సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా తేదీ ప్రకటించలేదు. కానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తానని కాంగ్రెస్ చెబుతోంది. సోమవారం లేదా మంగళవారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తామని, దానితో ఎవరెవరు టికెట్లు ఆశిస్తున్నారో స్పష్టమవుతుందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ చెప్పారు. ఈసారి ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వడం కోసం ప్రజలకు సుపరిచితులైన పలువురు ప్రముఖ నేతలను ఎన్నికల బరిలోకి దింపాలని ఢిల్లీ కాంగ్రెస్ భావిస్తోంది.
గతంలో ఈ నేతలు ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ కొత్తవారికి టికెట్ ఇచ్చే బదులు పాతవారికే ఇచ్చినట్లయితే విజయావకాశాలు అధికంగా ఉంటాయని, వారితో అసెంబ్లీలో తన సంఖ్యాబలం మెరుగుపడ్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. పోటీ చేయబోయే అభ్యర్థులను కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకమునుపే ప్రకటించాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. దానివల్ల అభ్యర్థులకు ఎక్కువ ప్రచార సమయం లభిస్తుందని ఆ పార్టీ యోచిస్తోంది. ఈ ఉద్దేశంతోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఒకటి రెండు రోజులలో ఆరంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం దరఖాస్తుల ఫారాలను ఖరారు చేస్తున్నారు.
వాటిలో టికెట్ ఆశిస్తున్న వారి పేరు, చిరునామా, పార్టీకి అందించిన సేవలతో పాటు వారిపైనున్న కేసులను గూర్చిన వివరాలను అడగనున్నారు. దరఖాస్తు పత్రాలతో పాటు కొంత రుసుమును కూడా వసూలు చేస్తే ఎలా ఉంటుందని పార్టీ యోచిస్తోంది. పార్టీ అధికారంలో లేనందువల్ల నిధుల కొరత ఉందని, ఈ సమస్యను అధిగమించడం కోసం దరఖాస్తుదారుల నుంచి కొత రుసుము వసూలు చేయాలని అనుకుంటన్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, 1993 ఎన్నికలలో కూడా దరఖాస్తు ఫారాలతో పాటు రుసుము వసూలు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తొందరపడ్తున్న కాంగ్రెస్
Published Fri, Nov 7 2014 10:45 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement