ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం | Army Recruitment Rally start | Sakshi
Sakshi News home page

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం

Published Fri, Oct 10 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం

* 7 జిల్లాల నుంచి 6 వేలమందికి పైగా పాల్గొన్న అభ్యర్థులు
* ఎత్తు ప్రాతిపదికన 3597 మంది ఎంపిక
* ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం పరుగు, లాంగ్ జంప్ పోటీలు

విద్యానగర్(గుంటూరు) :నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో గురువారం ఏడు జిల్లాలకు సంబంధించి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభమైంది.  ఈనెల  20 వతేదీవరకు వివిధ విభాగాల్లో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం కొనసాగుతుంది. మొదటిరోజు  గుంటూరు, అనంతపూర్, కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు 6 వేల మందికి పైగా ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఎంపిక కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు పటిష్ట బందోబస్తు మధ్య జరిగింది. ముందుగా అభ్యర్థులను 400 మంది చొప్పున మైదానంలోకి అనుమతించారు. అనంతరం వారిని క్యూ పద్ధతిలో ఎత్తు ప్రాతిపదికన సర్టిఫికెట్‌ల పరిశీలనకు పంపారు.

కనీస ఎత్తు 166 సెంటీమీటర్లుగా నిర్ణయించడంతో వచ్చిన అభ్యర్థుల్లో  3597 మంది మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికయ్యారు. వారిని ఏ జిల్లాకు ఆ జిల్లా వారీగా టెంట్లను ఏర్పాటుచేసి విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్మీ సిబ్బంది సహకారంతో సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. ప్రధానంగా నివాస ధ్రువీకరణ పత్రాలు, ఐడీ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికెట్లు పరిశీలించారు. తదనంతరం అభ్యర్థులకు తాము ప్రకటించిన పర్సంటేజ్ మార్కుల జాబితాలో ఉందా, లేదా అని ఆర్మీ అధికారులు పరిశీలించి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు.

సర్టిఫికెట్‌ల ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రన్నింగ్, లాంగ్‌జంప్ తదితర పోటీలు నిర్వహిస్తామని రిక్రూటింగ్ డెరైక్టర్ కల్నల్ ఆఫ్సర్ అబ్బాస్ జాఫ్రి తెలిపారు. నిర్ణీత ఎత్తు కంటే తక్కువ ఎత్తుగల అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ నుంచి తొలగించి వారి చేతికి రంగు రాసి వెనక్కి పంపారు. తక్కువ ఎత్తు ఉండి గురువారం ఎంపిక కాని అభ్యర్థులు తక్కువ ఎత్తు ఉన్న ట్రేడ్‌ల ఎంపిక రోజున తిరిగి పాల్గొనవచ్చని చెప్పారు.శుక్రవారం జరుగనున్న పరుగు పందెంలో 1.6 కిలో మీటర్ల దూరాన్ని 6 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయాలని తెలిపారు.  9 అడుగుల లాంగ్ జంప్, పుష్ అప్స్ తదితర ఈవెంట్స్ కూడా నిర్వహిస్తామన్నారు. వీటితో పాటు  టెక్నికల్ విభాగానికి ఎంపిక జరుగుతుందని కల్నల్ తెలిపారు.
 
విలువైన వస్తువులు వెంట తేవద్దు
ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థుల  కోసం మంచినీరు, తదితర వసతులను సంబంధిత శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఎంతోమంది తమ సెల్‌ఫోన్లు, విలువైన వస్తువులు, సర్టిఫికెట్లు పోగొట్టుకున్నామని స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో కల్నల్ జాఫ్రి అభ్యర్థులు తమ విలువైన వస్తువులు తమ వెంట తీసుకురావద్దని, కేవలం సర్టిఫికెట్లను మాత్రమే జాగ్రత్తగా తీసుకుని రావాలని తెలిపారు. ఎంపికలో ఆర్మీ అభ్యర్థులకు సహకరించి విధులు నిర్వహించిన ఈస్ట్ డీఎస్పీ గంగాధరానికి, పోలీసు సిబ్బందికి కల్నల్ జాఫ్రి కృతజ్జతలు తెలిపారు.
 
పోలీసుల అత్యుత్సాహం
ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు ఇతర జిల్లాలనుంచి అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వీరిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.ఎంపికలో పాల్గొనాలనే తపనతో అభ్యర్థులు తోసుకుంటుండడంతో పోలీసులు  కర్రలు తీసుకుని దాడి చేసినంత పని చేశారు.  స్టేడియం పరిసర ప్రాంతాల్లో  దాదాపు 70 మంది పోలీసులు విధులు నిర్వహించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement