విలేకరులతో మాట్లాడుతున్న లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఈ వారంలోనే ఖరారు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 3, 4, 5 తేదీల్లో అభిప్రాయాలను సేకరించి, పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపు గుర్రాలను గుర్తిస్తామన్నారు. వచ్చే వారంలో వాటిని క్రోడీకరించి, పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పంపించి, ఆమోదం తీసుకొని ప్రకటిస్తామన్నారు.
సోషల్ వర్కర్ రమాకాంత్‌రెడ్డి తన అనుచరులతో మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగిందని, ఈ నెల 3న పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి సంతోష్ నేతృత్వంలో ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ భేటీ కానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై అంశాల వారీగా నివేదికలు రూపొం దించేందుకు చార్జిషీట్ కమిటీని ఏర్పాటు చేశామని, దానికి చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, వైస్‌చైర్మన్‌గా సంకినేని వెంకటేశ్వర్‌రావు, కన్వీనర్‌గా డాక్టర్ మనోహర్‌రెడ్డి కొనసాగుతారన్నారు.
యువ ఓటర్లతో సమ్మేళనాలు
ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి విడతలో 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ సమ్మేళనాలు నిర్వహిస్తామని లక్ష్మణ్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యువ ఓటర్లతో సమ్మేళనాలు, ఓబీసీ సదస్సులను నిర్వహిస్తామని చెప్పారు. 40 అసెంబ్లీ స్థానాల్లో భారీ సమ్మేళనాలు, 31 యువ సమ్మేళనాల నిర్వహణ తేదీలనూ ఇప్పటికే ఖరారు చేశామన్నారు. బీజేపీపై, ప్రధాని మోదీపై విమర్శలు చేసే హక్కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై దృష్టి పెట్టి కాంగ్రెస్ చిత్త శుద్ధి ఏంటో చాటుకోవాల్సింది పోయి, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ దోబూచులాడుతూ బీజేపీపై పడుతున్నాయని పేర్కొన్నారు.
మోదీని కేసీఆర్‌తో పోల్చే విచిత్రమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. కేసీఆర్ రోజులో 18 గంటలు ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఎప్పుడు మాయం అవుతారో.. ఎప్పుడు తేలుతారో.. ఏ దేశంలో ఉంటారో.. ఎప్పు డు వస్తారో తెలియని రాహుల్‌తో ప్రధానిని పోల్చ డం ఏంటని ప్రశ్నించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, మజ్లిస్ కలసి పోటీ చేసిన విషయాన్ని ఉత్తమ్ మరిచిపోయినట్లు ఉన్నారన్నారు. పాతబస్తీ పాము అయిన మజ్లిస్‌ను పెంచి పోషించిందీ కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.
ఓటు కాంగ్రెస్‌కు వేసినా, టీఆర్‌ఎస్‌కు వేసినా మజ్లిస్‌కు వేసినట్లేనన్నారు. దారుస్సలాం కేంద్రంగా బీజేపీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. తెలంగాణ వద్దన్న ఎంఐఎంపై టీఆర్‌ఎస్‌కు ఉన్న ప్రేమ ఏంటని ప్రశ్నిం చారు. రజాకార్ల నయా వారసులుగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పోటీ పడుతున్నాయని తెలిపారు. సీఖో ఔర్ కమావో.. మౌలానా అజాద్ నేషనల్ ఫెలోషిప్, పడావో పర్‌దేశ్ వంటి అనేక పథకాలను మైనార్టీల కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. వీటి గురించి ఎంఐఎంకు తెలియదా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment