న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నాటికి, ఎనిమిది రంగాలకు రూ.4,415 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్ర సర్కారు మంజూరు చేసింది. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ విభాగం డీపీఐఐటీ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.11,000 కోట్లను మంజూరు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు ప్రకటించారు.
కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకే చూస్తే అక్టోబర్ నాటికి జారీ చేసిన మొత్తం రూ.1,515 కోట్లుగా ఉన్నట్టు, 2022–23లో రూ.2,900 కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు. పెద్ద స్థాయి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ, ఐటీ హార్డ్‌వేర్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫార్మా, టెలికం, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్స్ రంగాలకు ఈ ప్రోత్సాహకాలను అందించినట్టు తెలిపారు. శామ్‌సంగ్ కంపెనీకి సంబంధించి ప్రోత్సాహకాల క్లెయిమ్‌లలో ఒక కేసు పరిష్కారమైనట్టు చెప్పారు.
2021లో కేంద్ర సర్కారు 14 రంగాలకు పీఎల్‌ఐ పథకాల కింద ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. టెలికం, వైట్ గూడ్స్, టెక్స్‌టైల్స్, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహారోత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా తదితర రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. వీటికి సంబంధించి దేశీ తయారీని ప్రోత్సహించాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది.
పీఎల్‌ఐ కింద ప్రోత్సాహకాల పంపిణీ అన్నది ఆయా శాఖల బాధ్యతగా ఠాకూర్ చెప్పారు. ప్రాజెక్టు పర్యవేక్షక ఏజెన్సీలు (పీఎంఏలు), కంపెనీల మధ్య సరైన సమాచారం లేకపోవడం వల్ల సమయం వృధా అవుతున్న సందర్భాలున్నట్టు తెలిపారు. దీంతో దరఖాస్తుల మదింపు ప్రక్రియకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రామాణిక విధానాన్ని రూపొందించుకోవాలని ఆదేశించినట్టు వెల్లడించారు.
రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
ఇప్పటి వరకు పీఎల్‌ఐ కింద 14 రంగాల్లోని కంపెనీల నుంచి 746 దరఖాస్తులు వచ్చాయని, ఇవి రూ.3 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు రాజీవ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. 2023 నవంబర్ నాటికి రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడులు నమోదైనట్టు చెప్పారు. వీటి ద్వారా రూ.8.61 లక్షల కోట్ల అమ్మకాలు, 6.78 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఫార్మా, టెలికం తదితర రంగాల్లో ప్రోత్సాహకాలను అందుకునే వాటిల్లో 176 ఎంఎస్‌ఎంఈలు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. పీఎల్‌ఐ ప్రోత్సాహకాల మద్దతుతో రూ.3.2 లక్షల కోట్ల ఎగుమతులు నమోదైనట్టు ఠాకూర్ తెలిపారు. ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికం రంగాల భాగస్వామ్యం ఎక్కువగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment