మూడోరోజూ ముమ్మర వడపోత | Cong will strike balance in selecting candidates | Sakshi
Sakshi News home page

మూడోరోజూ ముమ్మర వడపోత

Published Sat, Oct 13 2018 2:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారుపై స్క్రీనింగ్‌ కమిటీ మూడోరోజు తీవ్ర కసరత్తు చేసింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు వడపోత కార్యక్రమాన్ని కొనసాగించింది. గెలుపు అవకాశాలు, సామాజికాంశాలను దృష్టిలో పెట్టుకుంటూ 119 నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సూక్ష్మస్థాయిలో పరిశీలన చేసింది.

దీనికోసం పార్టీ కీలక నేతలు, సీనియర్లు, జిల్లా కమిటీల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీలు జరిపింది. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్, సభ్యులు శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై గోల్కొండ హోటల్‌లో వరుస భేటీలు జరిపారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహా, మాజీ కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, నేతలు డీకే అరుణ, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరేపల్లి మోహన్‌ కమిటీ తో విడివిడిగా భేటీ అయ్యారు. జిల్లాల్లో పరిస్థితులను, గెలిచే అవ కాశం ఉన్న అభ్యర్థుల వివరాలను అందించారు.  

అభ్యర్థుల బలాబలాలపై ఆరా
నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల బలాలు, బలహీనతలపై స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు సమాచారం సేకరించారు. అభ్యర్థులు సమర్పించిన సెల్ఫ్‌ అఫిడవిట్‌లో బలాలనే పేర్కొనగా, కమిటీ సభ్యులు మాత్రం బలహీనతల కోణం నుంచీ సమాచారం రాబట్టారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ చేయించిన సర్వే వివరాలతో అభ్యర్థుల పేర్లను సరిచూసుకుంటూ జాబితాను వడపోస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎన్నికల కమిటీ 30 స్థానాలకు ఒక్కో పేరుతో కూడిన జాబితాను కమిటీకి అందించింది.

మరో పది పన్నెండు చోట్ల రెండేసి పేర్లను సూచించగా, మెజార్టీ స్థానాల్లో మూడు నుంచి ఆరు పేర్లతో జాబితాను కమిటీకి అందించిన విషయం తెలిసిందే. అయితే, కమిటీ ఒక్క పేరున్న స్థానాలను వదిలేసి, మిగతా చోట్ల అభ్యర్థుల పేర్లపై భిన్న కోణాల్లో సమాచారం సేకరించింది. ఈ నెల 15 నాటికి కనీసంగా 90 స్థానాల్లో ఒక్కో పేరును సూచిస్తూ, మిగతా స్థానాల్లో రెండేసి పేర్లతో జాబితాను రూపొందించి పార్టీ కోర్‌ కమిటీకి అందించే అవకాశముంది.

ఈ నెల 16న ఢిల్లీలో జరిగే ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కోర్‌కమిటీ సమావేశంలో ఒక్కో పేరుతో ఉన్న జాబితాను ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం అవసరమైతే టికెట్లు దక్కని నేతలతో కోర్‌కమిటీ కానీ, ఇతర నేతలు కానీ చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెండు పేర్లు సూచించిన స్థానాలపై మరోమారు చర్చించి తుది నిర్ణయానికి రానున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement