ఇద్దరు పోలీసు అధికారులు.. హవాలా వ్యాపారితో కుమ్మక్కై.. ఏకంగా.. | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు పోలీసు అధికారులు.. హవాలా వ్యాపారితో కుమ్మక్కై.. ఏకంగా..

Published Sun, Nov 5 2023 12:24 AM | Last Updated on Sun, Nov 5 2023 11:39 AM

- - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో ఇటీవల హవాలా డబ్బులను పోలీసులు నొక్కేసిన సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు ఆలస్యంగా తెలిసింది. గతనెల 20న ‘హవాలా డబ్బులు హాంఫట్‌’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్‌ వర్గాలు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఓ మండలానికి చెందిన హవాలా వ్యాపారి నగరంలోని గంజ్‌ ప్రాంతానికి వాహనంలో హవాలా డబ్బులతో రావడంతో పకడ్బందీ సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు.

సదరు హవాలా వ్యాపారిని డైరెక్ట్‌గా వెళ్లి అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, రూ.16 లక్షలను తీసుకున్నట్లు సమాచారం. అనంతరం హవాలా వ్యాపారి, ఎస్‌హెచ్‌వో, ఓ సీఐ బేర సారాలు చేసి రూ. 8 లక్షలు తీసుకుని మిగితా రూ. 8లక్షలను ఓ సీఐ, ఎస్‌హెచ్‌వో, సమాచారమిచ్చిన వారు వాటాలు చేసుకుని పంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ సెటిల్‌మెంట్‌లో ఎస్‌హెచ్‌వోకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చినవారికి రూ. 3 లక్షలు, హవావా డబ్బులు సెటిల్‌మెంట్‌ చేసిన ఓ సీఐకి రూ. 1.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. హవాలా వ్యాపారిని పట్టుకున్న ఎస్‌హెచ్‌వోకు రూ. 3.50 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసు, ఎన్నికల అధికారులకు ఫి ర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఈ సెటిల్‌మెంట్‌పై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలతో పాటు స్పెషల్‌ బ్రాంచ్‌ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. హవాలా డబ్బుల వ్యవహారంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారి కూడా సీరియస్‌ అయినట్లు సమాచారం.

ఎన్నికల వేళ పట్టుకున్నట్లుగా..
సదరు రూ. 8 లక్షలను నొక్కేసిన సదరు పోలీసు అధికారులు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి.. ఎన్నికల వేళ పట్టుకున్న డబ్బులను చూపిస్తూ ఉన్నతాధికారులను తప్పదోవ పట్టిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల కంటే ముందే హవాలా డబ్బులను వాటాలు వేసుకున్న పోలీసులు ఎన్నికల వేళ పట్టుకున్న డబ్బులుగా చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు తమ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరు పోలీసు అధికారులు హవాలా వ్యాపారితో కుమ్మక్కై ఏకంగా ఉన్నతాధికారులను తప్పదోవ పట్టించడంపై వారు కూడా సీరియస్‌ అయినట్లు తెలిసింది. ఈ ఇద్దరు పోలీసు అధికారుల్లో ఒకరు పీడీఎస్‌ బియ్యం వ్యాపారులతో సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి. మరొకరు ఇతర ఘటనల ద్వారా డీఐజీకి అటాచ్‌ చేయబడ్డారు. అయితే ఓ రాజకీయ నేత ద్వారా మళ్లీ ఆయన పోస్టింగ్‌ తీసుకున్నట్లు తెలిసింది. హవాలా డబ్బులపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌, ఎస్బీ అధికారులు విచారణ చేపట్టడంతో పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఏ ప్రాంతాల్లో హవాలా వ్యాపారులున్నారు..?
ఎన్నికల వేళ పోలీసులు హవాలా వ్యాపారులపై దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో ఎక్కువమంది గల్ఫ్‌ ప్రాంతాలకు వెళ్లడంతో ఇక్కడ హవాలా వ్యాపారులు అధికంగా ఉండటంతో పోలీసులు హవాలా దందాపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏఏ ప్రాంతాల్లో హవాలా వ్యాపారులు ఉన్నారు. గతంలో ఎవరిమీదైనా పోలీసులు కేసులు నమోదయ్యాయా..అనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌ కేంద్రంగా హవాలా డబ్బులను పోలీసులు పట్టుకున్నారు. దీంతో జిల్లా తోపాటు మండల కేంద్రాలకు హవాలా డబ్బులు చేరుతున్నాయని పోలీసులు గుర్తిస్తున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement