Thahasildars transfer issue
-
త్వరలో తహసీల్దార్ల బదిలీలు!
నిజామాబాద్: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారుల బదిలీలను ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే అదనపు కలె క్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోల బదిలీ ప్రక్రియ పూర్తయ్యింది. ఇక మిగిలింది తహసీల్దార్ల బదిలీలే. దీంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 25మందికిపైగా స్థానచలనం కలిగే అవకాశముంది. మాక్లూర్ సహా మరో ఐదారుగురు ఎన్నికల నిర్వహణ బాధ్యతల నిమిత్తం జిల్లాలో కొనసాగనున్నారు. డిప్యూటీ కలె క్టర్ల పదోన్నతుల ప్రక్రియ కొలిక్కి వచ్చిన వెంటనే తహసీల్దార్ల బదిలీలపై ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. జులై 31లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలో 33మంది తహసీల్దార్లు.. జిల్లాలో 33మంది తహసీల్దార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. మండలాలతోపాటు కలెక్టరేట్లో ఆయా సెక్షన్లకు తహసీల్దార్ స్థాయి హోదా కలిగిన అధికారులు ఉన్నారు. మాక్లూర్ తహసీల్దార్ శంకర్ మినహా మిగతా 32మంది తహసీల్దార్లు మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. కానీ ఐదారుగురు జిల్లాలోనే ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరు కాకుండా జిల్లా నుంచి 25 మందికిపైగా బదిలీ అయ్యే అవకాశముంది. కోరుకున్న స్థానాలకు.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ తప్పనిసరి అని భావించిన తహసీల్దార్లు కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీసీఎల్ఏ నిర్ణయం మేరకే బదిలీలు ఉంటాయని చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో ఎవరు ఎక్కడికి వెళ్తారో తహసీల్దార్లకు ఇప్పటికే స్పష్టత ఉంది. ఆర్డీవోలు, తహసీల్దార్లు మల్టీజోన్ పరిధిలోకి వస్తారు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వరాదు. మన జిల్లా నుంచి కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాలకు బదిలీపై వెళ్తారు. ఆయా జిల్లాల్లో మండలాలను అలాట్ చేస్తారు. కాగా స్థానిక ఎమ్మెల్యేలు సైతం తమకు అనుకూలంగా ఉండే వారినే నియోజకవర్గాల్లో పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు.. రెవెన్యూ అధికారుల బదిలీల ప్రక్రియ తుది అంకానికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 81మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ పదోన్నతులను (ఆర్డీవోలుగా) ఇటీవల కల్పించింది. ప్రస్తుతం 21 మందికి అవకాశం కల్పించింది. వారి సర్దుబాటు ప్రక్రియ పూర్తికాగానే తహసీల్దార్ల బదిలీలపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) యాదిరెడ్డి, మూడు డివిజన్ల ఆర్డీవోలు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. రిటర్నింగ్ అధికారులుగా ఆర్డీవోలు, అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ అధికారులుగా తహసీల్దార్లు వ్యవహరించనున్నారు. ఇంకా సమాచారం లేదు.. తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు సీసీఎల్ఏ నుంచి వస్తాయి. బదిలీ ఉత్తర్వులు ఎప్పుడిస్తారో సమాచారం లేదు. – యాదిరెడ్డి, అదనపు కలెక్టర్, నిజామాబాద్ -
రచ్చ.. రచ్చ!
బదిలీల వ్యవహారం.. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :తహసీల్దార్ల బదిలీల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. అడ్డగోలుగా జరిగిన బదిలీల పర్వాన్ని నిరసిస్తూ ఉద్యమబాట పట్టాలని ఉద్యోగసంఘాలు నిర్ణయించాయి. ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించి వెనక్కి తిరిగొచ్చిన తహసీల్దార్లకు పాత స్థానాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు తెలంగాణలో బదిలీల ప్రక్రియ కొనసాగగా, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ నిబంధనలను ఏ మాత్రం పాటించలేదు. పైరవీలు, ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు ప్రభుత్వమే నియామకపు ప్రక్రియను పూర్తి చేసింది. నేరుగా ప్రభుత్వ పెద్దలు తలదూర్చడంతో బదిలీల విషయంలో జిల్లా యంత్రాంగం కూడా చూసీచూడనట్లు వ్యవహరించింది. ఈ క్రమంలో జరిగిన పోస్టింగ్‌లపై ఉద్యోగసంఘాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. సమర్థత, పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా... ఒక ఉద్యోగసంఘం నేత కనుసన్నల్లో నియామకాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించిన తమ సంఘం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా.. రాష్ట్ర ప్రకటన ఆనంతరం పుట్టుకొచ్చిన సంఘానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడంపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. తహసీల్దార్ల పోస్టింగ్‌ల వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లను కలిసిన ఉద్యోగసంఘాల ప్రతినిధులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన పోస్టింగ్ బాగోతంపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తమను విస్మరించి.. సమైక్యవాదులతో జతకట్టిన మరో సంఘం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాత స్థానాల్లోనే తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇవ్వాలని, లేనిపక్షంలో 9వ తేదీన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని టీజీవో జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలువనున్నామని, ఈ సమావేశంలో వచ్చే స్పందనను బట్టి తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. బదిలీలపై ‘స్టే’ ఇదిలావుండగా, కొత్త రాష్ట్రంలో రెవెన్యూ శాఖ జారీ చేసిన తొలి జీవో వివాదాస్పదంగా మారింది. కొన్ని నెలల వ్యవధిలోనే తమను బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ శివార్లలోని ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు కోర్టు ‘స్టే’ పొందారు. హయత్‌నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్లు తమకు ఆకస్మికంగా స్థానచలనం కలిగించడం సరికాదని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేసిన కోర్టు... తదుపరి తీర్పు వెలువడే వరకు బదిలీలు ఆపేయాలని ఆదేశించింది. మరోవైపు బదిలీ వేటు పడ్డ మరి కొంతమంది తహసీల్దార్లు కూడా ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తున్నారు. సుదూర మండలాల్లో పోస్టింగ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పలువురు కోర్టుకెక్కుతున్నారు.