‘చేయి’ తిరిగినోళ్లు కావాలి! | The final list of telangana congress will be available on 9th | Sakshi
Sakshi News home page

‘చేయి’ తిరిగినోళ్లు కావాలి!

Published Wed, Nov 7 2018 1:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

The final list of telangana congress will be available on 9th - Sakshi

కాంగ్రెస్‌ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న జానారెడ్డి, షబ్బీర్, రేవంత్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు అధిష్టానం కనుసన్నల్లో ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సుదీర్ఘ కస రత్తు చేస్తోంది. ఇప్పటికే 57 స్థానాల్లో అభ్యర్థుల ఎం పిక పూర్తయి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం కూడా పొందింది. ఇక మిత్రపక్షాల కోసం పక్కనపెట్టిన 24 స్థానాలను తీసేయగా మిగిలిన 38 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్‌ కమిటీ మంగళవారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో సుదీర్ఘంగా కసరత్తు జరిపింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం అర్ధరాత్రి వరకూ కొనసాగింది.

రాహుల్‌ ఆంతరంగికుడు కొప్పుల రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, తెలంగాణ స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్, సభ్యులు షర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, తెలంగాణ ఇన్‌చార్జి ఏఐసీసీ కార్యదర్శులు సలీం అహ్మద్, బోసురాజు, శ్రీనివాసన్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ఎస్టీ, ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాలు, తదుపరి జనరల్‌ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేశారు.

టీడీపీకి 14, టీజేఎస్‌కి 7 నుంచి 8 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు ప్రచారం జరుగుతున్నా, అవి పోటీ చేసే స్థానాలు నిర్ధిష్టంగా తేలలేదు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా అంగీకారానికి వచ్చిన సీట్లను వదిలేసి మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ తమ అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. మెజారిటీ స్థానాల్లో ఒకే పేరును ప్రతి పాదించినప్పటికీ పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో రెండేసి పేర్లను ప్రతిపాదించినట్టు సమాచారం.

అం తిమంగా సామాజిక సమీకరణాలకు అనుగుణంగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించి వీటిలో అసలు అభ్యర్థిని ఎంపిక చేయనుంది. ఆశావహుల మధ్య అత్యంత పోటీ ఉండి, ఆయా స్థానాలు మిత్రపక్షాలు అడుగుతున్న పరిస్థితి ఉంటే వాటిని మిత్రపక్షాలకే వదిలేసేందుకు స్క్రీనింగ్‌ కమిటీ మొగ్గు చూపుతున్న ట్టు తెలిసింది. తాజా ప్రతిపాదనలను స్క్రీనింగ్‌ కమి టీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందజేయనుంది. ఎన్నికల కమిటీ ఈ నెల 8న సమావేశమై అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసి పార్టీ అధ్యక్షుడి ఆమో దం కోసం పంపనుంది. ఈ నెల 9న అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది.  

ఎంపికకు ఇవే ప్రామాణికం..
గెలిచే సత్తా, సామాజిక న్యాయం, మహిళలు, యువతకు ప్రాతినిధ్యం వంటి అంశాలపై స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు సమతూకం పాటించే ప్రయత్నం చేయగా, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వారి వారి సామాజిక వర్గాల ప్రాతినిధ్యానికి అనుగుణంగా, వారి వెన్నంటి ఉండే నేతలకు అవకాశం కల్పించేందుకు వీలుగా పలు అభ్యర్థనలు స్క్రీనింగ్‌ కమిటీ ముందుంచినట్టు తెలిసింది. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి స్క్రీనింగ్‌ కమిటీ పూర్తిగా చెక్‌ పెడుతోందని సమాచారం. ముఖ్య నేతలు ఇద్దరు తమ అనుచరవర్గానికి, బంధువర్గానికి స్థానాలు కోరినప్పటికీ స్క్రీనింగ్‌ కమిటీ వాటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వనట్టు తెలిసింది.

సామాజిక న్యాయం దిశగా...
బీసీలకు 28 నుంచి 30 స్థానాలు కేటాయించేలా స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు సాగిందని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ కంటే మెరుగ్గా బీసీ ప్రాతినిధ్యం ఉండేలా సం ప్రదింపులు కొనసాగినట్టు సమాచారం. ఎస్సీలకు 19 రిజర్వుడ్‌ స్థానాలు ఉండగా అదనంగా జడ్చర్ల స్థానాన్ని కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిలో 12 స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి, 8 స్థానాలు మాల సామాజిక వర్గానికి కేటాయించినట్టు సమాచా రం. మాల సామాజిక వర్గానికి చెన్నూరు, బెల్లంపల్లి, చొప్పదండి, జహీరాబాద్, వికారాబాద్, తుంగతుర్తి, మధిర, స్టేషన్‌ ఘన్‌పూర్‌ స్థానాలను కేటాయిస్తున్న ట్టు సమాచారం. వీటిలో చెన్నూరు, బెల్లంపల్లి స్థానా లు మిత్రపక్షాలు కోరుతున్నాయి.

ఇక మాదిగలకు జుక్కల్, మానకొండూర్, ధర్మపురి, ఆందోల్, చొప్ప దండి, కంటోన్మెంట్, చేవెళ్ల, అలంపూర్, అచ్చంపేట, నకిరేకల్, సత్తుపల్లి, వర్ధన్నపేట స్థానాలను కేటాయిస్తున్నట్టు తెలిసింది. వీటిలో సత్తుపల్లి, వర్ధన్నపేట సీట్లను మిత్రపక్షాలు అడుగుతున్నాయి. ఇక 12 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో ఒకే పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. రిజర్వ్‌డ్‌ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో లీడర్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ ఇన్‌ రిజర్వ్‌డ్‌ కాన్‌స్టిట్యుయెన్సీస్‌ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది.


తుది జాబితాలో మాజీ ఎంపీలు
మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సురేష్‌ షెట్కార్, విజయశాంతి, బలరాం నాయక్, మల్లు రవి పేర్లను స్క్రీనింగ్‌ కమిటీ తుది జాబితాలో చేర్చినట్టు సమాచారం. పొన్నం కరీంనగర్‌ నుంచి, సురేష్‌ షెట్కార్‌ నారాయణఖేడ్‌ నుంచి, బలరాం నాయక్‌ మహబూబాబాద్‌ నుంచి, విజయశాంతి మెదక్‌ నుంచి, మల్లు రవి జడ్చర్ల నుం చి పోటీ చేసేందుకు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు, అరవిందరెడ్డి మధ్య గట్టిపోటీ నెలకొంది. సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమేష్‌ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ రెండు స్థానాలపై స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో చాలాసేపు కసరత్తు జరిగినట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement