43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న పోలింగ్
రాంచీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు. బుధవారం తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. తొలిదశ పోలింగ్ జరుగుతున్న 43 స్థానాల్లో 17 జనరల్, 20 ఎస్టీ రిజర్వ్, ఆరు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపయి సోరెన్ పోటీ చేస్తున్న సెరాయ్‌కెల్లా నియోజకవర్గంలోనూ బుధవారమే పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ జంషెడ్‌పూర్ ఈస్ట్ నుంచి బరిలో దిగారు.
ఇక్కడ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ కోడలు పూర్ణిమా సాహూ పోటీచేస్తున్నారు. జంషెడ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సతీమణి గీత బీజేపీ తరఫున బరిలో దిగారు. ఇక్కడ కాంగ్రెస్ నేత సోనారాం సింకూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జంషెడ్‌పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ నేత, ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా పోటీచేస్తున్నారు. ఈయనపై జేడీయూ నేత సరయూరాయ్ బరిలోకి దిగారు. సరయూరాయ్ 2019లో నాటి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌నే ఓడించడం విశేషం. రాంచీలో ఈసారి జేఎంఎం ప్రస్తుత రాజ్యసభ సభ్యులైన మహువా మాఝీని రంగంలోకి దింపింది.
ఐదవ జార్ఖండ్ శాసనసభ కాలపరిమితి వచ్చే ఏడాది జనవరి ఐదో తేదీన ముగియనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగతా 38 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.
10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు
బుధవారమే 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానానికీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రెండుచోట్ల పోటీచేసి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఆమెపై ఎల్‌డీఎఫ్ నుంచి సథ్యాన్ మోకేరీ, బీజేపీ తరఫున నవ్య హరిదాస్ నిలబడ్డారు. ఇక 31 ఎమ్మెల్యే స్థానాల్లో రాజస్తాన్‌లో 7, పశ్చిమబెంగాల్‌లో 6, అస్సాంలో 5, బిహార్‌లో 4, కర్నాటకలో 3 మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment