కేసీఆర్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు. చిత్రంలో శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు రూపొందించి చట్టం చేయడం, అది రాష్ట్రపతి ఆమోదం పొందడం చిరస్మరణీయమని ఉద్యోగ సంఘాలు కొనియాడాయి. ఈ విధానానికి రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసినందుకు, అందుకనుగుణంగా 50 వేల కొత్త ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, కార్యదర్శి, టీజీవో అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కలిశారు. ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రికి విన్నవించిన సమస్యలివీ..
- ఆర్డర్‌టుసర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జోనల్ విధానాన్ని అనుసరించి వారి స్వస్థలాలకు/ జిల్లాలకు ఆప్షన్ ద్వారా పంపించడానికి చర్యలు తీసుకుని ఆర్డర్‌టుసర్వ్‌ను రద్దు చేయాలి.
- ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించడం కోసం పీఆర్సీ సూచన మేరకు ఒక శాతం మూల వేతనాన్ని ప్రభుత్వ కార్పస్ ఫండ్‌కు ఇవ్వడానికి రాష్ట్రంలోని ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు తదితర ఉద్యోగులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈహెచ్‌ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేసేలా జీవో విడుదల చేయాలి.
- ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో ఉన్న వ్యత్యాసాలను సవరించడానికి అనమలీస్ కమిటీని ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీలతో ఏర్పాటు చేయాలి. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలి.
- ఆంధ్రాలో మిగిలి ఉన్న జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ స్థాయి, గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలి.
- కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ శాఖల్లో జనాభా ప్రాతిపదికన పోస్టులు మంజూరు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment