సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాము చెప్పిందే వేదం... చేసిందే చట్టం... అన్నరీతిలో సాగుతోంది టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విధానం. తండ్రీకొడుకులు వేర్వేరు జాబితాలు సిద్ధం చేసుకోవడంతో వారి మధ్య సయోధ్య నడవక... మరోవైపు ఎక్కడ జాబితా ప్రకటించేస్తే అసమ్మతి నేతలు బయటకు వెళ్లిపోతారోనన్న భయంతో ఎక్కడా అభ్యర్థులను ఖరారు చేయకుండా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా తయారవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షులకే తాము కోరుకున్న చోట టికెట్ దొరికే అవకాశం లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది.
ఎంపీగానే వెళ్లాలని అధిష్టానం హుకుం
అనంతపురం జిల్లాకు కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లాకు బి.కె.పార్థసారథి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ అసెంబ్లీ టికెట్లు లేవని పరోక్షంగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం లేనందున ఎంపీలుగా పోటీ చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇద్దరూ ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం కాలవ శ్రీనివాసులు తాను రాయదుర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు.
అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీగానే వెళ్లాలని నారా లోకేశ్ తన సన్నిహితుల వద్ద తెగేసి చెప్పినట్టు తెలిసింది. బీకే పార్థసారథి కూడా ఎంపీగా వెళ్లడానికి సుముఖంగా లేరు. మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు పెనుకొండ టికెట్ ఇవ్వకుండా ఎంపీగా వెళ్లమనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉరవకొండకు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా టికెట్ గురించి ప్రస్తావించగా.. ఆయన దాటవేసినట్టు తెలుస్తోంది.
టికెట్లు ప్రకటించేస్తే వెళ్లిపోతారేమో..
ఇప్పటికిప్పుడు టికెట్లు ఖరారు చేసేస్తే అసమ్మతి నేతలంతా పార్టీని వదిలి వెళ్లిపోతారేమోననే ఆందోళనతోనే అధినేత చంద్రబాబు సాగదీత ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు దాదాపు ఖరారై... ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా ఇప్పటికీ టీడీపీలో అభ్యర్థులెవరో తేలకపోవడం విశేషం.
తాడిపత్రి, హిందూపురం, ఉరవకొండ మినహా.. మిగతా 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్థి ఎవరన్నది తెలియని పరిస్థితి నెలకొంది. అనంతపురం అర్బన్ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యయం కోసం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులకు చంద్రబాబు, లోకేశ్‌లు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment