సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఓట్ల వేటను ముమ్మరం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమకు మద్దతు కూడగట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అభ్యర్థులంతా సంఘాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గ్రాడ్యుయేషన్ చదివి వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారందరినీ నేరుగా కలవలేని పరిస్థితుల్లో... ఆయా ఉద్యోగ, వృత్తి సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో అధికార టీఆర్‌ఎస్ ముందంజలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా తమకు వీలున్న సంఘాలను కలుస్తూ మద్దతు అభ్యర్థిస్తున్నారు. కాగా అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలతో కూడా భేటీ అవుతూ ఓట్లు అడుగుతున్నాయి. మొత్తం మీద పోలింగ్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది.
పోటీలు పడి.. మద్దతు
వివిధ సంఘాలను కలిసి మద్దతు కూడగట్టే క్రమంలో మిగతా పార్టీలతో పోలిస్తే టీఆర్‌ఎస్ ముందంజలో కనిపిస్తోంది. ఇప్పటికే పలు తెలంగాణ ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆ పార్టీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సురభి వాణీదేవీలకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. పారామెడికల్, సెర్ప్, ఐకేపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగులతో పాటు పలు సంఘాలు టీఆర్‌ఎస్ అభ్యర్థులిద్దరికీ పోటీలు పడి మరీ మద్దతు ప్రకటిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు ఆయా సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులతో సమావేశాలు పెట్టి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తుండటంతో వారంతా పల్లా, వాణీదేవీలను గెలిపించాలని తమ సంఘ సభ్యులను కోరుతున్నారు. బీజేపీ అభ్యర్థులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాంచందర్‌రావులు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు, ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగడుతున్నారు. పార్టీకి అనుబంధంగా ఉండే విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సహకారంతో ముందుకెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిలు కూడా తమ పార్టీ అనుబంధ సంఘాల నేతల సాయంతో గ్రామస్థాయిలో ప్రచారానికి వెళ్తున్నారు.
నల్లగొండ స్థానం పరిధిలో లెఫ్ట్ అభ్యర్థి జయసారథిరెడ్డి పక్షాన వామపక్ష అనుబంధ సంఘాలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రంగారెడ్డి స్థానంలో లెఫ్ట్ పార్టీలకు అనుబంధంగా ఉండే ప్రజాసంఘాలు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్. కె.నాగేశ్వర్‌కు మద్దతు ప్రకటించాయి. నల్లగొండ స్థానంలో బీసీ సంఘాలు, ఎమ్మార్పీఎస్, ఇతర కుల సంఘాలు తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి డాక్టర్. చెరుకు సుధాకర్‌కు మద్దతు తెలిపాయి. ఇలా ఎవరికి వారే వృత్తి, కుల సంఘాల సహకారం కోసం నానాపాట్లు పడుతుండటం ఎమ్మెల్సీ రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది.
గ్రామాల్లో నేరుగా ఓటర్లను కలస్తూ...
గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించినా... ఓటరు జాబితాను దగ్గర పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్లి ప్రతి ఓటర్‌ను కలవడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. స్వతంత్రులతో సహా అన్ని పార్టీలు ఇప్పటికే గురుకులాలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను ఓమారు చుట్టేసి... ఇప్పుడు గ్రామాలపై దృష్టి సారించాయి. ఆయా గ్రామాల్లోని పార్టీ నేతలు తమ ఇన్‌చార్జిలు, ముఖ్యనేతలతో కలిసి బ్యాలెట్ పేపర్లను పట్టుకుని ఓటర్లను నేరుగా కలిసి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. దీంతో పాటు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఈ సామాజిక వర్గాల సమావేశాలు బహిరంగంగా జరుగుతుండగా, మరికొన్ని చోట్ల అంతర్గతంగా మద్దతు కూడగట్టుకుంటున్నారు. మార్నింగ్ వాక్‌ల పేరుతో ఎన్నికల ప్రచారం ఇంకా సాగుతుండగా, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హౌసింగ్ సొసైటీల వారీగా కూడా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పట్టభద్రుల ఓట్ల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
సంఘం శరణం.. ఓటు గచ్ఛామి
Published Wed, Mar 10 2021 1:37 AM | Last Updated on Wed, Mar 10 2021 3:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment