నిజామాబాద్: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారుల బదిలీలను ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే అదనపు కలె క్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోల బదిలీ ప్రక్రియ పూర్తయ్యింది.
ఇక మిగిలింది తహసీల్దార్ల బదిలీలే. దీంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 25మందికిపైగా స్థానచలనం కలిగే అవకాశముంది. మాక్లూర్ సహా మరో ఐదారుగురు ఎన్నికల నిర్వహణ బాధ్యతల నిమిత్తం జిల్లాలో కొనసాగనున్నారు. డిప్యూటీ కలె క్టర్ల పదోన్నతుల ప్రక్రియ కొలిక్కి వచ్చిన వెంటనే తహసీల్దార్ల బదిలీలపై ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. జులై 31లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.
జిల్లాలో 33మంది తహసీల్దార్లు..
జిల్లాలో 33మంది తహసీల్దార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. మండలాలతోపాటు కలెక్టరేట్‌లో ఆయా సెక్షన్లకు తహసీల్దార్ స్థాయి హోదా కలిగిన అధికారులు ఉన్నారు. మాక్లూర్ తహసీల్దార్ శంకర్ మినహా మిగతా 32మంది తహసీల్దార్లు మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. కానీ ఐదారుగురు జిల్లాలోనే ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరు కాకుండా జిల్లా నుంచి 25 మందికిపైగా బదిలీ అయ్యే అవకాశముంది.
కోరుకున్న స్థానాలకు..
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ తప్పనిసరి అని భావించిన తహసీల్దార్లు కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీసీఎల్‌ఏ నిర్ణయం మేరకే బదిలీలు ఉంటాయని చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో ఎవరు ఎక్కడికి వెళ్తారో తహసీల్దార్లకు ఇప్పటికే స్పష్టత ఉంది.
ఆర్డీవోలు, తహసీల్దార్లు మల్టీజోన్ పరిధిలోకి వస్తారు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వరాదు. మన జిల్లా నుంచి కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాలకు బదిలీపై వెళ్తారు. ఆయా జిల్లాల్లో మండలాలను అలాట్ చేస్తారు. కాగా స్థానిక ఎమ్మెల్యేలు సైతం తమకు అనుకూలంగా ఉండే వారినే నియోజకవర్గాల్లో పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.
త్వరలోనే అధికారిక ఉత్తర్వులు..
రెవెన్యూ అధికారుల బదిలీల ప్రక్రియ తుది అంకానికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 81మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ పదోన్నతులను (ఆర్డీవోలుగా) ఇటీవల కల్పించింది. ప్రస్తుతం 21 మందికి అవకాశం కల్పించింది. వారి సర్దుబాటు ప్రక్రియ పూర్తికాగానే తహసీల్దార్ల బదిలీలపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) యాదిరెడ్డి, మూడు డివిజన్ల ఆర్డీవోలు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. రిటర్నింగ్ అధికారులుగా ఆర్డీవోలు, అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ అధికారులుగా తహసీల్దార్లు వ్యవహరించనున్నారు.
ఇంకా సమాచారం లేదు..
తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు సీసీఎల్‌ఏ నుంచి వస్తాయి. బదిలీ ఉత్తర్వులు ఎప్పుడిస్తారో సమాచారం లేదు. – యాదిరెడ్డి, అదనపు కలెక్టర్, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment