాక్షుల ఆధార్ కార్డులు సైతం జత చేయాల్సి ఉంటుంది.
- వధూవరులు పూర్తి చిరునామా కలిగి ఉండాలి.
ఇప్పటి వరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు
కులాంతర వివాహం చేసుకున్న వారికి ఇప్పటివరకు రూ. 50వేలు ఉండగా.. ప్రభుత్వం వారికి చేయూతనిచ్చేందుకు రూ. 2.50లక్షలకు పెంచింది. అయితే కులాంతర వివాహం చేసుకున్న వారికి 3 ఏళ్ల పాటు డిపాజిట్ చేసిన చెక్కును అందించడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ప్రోత్సాహకాలు తప్పనిసరిగా అందుతాయి. పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి.
– రాజ్‌కుమార్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment