సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పరిధిలో అసెంబ్లీ టికెట్లపై పంచాయితీ ముదిరింది. దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేస్తున్న తమకే టికెట్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్ వాదులు.. గెలుపు అవకాశాలున్న తమకే టికెట్లు కావాలంటూ వలస నేతలు ఎవరికి వారు గట్టిగా పట్టుబట్టడంతో ఈ వ్యవహారం ఢిల్లీలో హైకమాండ్ పెద్దలకు చేరింది. ఉమ్మడి పాలమూరు నేతలు దీనిపై వరుసగా ఫిర్యాదులు చేస్తుండటంపై పార్టీ పెద్దలు స్పందించినట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై పునఃపరిశీలన చేయాలని ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందాన్ని ఆదేశించినట్టు సమాచారం.
పార్టీకి సేవ చేసినవారికి గుర్తింపేదీ?
అభ్యర్థుల ఎంపికపై పార్టీ స్క్రీనింగ్ కమిటీ ప్రతి భేటీలోనూ కాంగ్రెస్ వాదులు, వలసవాదులు అన్న పంచాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ప్యారాచూట్లకు టికెట్ల కేటాయింపుపై ఆచితూచి వ్యవహరించాలని సీనియర్ నేతలు ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. వారికే 60 శాతానికిపైగా సీట్లిస్తే తొలినుంచీ కాంగ్రెస్‌లో ఉన్నవారిలో నైరాశ్యం నెలకొంటుందని, పార్టీకి పనిచేసేవారు కరువవుతారని వారు స్పష్టం చేస్తున్నారు.
పార్టీ అధికారంలోకి వస్తే సరేగానీ, రానిపక్షంలో ప్యారాచూట్లంతా ఎగిరిపోవడం ఖాయమ ని.. అదే జరిగితే పార్టీ ప్రాథమిక నిర్మాణా నికే ముప్పు ఉంటుందని పేర్కొంటున్నారు. అయినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ని సగానికిపైగా సీట్లను ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.
ఏడింటిలో ఐదు వారికే అయితే..
♦ నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో ఐదింటిని ప్యారాచూట్ నేతలకే ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కల్వకుర్తిలో ఇటీవల పార్టీలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్ ఫైనల్ కానుందని.. స్థానిక నేత చల్లా వంశీచంద్‌రెడ్డిని ఒప్పించాకే ఇక్కడ టికెట్ కేటాయింపుపై ముందుకు వెళ్తుండటంతో వివాదం లేదని చెప్తున్నాయి.
♦ నాగర్‌కర్నూల్‌లో సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డిని కాదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డికి టికెట్ ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై నాగం వర్గం నేతలు ఇటీవలే గాం«దీభవన్‌లో గొడవ చేశారు కూడా. టికెట్ విషయంలో నాగం స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సహా ఇతర పెద్దలకు ఫిర్యాదు చేశా రు. బీఆర్‌ఎస్ అక్రమాలపై, ప్రాజెక్టుల్లో అవినీతిపై బలంగా పోరాడుతున్న తన ను పక్కనపెట్టే ప్రయత్నాలపై హైకమాండ్ వద్దే తేల్చుకోవాలని భావిస్తున్నారు.
♦ వనపర్తిలో పార్టీ సీనియర్ నేత జి.చిన్నారెడ్డికి ప్రత్యామ్నాయంగా బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన మేఘారెడ్డికి టికెట్ ఇవ్వొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనితో చిన్నారెడ్డి ఢిల్లీ వెళ్లి కేసీ వేణుగోపాల్ సహా ఏఐసీసీ స్థాయిలో తనకు సన్నిహితంగా ఉండే పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఆయన స్క్రీనింగ్ కమిటీ సభ్యులనూ కలిసినట్టు సమాచారం.
♦ బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడంపై తొలి నుంచీ అసంతృప్తితో ఉన్న కొల్లాపూర్ నేత జగదీశ్వర్‌రావు సైతం ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలను కలిశారు.
♦ గద్వాలలో బీఆర్‌ఎస్ జెడ్పీచైర్మన్ సరితా తిరుపతయ్యకు కాంగ్రెస్ టికెట్ దక్కిందన్న ప్రచారంతో రగిలిపోతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, ఓయూ విద్యార్థి నేత కురువ విజయకుమార్‌లు కూడా ఖర్గే, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, నజీర్ హుస్సేన్, జిగ్నేశ్ మేవానీ, ముకుల్‌వాస్నిక్‌లను కలిశారు. కేవలం మూడు నెలల ముందు పార్టీలో చేరిన సరితకు టికెట్ ఇవ్వొద్దని, తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
♦ మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని మక్తల్‌లో పదిహేను రోజుల కింద కాంగ్రెస్‌లోకి వచ్చిన కొత్తకోట సిద్ధార్థరెడ్డికి వ్యతిరేకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు వాకాటి శ్రీహరి ఢిల్లీలోనే మకాం వేశారు.
♦ మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి వచ్చిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ.. స్థానిక నేతలు ఒబేదుల్లా కొత్వాల్, సంజీవ్ ముదిరాజ్, ఎన్‌పీ వెంకటేశ్ తదితర నేతలు అభ్యంతరాలు చెప్తున్నారు.
♦ ఇన్ని పంచాయితీల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పునః పరిశీలన చేయాలని సునీల్ కనుగోలు టీమ్‌కు హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. ఆయా స్థానాల్లో ఇతర అభ్యర్థుల బలాబలాలపై బేరీజు వేయాలని సూచించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment