![Bjp aim at the highest positions - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/1/bjp.jpg.webp?itok=cxTeqa6y)
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా దక్షిణాదిలో పట్టు సాధించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది ఈ మేరకు హస్తిన వేదికగా రాష్ట్ర నాయకత్వంతో సమాలోచనలు జరుపుతోంది. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన వారు, ప్రజాదరణ ఉన్న నేతలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసేలా కసరత్తు చేస్తోంది.
రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, సీనియర్ నేత ఈటల రాజేందర్‌లు బుధవారం ఢిల్లీలో జాతీయ నాయకత్వంతో భేటీ అయ్యారు. మరోవైపు కిషన్‌రెడ్డి పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై దాదాపు 40 నిమిషాలు చర్చించారు.
కాగా ఆయా సమావేశాల్లో 17 లోక్‌సభ స్థానాల్లో పార్టీ బలాబలాలు, తాజా రాజకీయ పరిస్థితి, బలమైన నేతలు, ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్టు సమాచారం.
నడ్డా దిశా నిర్దేశం
మంగళవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలోనూ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన ప్రణాళికలపై అధ్యక్షుడు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ బలంగా ఉన్నందున, దక్షిణాదిలోనూ ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలిచేందుకు సిద్ధం చేసిన రోడ్‌మ్యాప్‌పై చర్చించారు.
రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రుల ప్రచార సభలు, రోడ్ షోలు తదితర ప్రచార కార్యక్రమాల షెడ్యూల్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్ కుమార్‌లు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా చర్చించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎ న్నికలపై ఏ విధంగా పడుతుందన్న అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు కేవ లం సీనియర్లు అనే కాకుండా యువత, మహిళలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను సైతం సీట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకోవాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment