రచ్చ.. రచ్చ! | employees are decided to Induced movement | Sakshi
Sakshi News home page

రచ్చ.. రచ్చ!

Published Sat, Jun 7 2014 11:26 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

employees are decided to Induced movement

 బదిలీల వ్యవహారం..

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :తహసీల్దార్ల బదిలీల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. అడ్డగోలుగా జరిగిన బదిలీల పర్వాన్ని నిరసిస్తూ ఉద్యమబాట పట్టాలని ఉద్యోగసంఘాలు నిర్ణయించాయి. ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించి వెనక్కి తిరిగొచ్చిన తహసీల్దార్లకు పాత స్థానాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది.
 
ఈ మేరకు తెలంగాణలో బదిలీల ప్రక్రియ కొనసాగగా, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ నిబంధనలను ఏ మాత్రం పాటించలేదు. పైరవీలు, ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు ప్రభుత్వమే నియామకపు ప్రక్రియను పూర్తి చేసింది. నేరుగా ప్రభుత్వ పెద్దలు తలదూర్చడంతో బదిలీల విషయంలో జిల్లా యంత్రాంగం కూడా చూసీచూడనట్లు వ్యవహరించింది.
 
 ఈ క్రమంలో జరిగిన పోస్టింగ్‌లపై ఉద్యోగసంఘాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. సమర్థత, పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా... ఒక ఉద్యోగసంఘం నేత కనుసన్నల్లో నియామకాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించిన తమ సంఘం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా.. రాష్ట్ర ప్రకటన ఆనంతరం పుట్టుకొచ్చిన సంఘానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడంపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి.
 
 తహసీల్దార్ల పోస్టింగ్‌ల వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లను కలిసిన ఉద్యోగసంఘాల ప్రతినిధులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన పోస్టింగ్ బాగోతంపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తమను విస్మరించి.. సమైక్యవాదులతో జతకట్టిన మరో సంఘం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు.
 
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాత స్థానాల్లోనే తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇవ్వాలని, లేనిపక్షంలో 9వ తేదీన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని టీజీవో జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలువనున్నామని, ఈ సమావేశంలో వచ్చే స్పందనను బట్టి తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.
 
బదిలీలపై ‘స్టే’
ఇదిలావుండగా, కొత్త రాష్ట్రంలో రెవెన్యూ శాఖ జారీ చేసిన తొలి జీవో వివాదాస్పదంగా మారింది. కొన్ని నెలల వ్యవధిలోనే తమను బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ శివార్లలోని ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు కోర్టు ‘స్టే’ పొందారు. హయత్‌నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్లు తమకు ఆకస్మికంగా స్థానచలనం కలిగించడం సరికాదని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
 
ఈ క్రమంలో ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేసిన కోర్టు... తదుపరి తీర్పు వెలువడే వరకు బదిలీలు ఆపేయాలని ఆదేశించింది. మరోవైపు బదిలీ వేటు పడ్డ మరి కొంతమంది తహసీల్దార్లు కూడా ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తున్నారు. సుదూర మండలాల్లో పోస్టింగ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పలువురు కోర్టుకెక్కుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement