Employees associations
-
జెట్ ఎయిర్వేస్ రిజల్యూషన్ ప్లాన్ : ఉద్యోగుల షాక్!
ముంబై: ఎయిర్‌లైన్స్ కోసం జలాన్-కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళికను సవాలుచేస్తూ, ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్)లో అప్పీల్ దాఖలు చేసినట్లు ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ గురువారం తెలిపింది. బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్‌ల కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను 2020 అక్టోబర్‌లో జెట్ ఎయిర్వేస్ రుణ దాతల కమిటీ (సీఓసీ) ఆమోదించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ పరిష్కార ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు గత వారం జెట్ ఎయిర్వేస్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తిరిగి ధృవీకరించింది. దీనితో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏప్రిల్ 2019లో ఆగిపోయిన ఎయిర్‌లైన్ పునఃప్రారంభానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియను సవాలు చేస్తూ, ఆ సంస్థ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ తాజాగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. బీకేస్, జెట్ ఎయిర్వేస్ క్యాబిన్ క్రూ అసోసియేషన్, వివిధ సంఘాలు కూడా గత నెలలో ఎన్సీఎల్ఏటీ ముందు అప్పీల్ దాఖలు చేశాయి. రాబోయే నెలల్లో సేవలను పునఃప్రారంభిస్తుందని భావిస్తున్న జెట్ ఎయిర్వేస్ను ప్రస్తుతం మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తోంది. అప్పీల్ ఎందుకంటే... జెట్ ఎయిర్వేస్ ఆస్తులు, ఫ్లైట్ స్లాట్లు, మరీ ముఖ్యంగా ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగులతో సహా కీలక విభాగాల వినియోగం ఎలా అన్నది రిజల్యూషన్ ప్రణాళికలో ఊహాజనితంగా ఉందని ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ పావస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగానే తాము దీనిని సవాలు చేస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్ గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఏప్రిల్ 2018 నుండి జూన్ 2019 వరకు బోనస్, కార్మికులు-ఉద్యోగులందరికీ రిట్రెంచ్‌మెంట్ పరిహారం పూర్తి చెల్లింపులపై తగిన పరిష్కారం చూపాలని ఎన్సీఎల్ఏటీ ముందు దాఖలు చేసిన అప్పీల్లో విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. రిజల్యూషన్ దరఖాస్తుదారు లేదా మానిటరింగ్ కమిటీ ద్వారా తిరిగి నియమించబడిన ఏ ఉద్యోగికైనా అప్పటికే రావాల్సిన వారి గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, బోనస్ రిట్రెంచ్‌మెంట్ పరిహారం చెల్లించాలని కూడా అసోసియేషన్ డిమాండ్ చేస్తోందన్నారు. మినహాయింపులను ఎంతమాత్రం అంగీకరించడం జరగదని కిరణ్ పావస్కర్ స్పష్టం చేశారు. రిజల్యూషన్ ప్రణాళిక అస్పష్టమైన వ్యాపార ప్రణాళికతో ముడివడి ఉందని జెట్ ఎయిర్వేస్ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఉద్యోగుల న్యాయ సలహాదారు నారాయణ్ హరిహరన్ అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన అన్ని చట్టబద్ధమైన హక్కులను, ముఖ్యంగా గ్రాట్యుటీ, ప్రివిలేజ్లీవ్, చెల్లించని జీతం, బోనస్‌లను మాఫీ చేయలని చూస్తున్నట్లు విమర్శించారు. జెట్ ఎయిర్వేస్ ఇంతక్రితం నరేష్ గోయల్, గల్ఫ్ క్యారియర్ ఎతిహాద్ యాజమాన్యంలో ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం 2019 జూన్‌లో రూ. 8,000 కోట్లకు పైగా బకాయిల కోసం దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. -
ఆర్టీసీకి ఆక్సిజన్ వైఎస్ కుటుంబం
తిరుపతి అర్బన్: వెంటిలేటర్‌పై ఉన్న ఆర్టీసీకి ఆక్సిజన్ అందించింది వైఎస్ కుటుంబమేనని ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య తెలిపారు. తిరుపతిలో బుధవారం వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో చల్లా చంద్రయ్య మాట్లాడుతూ.. డిసెంబర్ 14న జరుగనున్న ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో అసోసియేషన్ విజయ పతాకాన్ని ఎగురవేయాలని చెప్పారు. 1999లో అప్పటి నేతలు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారని చెప్పారు. అయితే 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న 27వేల మందిని ఆర్టీసీలో భాగస్వాములు చేశారని చెప్పారు. అదేవిధంగా ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ పోరాటం చేయకపోయినా.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయమన్నారు. ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర, జోనల్, రీజనల్‌కు చెందిన లతారెడ్డి, టీవీ మురళీధరన్, అర్జున్, ఎంటీఆర్ రెడ్డి, రాంబాబు, పరంధామయ్య, మణితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డిపో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
కొత్త జోనల్ విధానంతో స్థానికులకు న్యాయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు రూపొందించి చట్టం చేయడం, అది రాష్ట్రపతి ఆమోదం పొందడం చిరస్మరణీయమని ఉద్యోగ సంఘాలు కొనియాడాయి. ఈ విధానానికి రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసినందుకు, అందుకనుగుణంగా 50 వేల కొత్త ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, కార్యదర్శి, టీజీవో అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కలిశారు. ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి విన్నవించిన సమస్యలివీ.. ఆర్డర్‌టుసర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జోనల్ విధానాన్ని అనుసరించి వారి స్వస్థలాలకు/ జిల్లాలకు ఆప్షన్ ద్వారా పంపించడానికి చర్యలు తీసుకుని ఆర్డర్‌టుసర్వ్‌ను రద్దు చేయాలి. ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించడం కోసం పీఆర్సీ సూచన మేరకు ఒక శాతం మూల వేతనాన్ని ప్రభుత్వ కార్పస్ ఫండ్‌కు ఇవ్వడానికి రాష్ట్రంలోని ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు తదితర ఉద్యోగులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేసేలా జీవో విడుదల చేయాలి. ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో ఉన్న వ్యత్యాసాలను సవరించడానికి అనమలీస్ కమిటీని ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీలతో ఏర్పాటు చేయాలి. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలి. ఆంధ్రాలో మిగిలి ఉన్న జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ స్థాయి, గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలి. కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ శాఖల్లో జనాభా ప్రాతిపదికన పోస్టులు మంజూరు చేయాలి. -
సంఘం శరణం.. ఓటు గచ్ఛామి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఓట్ల వేటను ముమ్మరం చేస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమకు మద్దతు కూడగట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అభ్యర్థులంతా సంఘాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గ్రాడ్యుయేషన్ చదివి వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారందరినీ నేరుగా కలవలేని పరిస్థితుల్లో... ఆయా ఉద్యోగ, వృత్తి సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ ముందంజలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా తమకు వీలున్న సంఘాలను కలుస్తూ మద్దతు అభ్యర్థిస్తున్నారు. కాగా అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలతో కూడా భేటీ అవుతూ ఓట్లు అడుగుతున్నాయి. మొత్తం మీద పోలింగ్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. పోటీలు పడి.. మద్దతు వివిధ సంఘాలను కలిసి మద్దతు కూడగట్టే క్రమంలో మిగతా పార్టీలతో పోలిస్తే టీఆర్ఎస్ ముందంజలో కనిపిస్తోంది. ఇప్పటికే పలు తెలంగాణ ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆ పార్టీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సురభి వాణీదేవీలకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. పారామెడికల్, సెర్ప్, ఐకేపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగులతో పాటు పలు సంఘాలు టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరికీ పోటీలు పడి మరీ మద్దతు ప్రకటిస్తున్నాయి. టీఆర్ఎస్కు చెందిన మంత్రులు ఆయా సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులతో సమావేశాలు పెట్టి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తుండటంతో వారంతా పల్లా, వాణీదేవీలను గెలిపించాలని తమ సంఘ సభ్యులను కోరుతున్నారు. బీజేపీ అభ్యర్థులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాంచందర్‌రావులు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు, ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగడుతున్నారు. పార్టీకి అనుబంధంగా ఉండే విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సహకారంతో ముందుకెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిలు కూడా తమ పార్టీ అనుబంధ సంఘాల నేతల సాయంతో గ్రామస్థాయిలో ప్రచారానికి వెళ్తున్నారు. నల్లగొండ స్థానం పరిధిలో లెఫ్ట్ అభ్యర్థి జయసారథిరెడ్డి పక్షాన వామపక్ష అనుబంధ సంఘాలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రంగారెడ్డి స్థానంలో లెఫ్ట్ పార్టీలకు అనుబంధంగా ఉండే ప్రజాసంఘాలు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్. కె.నాగేశ్వర్‌కు మద్దతు ప్రకటించాయి. నల్లగొండ స్థానంలో బీసీ సంఘాలు, ఎమ్మార్పీఎస్, ఇతర కుల సంఘాలు తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి డాక్టర్. చెరుకు సుధాకర్‌కు మద్దతు తెలిపాయి. ఇలా ఎవరికి వారే వృత్తి, కుల సంఘాల సహకారం కోసం నానాపాట్లు పడుతుండటం ఎమ్మెల్సీ రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది. గ్రామాల్లో నేరుగా ఓటర్లను కలస్తూ... గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించినా... ఓటరు జాబితాను దగ్గర పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్లి ప్రతి ఓటర్ను కలవడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. స్వతంత్రులతో సహా అన్ని పార్టీలు ఇప్పటికే గురుకులాలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను ఓమారు చుట్టేసి... ఇప్పుడు గ్రామాలపై దృష్టి సారించాయి. ఆయా గ్రామాల్లోని పార్టీ నేతలు తమ ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో కలిసి బ్యాలెట్ పేపర్లను పట్టుకుని ఓటర్లను నేరుగా కలిసి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. దీంతో పాటు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఈ సామాజిక వర్గాల సమావేశాలు బహిరంగంగా జరుగుతుండగా, మరికొన్ని చోట్ల అంతర్గతంగా మద్దతు కూడగట్టుకుంటున్నారు. మార్నింగ్ వాక్‌ల పేరుతో ఎన్నికల ప్రచారం ఇంకా సాగుతుండగా, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హౌసింగ్ సొసైటీల వారీగా కూడా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పట్టభద్రుల ఓట్ల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
తెలంగాణ ఉద్యోగులకు 29 శాతం ఫిట్మెంట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు రంగం సిద్ధమైంది. మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం లేదని.. కోడ్ ముగిశాక ప్రకటన వెలువడనుందని అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని జనవరి నుంచి టీజీవో, టీఎన్జీవో సంఘాలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ను కోరుతున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ వారికి మంగళవారం సమయం ఇచ్చారు. దీంతో టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీవో అధ్యక్షురాలు మమత, పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు, మరికొందరు నేతలు సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన పీఆర్సీని మెరుగైన ఫిట్మెంట్తో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఓకే చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. పొరుగునఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తున్నందున.. రాష్ట్రంలో ఉద్యోగులకు అంతకంటే 2, 3 శాతం ఎక్కువ ఫిట్మెంట్ ఖరారు చేద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఈ లెక్కన 29 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. మిగతా డిమాండ్లకూ ఓకే.. టీచర్లకు పీఆర్సీ అమలు విషయంలో వచ్చిన కథనాలను పక్కనపెడుతూ ఉద్యోగులతోపాటు వారికి కూడా పీఆర్సీని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచేందుకు ఓకే చెప్పారని.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలోని ఉద్యోగులెవరైనా సర్వీసులో ఉండగా మరణిస్తే, వారి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) ప్రొబేషన్ పీరియడ్‌ను 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గించేందుకు సీఎం ఓకే చెప్పారని.. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక టీచర్ల బదిలీలు, పదోన్నతులను త్వరగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారని.. స్పౌజ్ కేటగిరీ బదిలీలు, కారుణ్య నియామకాల విషయంలో ఎప్పుటికప్పుడు చర్యలు చేపడతామన్నారని వివరించారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగులు హెల్త్ కార్డులతో కోరుకున్న ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేలా చర్యలు చేపడతామన్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులను తెలంగాణకు తీసుకువచ్చే ఫైలుపైనా సీఎం సంతకం చేసినట్టు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇచ్చేలా చర్యలు చేపడతామని సీఎం హామీ ఇచ్చినట్టు వివరించారు. ఎన్నికల నియామావళికి లోబడే చర్చలు: టీజీవో, టీఎన్జీవో ఎన్నికల నియమావళికి లోబడే తాము సీఎం కేసీఆర్‌తో చర్చించామని టీజీవో, టీఎన్జీవో నేతలు మమత, రాజేందర్ వెల్లడించారు. 2014 తర్వాత దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో పీఆర్సీని సీఎం కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగుల పదోన్నతులు కూడా త్వరితగతిన ఇచ్చారన్నారు. ఉద్యోగుల సమస్యలు అన్నింటినీ పరిష్కరించే దిశగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. పీఆర్సీ విషయాన్ని సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారని, ఆయనపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. ‘ఎన్నికల నియమావళికి లోబడే చర్చలు’ ఎన్నికల నియమావళికి లోబడే తాము సీఎం కేసీఆర్‌తో చర్చించామని టీజీవో, టీఎన్జీవో నేతలు మమత, రాజేందర్ వెల్లడించారు. 2014 తర్వాత దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో పీఆర్సీని సీఎం కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగుల పదోన్నతులు కూడా త్వరితగతిన ఇచ్చారన్నారు. ఉద్యోగుల సమస్యలు అన్నింటినీ పరిష్కరించే దిశగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. పీఆర్సీ విషయాన్ని సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారని, ఆయనపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. -
మధ్యంతర భృతి వాయిదా!
సాక్షి, హైదరాబాద్: మధ్యంతర భృతి (ఐఆర్)పై ఉద్యోగులకు నిరాశ మిగిలింది. మే 16న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా జూన్ 2న మధ్యంతర భృతి, ఆగస్టు 15న పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. అనంతరం దీన్ని వాయిదా వేసింది. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదిక రాకుండా మధ్యంతర భృతి ప్రకటించడం సరికాదనే దీనిపై ప్రకటన చేయలేదు. పీఆర్సీ నివేదిక సిద్ధం కాకపోవడంతో ఆగస్టు 15న ఐఆర్‌పై ప్రభుత్వ ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. పీఆర్సీ పని ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఐఆర్‌పై ఆర్థిక శాఖ ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని తెలిసింది. తాజా పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను సవరించే ప్రక్రి య ఐదేళ్లకు ఒకసారి జరుగుతుంది. పీఆర్సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తాయి. పూర్తిస్థాయి నివేదిక వచ్చేలోపు ప్రభుత్వం ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. గత పీఆర్సీ (2013) గడువు ఈ ఏడాది జూన్ ఆఖరుతో ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొదటి పీఆర్సీని ప్రభుత్వం ఈ ఏడాది మేలోనే ఏర్పాటు చేసింది. పీఆర్సీ ప్రస్తుతం నివేదిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఎలాంటి మధ్యంతర నివేదికను సమర్పించలేదు. దీంతో ఐఆర్‌పై ప్రకటన ఉండే అవకాశం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో ఉద్యోగుల జీతాలు, ఫిట్మెంట్ భారీగా పెంచిన కారణంగా ఐఆర్ ఖర్చు అదేస్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. ఐఆర్ ఒక శాతం ఇస్తే ఏటా రూ.300 కోట్లు, పది శాతం ఇస్తే రూ. 3 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి వివరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు పదో పీఆర్సీ సందర్భంగా 27% ఐఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పదో పీఆర్సీ నివేదిక ఆధారంగా 43% ఫిట్మెంట్ ప్రకటించారు. తెలంగాణలో తొలి పీఆర్సీ కావడంతో ప్రస్తుతం ఐఆర్ ఎంత ఉంటుందనేది ఉద్యోగులలో ఆసక్తికరంగా మారింది. -
రచ్చ.. రచ్చ!
బదిలీల వ్యవహారం.. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :తహసీల్దార్ల బదిలీల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. అడ్డగోలుగా జరిగిన బదిలీల పర్వాన్ని నిరసిస్తూ ఉద్యమబాట పట్టాలని ఉద్యోగసంఘాలు నిర్ణయించాయి. ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించి వెనక్కి తిరిగొచ్చిన తహసీల్దార్లకు పాత స్థానాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు తెలంగాణలో బదిలీల ప్రక్రియ కొనసాగగా, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ నిబంధనలను ఏ మాత్రం పాటించలేదు. పైరవీలు, ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు ప్రభుత్వమే నియామకపు ప్రక్రియను పూర్తి చేసింది. నేరుగా ప్రభుత్వ పెద్దలు తలదూర్చడంతో బదిలీల విషయంలో జిల్లా యంత్రాంగం కూడా చూసీచూడనట్లు వ్యవహరించింది. ఈ క్రమంలో జరిగిన పోస్టింగ్‌లపై ఉద్యోగసంఘాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. సమర్థత, పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా... ఒక ఉద్యోగసంఘం నేత కనుసన్నల్లో నియామకాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించిన తమ సంఘం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా.. రాష్ట్ర ప్రకటన ఆనంతరం పుట్టుకొచ్చిన సంఘానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడంపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. తహసీల్దార్ల పోస్టింగ్‌ల వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లను కలిసిన ఉద్యోగసంఘాల ప్రతినిధులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన పోస్టింగ్ బాగోతంపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తమను విస్మరించి.. సమైక్యవాదులతో జతకట్టిన మరో సంఘం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాత స్థానాల్లోనే తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇవ్వాలని, లేనిపక్షంలో 9వ తేదీన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని టీజీవో జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలువనున్నామని, ఈ సమావేశంలో వచ్చే స్పందనను బట్టి తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. బదిలీలపై ‘స్టే’ ఇదిలావుండగా, కొత్త రాష్ట్రంలో రెవెన్యూ శాఖ జారీ చేసిన తొలి జీవో వివాదాస్పదంగా మారింది. కొన్ని నెలల వ్యవధిలోనే తమను బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ శివార్లలోని ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు కోర్టు ‘స్టే’ పొందారు. హయత్‌నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్లు తమకు ఆకస్మికంగా స్థానచలనం కలిగించడం సరికాదని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేసిన కోర్టు... తదుపరి తీర్పు వెలువడే వరకు బదిలీలు ఆపేయాలని ఆదేశించింది. మరోవైపు బదిలీ వేటు పడ్డ మరి కొంతమంది తహసీల్దార్లు కూడా ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తున్నారు. సుదూర మండలాల్లో పోస్టింగ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పలువురు కోర్టుకెక్కుతున్నారు.