సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఇంకా ప్రకటించని 19 స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కట్టబెట్టిన నేపథ్యంలో ఆయన దీనిపై దృష్టి సారించారు. ఆదివారం తెలంగాణ పర్యటన సందర్భంగానే ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న ఖర్గే సోమవారం కూడా కొందరు నేతలతో చర్చించారు.
పటాన్‌చెరు, నారాయణఖేడ్, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలకు సంబంధించి సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహతో మాట్లాడిన ఖర్గే, కమ్యూనిస్టులతో పొత్తులు, వారికి సంబంధించిన సీట్లపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో చర్చించారు. నల్లగొండ జిల్లాకు సంబంధించిన స్థానాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
కమ్యూనిస్టులకు ఇచ్చే ఆ నాలుగు మినహా
కమ్యూనిస్టులకు ఇవ్వాలని భావిస్తున్న నాలుగు నియోజకవర్గాలు మినహా, మిగతా 15 స్థానాలకు అభ్యర్థులను సోమవారం సాయంత్రానికే ఫైనల్ చేస్తారని భావించారు. అయితే రాజస్తాన్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తులో అధిష్టాన పెద్దలు బిజీగా ఉండటంతో ఆ ప్రక్రియను మంగళవారం పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చి నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రికి లేదా బుధవారం ఉదయానికి జాబితా ప్రకటించే అవకాశం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలంతా ఢిల్లీలోనే తిష్టవేసి అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment