► గ్రూప్-2నోటిఫికేషన్‌లో స్పష్టత ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ
► రాతపరీక్షకు 600, ఇంటర్వ్యూకు 75 మార్కులు...
► రెండు జోన్లు, మల్టీ జోన్ పోస్టుల విధానమూ కొనసాగుతుంది
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూ విధానం యథాతథంగా కొనసాగుతుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో టీఎస్‌పీఎస్సీ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. పలు పోస్టులకు ఇంటర్వ్యూలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్రంలో గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుందా, ఉండదా అన్న చర్చ కొనసాగడం తెలిసిందే. అయితే అవి గ్రూప్ 2 పోస్టులు గెజిటెడ్ పోస్టులని, కేంద్ర సర్వీసుల్లో గ్రూప్-ఏ పోస్టులతో సమానమైనవని రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ ఇదివరకే కేంద్రానికి తెలియజేశాయి. ఆ మేరకే గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూ విధానాన్ని కొనసాగిస్తూ నోటిఫికేషన్‌లో పరీక్ష విధానాన్ని వెల్లడించింది. గ్రూప్-2లో 600 మార్కులకు రాత పరీక్ష, 75 మార్కులకు ఇంటర్వ్యూ.. మొత్తంగా 675 మార్కులుంటాయి. ఇక రాష్ట్రంలో రెండు జోన్ల విధానం, మల్టీ జోన్ పోస్టుల విధానం ఉంటాయి.
పోస్టులవారీగా విద్యార్హతలు...
గ్రూప్- 2 ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులతోపాటు ఇతర పోస్టులకు ఏదైనా డిగ్రీ చేసిన వారంతా అర్హులే. ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఏదేని డిగ్రీతోపాటు నిర్ణీత శారీర దారుఢ్యమూ ఉండాలి.
అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ డ్రైలాండ్ అగ్రికల్చర్, పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ ప్రొటెక్షన్, ఆర్గానిక్ ఫార్మింగ్) చేసిన వారు అర్హులు. వీటి పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్‌లలో ఉంటాయి.
వాటర్ వర్క్స్ టెక్నీషియన్ పోస్టులకు ఐటీఐ డ్రాట్స్‌మెన్ సివిల్, ఐటీఐ ఎలక్ట్రికల్, ఐటీఐ మెకానికల్ చేసి రెండేళ్ల అనుభవమున్న వారు అర్హులు. ఇందులో 10 సివిల్, 19 ఎలక్ట్రికల్, 15 మెకానికల్ పోస్టులున్నాయి. వాటర్ వర్క్స్‌లో పని చేసే ఉద్యోగులకు గరిష్ట వయోపరిమితి (రిటైర్‌మెంట్ వరకు) లేదు. వీటి పరీక్ష కేంద్రాలు హైదరాబాద్; కరీంనగర్, వరంగల్‌లలో ఉంటాయి.
డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు సీఏ/ఐసీడబ్ల్యూఏ చేసి రెండేళ్ల అనుభవమున్నవారు అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తులను బట్టి రాత పరీక్ష లేదా ఆన్‌లైన్ పరీక్షను (కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్టు) నిర్వహిస్తారు.
ఎవరు అర్హులంటే...
గ్రూప్-2లోని ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు డిగ్రీ చేసిన 18-28 ఏళ్ల మధ్య వయసున్న జనరల్ అభ్యర్థులు అర్హులు. సామాజిక రిజర్వేషన్లు అదనం.
మిగతా పోస్టులకు డిగ్రీతో పాటు 18-44 ఏళ్ల వయసున్న జనరల్ అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితి సడలింపు ఇందుకు అదనం.
సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు కనీస వయసు 20 ఏళ్లు. లా చేసిన వారికి ప్రాధాన్యం.
ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మినహా ఇతర పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన వయోపరిమితి సడలింపుతో పాటు అదనంగా ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
వికలాంగులైతే సాధారణ సడలింపులకు తోడు మరో పదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. అయితే మొత్తంగా సడలింపు 58 ఏళ్లకు మించరాదు (ఎందుకంటే ప్రభుత్వోద్యోగులైన వికలాంగులకు మరో ఐదేళ్లవయోపరిమితి ఉంటుంది).
పరీక్ష ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.120. ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, నిరుద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
అన్ని జిల్లా కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. హాల్ టికెట్లను పరీక్షకు 7 రోజుల ముందునుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గరిష్ట వయోపరిమితి లెక్క ఇదీ..
ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మినహా ఇతర అన్ని పోస్టులకు..
విభాగం సాధారణ ప్రభుత్వం రిజర్వేషన్ మొత్తం
గరిష్ట వయోపరిమితి ఇచ్చిన సడలింపు సడలింపు
జనరల్ 34 10 0 44
ఎస్సీ, ఎస్టీ, బీసీ 34 10 5 49
ప్రభుత్వోద్యోగులు 34 10 5 49
ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లు 34 10 3 47
ఎక్స్ సర్వీస్‌మెన్ 34 10 3 47
వికలాంగులు 34 10 10 54
సెన్సెస్‌లో పని చేసినవారు 34 10 3 47
ఇంటర్వ్యూలు యథాతథం
Published Thu, Dec 31 2015 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM
Advertisement
Advertisement