
లండన్ : ఎలక్ర్టిక్ వాహనాల వినియోగాన్ని పలు దేశాలు ప్రోత్సహిస్తున్న క్రమంలో బ్రిటన్ ఓ ఆకర్షణీయ ప్రతిపాదనతో ముందుకురానుంది. డీజిల్, పెట్రోల్ వాహన యజమానులు ఎలక్ర్టిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తే వారికి 6000 పౌండ్లు అందించేందుకు బ్రిటన్ కసరత్తు చేస్తోంది. నూతన వాహనాలకు డిమాండ్ పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ వంటి రెండు ప్రయోజనాలు నెరవేరేలా ఈ ప్రతిపాదనపై బ్రిటన్ యోచిస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ వంటి పలుదేశాలు ఎలక్ర్టిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న క్రమంలో బ్రిటన్ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.
కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చేందుకు కార్ స్క్రాపేజ్ స్కీమ్‌ను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్నారని టెలిగ్రాఫ్ పేర్కొంది. కరోనా లాక్‌డౌన్‌తో కార్ల తయారీదారుల ఉత్పత్తి, సరఫరాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా వాహనాలకు డిమాండ్ సైతం రికార్డు కనిష్టాలకు పడిపోయింది. కొత్తగా ఎలక్ర్టిక్ వాహనాల కొనుగోళ్లకు రాయితీలు అందిస్తే బ్రిటన్‌లో వాహన తయారీ కంపెనీలకు ఊతమిచ్చినట్టు అవుతుందని టెలిగ్రాఫ్ పేర్కొంది.
భారత్‌లోనూ..
పాత కార్లను వదిలించుకుని ఎలక్ర్టిక్ వాహనాలు, నూతన వాహనాలను కొనుగోలుచేసే వారికి ప్రోత్సాహకంగా కార్ స్ర్కాపేజ్ పాలసీకి భారత్ తుదిమెరుగులుదిద్దుతోంది. ఈ ప్రతిపాదన భారత ఆటోమొబైల్ పరిశ్రమకు కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఈ దిశగా నూతన విధానానికి శ్రీకారం చుడతామని ఎంఎస్‌ఎంఈ, ఉపరితల రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల సానుకూల సంకేతాలు పంపారు.