వ్యూహం.. ప్రతివ్యూహం
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తుల్ని ఆహ్వానించడం జరుగుతూ వస్తోంది. ఈ దరఖాస్తుల రూపంలో పార్టీలకు రాబడి ఎక్కువే. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా పార్టీలు దరఖాస్తుల పర్వంను ఇప్పటికే ముగించాయి. ఇక అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. అన్నాడీఎంకేలో దరఖాస్తుల పర్వం సాగినా, అభ్యర్థి ఎంపిక మాత్రం అధినేత్రి, సీఎం జయలలిత కనుసన్నల్లో జరగడం పరిపాటే. ఇక డీఎంకే, డీఎండీకే పార్టీలు దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు ఇంటర్వ్యూలు జరపడం, తదుపరి తమ దృష్టిలో ఉన్న వాళ్లకు చోటు కల్పించడం జరుగుతూ వస్తోంది.
ఆ దిశగా ఇప్పటికే పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ పార్టీలు ఇంటర్వ్యూల పర్వాన్ని ప్రారంభించాయి. ఇక డీఎంకే, డీఎండీకేలు అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లో భాగంగా ఇంటర్వ్యూల పర్వానికి సోమవారం శ్రీకారం చుట్టాయి. అన్నా అరివాలయంలో మెగా కూటమి ఏర్పాటు, అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలతో పరుగులు తీస్తున్న డీఎంకే తరఫున ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించారు.
234 నియోజకవర్గాల్లో తమ కంటే తమకు సీట్లు ఇవ్వాలని కోరుతూ ఎనిమిది వేల మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే, మరి కొందరు, తమ నియోజకవర్గంలో అంటే, తమ నియోజకవర్గంలో అధినేత కరుణానిధి, దళపతి స్టాలిన్, ఎంపీ కనిమొళిల కోసం దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధినేత కరుణానిధి నిర్ణయించారు. వచ్చిన దరఖాస్తులను జిల్లాలు, నియోజకవర్గాల వారీగా విభజించి ఇంటర్వ్యూలకు శ్రీకారం చుట్టారు.
అధినేత కరుణానిధి సమక్షంలో ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్, సీనియర్‌నేత దురై మురుగన్‌ల నేతృత్వంలో తేనాం పేటలోని అన్నా అరివాలయంలో ఉదయం ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాధపురం జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా ఆశావహులకు ఇంటర్వ్యూలు జరిగాయి. సాయంత్రం నాలుగు గంటలకు విరుదునగర్, తేని, దిండుగల్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు జరిగాయి.
మంగళవారం తొమ్మిది గంటలకు శివగంగై, మదురై, ఈరోడ్, సాయంత్రం నాలుగు గంటలకు నీలగిరి, కోయంబత్తూరు, సేలం జిల్లాల్లోని ఆశావహులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈనెల 27వ తేదీతో ఇంటర్వ్యూలు ముగియనున్నాయి. ఈ ఇంటర్వ్యూల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఆశావహుడికి నియోజకవర్గం మీదున్న పట్టు, అవగాహన, ప్రజా సమస్యలతో పాటుగా గెలుపు అవకాశాలకు సంబంధించి ప్రశ్నల్ని సందిస్తున్నారు. కాగా, ఆశావహుల్లో పలువురు అన్నదమ్ముళ్లు భార్య భర్తలు సైతం ఉండడం, ఒకే నియోజకవర్గం సీటు కోసం వీళ్లంతా దరఖాస్తులు చేసుకుని ఉండడం విశేషం.
డీఎండీకే కార్యాలయంలో: పొత్తు ఎవరితో అన్నది తేల్చనప్పటికీ అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లో డీఎండీకే అధినేత విజయకాంత్ నిమగ్నం అయ్యారు. 234 స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక అంటూ ఇంటర్వ్యూలకు శ్రీకారం చుట్టినా, తదుపరి పరిణామాల మేరకు పొత్తు ఖారారుతో సీట్ల పంపకాల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాకు ప్రత్యేక కార్యచరణతో విజయకాంత్ ముందుకు సాగుతున్నారు. ఉదయం కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్న ఆశావహులను విజయకాంత్, ఆయన బావ మరిది, యువజన నేత సుదీష్, పార్టీ నాయకులు చంద్రకుమార్, ఇలంగోవన్, పార్థసారథి ఇంటర్వ్యూలు చేసే పనిలో పడ్డారు.
పార్టీలో ఎంత కాలం ఉన్నారో, పార్టీ కోసం ఇన్నాళ్లు ఏమి చేశారో, పార్టీ పిలుపుతో చేపట్టిన కార్యాక్రమాలు, తదితర అంశాలతో ఆశావహుల్ని విజయకాంత్ ప్రశ్నిస్తుండడం విశేషం. అలాగే, స్థానికంగా ఉన్న ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ, పార్టీ కోసం శ్రమిస్తున్న వాళ్లకే సీటు అని ఆశావహులకు సూచిస్తున్నారు.
తొలి రోజు తిరువళ్లూరు, కన్యాకుమారి, నీలగిరి, తిరునల్వేలి జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా ఆశావహులకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఇక, పలువురు ముఖ్య ఆశావహుల వద్ద పొత్తు ఎవరితో పెట్టుకుంటే బాగుంటుంది, ఒంటరి ఎదుర్కొంటే పరిస్థితి ఎలా ఉంటుందని అన్న అభిప్రాయాల్ని విజయకాంత్ సేకరించి ఉన్నారు. అయితే, తామంతా కెప్టెన్ నేతృత్వంలోనే కూటమి ఏర్పాటు కావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా పలువురు ఆశావహులు పేర్కొన్నారు.