TGOs
-
సంఘం శరణం.. ఓటు గచ్ఛామి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఓట్ల వేటను ముమ్మరం చేస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమకు మద్దతు కూడగట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అభ్యర్థులంతా సంఘాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గ్రాడ్యుయేషన్ చదివి వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారందరినీ నేరుగా కలవలేని పరిస్థితుల్లో... ఆయా ఉద్యోగ, వృత్తి సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ ముందంజలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా తమకు వీలున్న సంఘాలను కలుస్తూ మద్దతు అభ్యర్థిస్తున్నారు. కాగా అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలతో కూడా భేటీ అవుతూ ఓట్లు అడుగుతున్నాయి. మొత్తం మీద పోలింగ్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. పోటీలు పడి.. మద్దతు వివిధ సంఘాలను కలిసి మద్దతు కూడగట్టే క్రమంలో మిగతా పార్టీలతో పోలిస్తే టీఆర్ఎస్ ముందంజలో కనిపిస్తోంది. ఇప్పటికే పలు తెలంగాణ ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆ పార్టీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సురభి వాణీదేవీలకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. పారామెడికల్, సెర్ప్, ఐకేపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగులతో పాటు పలు సంఘాలు టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరికీ పోటీలు పడి మరీ మద్దతు ప్రకటిస్తున్నాయి. టీఆర్ఎస్కు చెందిన మంత్రులు ఆయా సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులతో సమావేశాలు పెట్టి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తుండటంతో వారంతా పల్లా, వాణీదేవీలను గెలిపించాలని తమ సంఘ సభ్యులను కోరుతున్నారు. బీజేపీ అభ్యర్థులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాంచందర్‌రావులు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు, ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగడుతున్నారు. పార్టీకి అనుబంధంగా ఉండే విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సహకారంతో ముందుకెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిలు కూడా తమ పార్టీ అనుబంధ సంఘాల నేతల సాయంతో గ్రామస్థాయిలో ప్రచారానికి వెళ్తున్నారు. నల్లగొండ స్థానం పరిధిలో లెఫ్ట్ అభ్యర్థి జయసారథిరెడ్డి పక్షాన వామపక్ష అనుబంధ సంఘాలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రంగారెడ్డి స్థానంలో లెఫ్ట్ పార్టీలకు అనుబంధంగా ఉండే ప్రజాసంఘాలు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్. కె.నాగేశ్వర్‌కు మద్దతు ప్రకటించాయి. నల్లగొండ స్థానంలో బీసీ సంఘాలు, ఎమ్మార్పీఎస్, ఇతర కుల సంఘాలు తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి డాక్టర్. చెరుకు సుధాకర్‌కు మద్దతు తెలిపాయి. ఇలా ఎవరికి వారే వృత్తి, కుల సంఘాల సహకారం కోసం నానాపాట్లు పడుతుండటం ఎమ్మెల్సీ రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది. గ్రామాల్లో నేరుగా ఓటర్లను కలస్తూ... గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించినా... ఓటరు జాబితాను దగ్గర పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్లి ప్రతి ఓటర్ను కలవడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. స్వతంత్రులతో సహా అన్ని పార్టీలు ఇప్పటికే గురుకులాలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను ఓమారు చుట్టేసి... ఇప్పుడు గ్రామాలపై దృష్టి సారించాయి. ఆయా గ్రామాల్లోని పార్టీ నేతలు తమ ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో కలిసి బ్యాలెట్ పేపర్లను పట్టుకుని ఓటర్లను నేరుగా కలిసి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. దీంతో పాటు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఈ సామాజిక వర్గాల సమావేశాలు బహిరంగంగా జరుగుతుండగా, మరికొన్ని చోట్ల అంతర్గతంగా మద్దతు కూడగట్టుకుంటున్నారు. మార్నింగ్ వాక్‌ల పేరుతో ఎన్నికల ప్రచారం ఇంకా సాగుతుండగా, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హౌసింగ్ సొసైటీల వారీగా కూడా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పట్టభద్రుల ఓట్ల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
తెలంగాణ ఉద్యోగులకు 29 శాతం ఫిట్మెంట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు రంగం సిద్ధమైంది. మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం లేదని.. కోడ్ ముగిశాక ప్రకటన వెలువడనుందని అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని జనవరి నుంచి టీజీవో, టీఎన్జీవో సంఘాలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ను కోరుతున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ వారికి మంగళవారం సమయం ఇచ్చారు. దీంతో టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీవో అధ్యక్షురాలు మమత, పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు, మరికొందరు నేతలు సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన పీఆర్సీని మెరుగైన ఫిట్మెంట్తో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఓకే చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. పొరుగునఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తున్నందున.. రాష్ట్రంలో ఉద్యోగులకు అంతకంటే 2, 3 శాతం ఎక్కువ ఫిట్మెంట్ ఖరారు చేద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఈ లెక్కన 29 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. మిగతా డిమాండ్లకూ ఓకే.. టీచర్లకు పీఆర్సీ అమలు విషయంలో వచ్చిన కథనాలను పక్కనపెడుతూ ఉద్యోగులతోపాటు వారికి కూడా పీఆర్సీని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచేందుకు ఓకే చెప్పారని.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలోని ఉద్యోగులెవరైనా సర్వీసులో ఉండగా మరణిస్తే, వారి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) ప్రొబేషన్ పీరియడ్‌ను 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గించేందుకు సీఎం ఓకే చెప్పారని.. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక టీచర్ల బదిలీలు, పదోన్నతులను త్వరగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారని.. స్పౌజ్ కేటగిరీ బదిలీలు, కారుణ్య నియామకాల విషయంలో ఎప్పుటికప్పుడు చర్యలు చేపడతామన్నారని వివరించారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగులు హెల్త్ కార్డులతో కోరుకున్న ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేలా చర్యలు చేపడతామన్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులను తెలంగాణకు తీసుకువచ్చే ఫైలుపైనా సీఎం సంతకం చేసినట్టు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇచ్చేలా చర్యలు చేపడతామని సీఎం హామీ ఇచ్చినట్టు వివరించారు. ఎన్నికల నియామావళికి లోబడే చర్చలు: టీజీవో, టీఎన్జీవో ఎన్నికల నియమావళికి లోబడే తాము సీఎం కేసీఆర్‌తో చర్చించామని టీజీవో, టీఎన్జీవో నేతలు మమత, రాజేందర్ వెల్లడించారు. 2014 తర్వాత దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో పీఆర్సీని సీఎం కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగుల పదోన్నతులు కూడా త్వరితగతిన ఇచ్చారన్నారు. ఉద్యోగుల సమస్యలు అన్నింటినీ పరిష్కరించే దిశగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. పీఆర్సీ విషయాన్ని సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారని, ఆయనపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. ‘ఎన్నికల నియమావళికి లోబడే చర్చలు’ ఎన్నికల నియమావళికి లోబడే తాము సీఎం కేసీఆర్‌తో చర్చించామని టీజీవో, టీఎన్జీవో నేతలు మమత, రాజేందర్ వెల్లడించారు. 2014 తర్వాత దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో పీఆర్సీని సీఎం కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగుల పదోన్నతులు కూడా త్వరితగతిన ఇచ్చారన్నారు. ఉద్యోగుల సమస్యలు అన్నింటినీ పరిష్కరించే దిశగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. పీఆర్సీ విషయాన్ని సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారని, ఆయనపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. -
ఏపీ ఎన్జీఓ నేతల కుట్ర
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో గచ్చి బౌలి హౌసింగ్ సొసైటీకి ఇచ్చిన భూములను అమ్ముకునేందుకు ఏపీ ఎన్జీఓ నేతలు కుట్రలు చేశారని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఉద్యోగులు కష్టపడి కూడబెట్టుకుని పైసలతో ఏపీ ఎన్జీఓలు జల్సాలు చేశారని, ప్లాట్లు ఇప్పిస్తామంటూ మాయ మాటలు చెప్పి వసూళ్లకు పాల్పడ్డారని టీజీఓ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్, టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత మండిపడ్డారు. ఇటీవల గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ నూతన కార్యవర్గం ఎంపికైన విషయం తెలిసిందే. భాగ్యనగర్ టీఎన్జీఓ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణగౌడ్ చైర్మన్‌గా, పి.బలరాం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యా రు. ఈ సందర్భంగా గచ్చి బౌలి హౌసింగ్ సొసైటీ నూతన కార్యవర్గ సమావేశంలో నాంపల్లిలోని ఇంది రా ప్రియదర్శిని ఆడిటోరి యంలో సోమవారం నిర్వహించారు. ఏపీ ఎన్జీఓగా ఉన్న పేరును గచ్చిబౌలి హౌసిం గ్ సొసైటీగా మార్చుతూ తీర్మానం చేసి నోటీసులిచ్చారు. సొసైటీ కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఆంధ్రా నేతలు అమ్ముకునేవారే.. గచ్చిబౌలిలో ఉద్యోగులకు కేటాయించిన స్థలాన్ని రక్షించేందుకే సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెమో జారీ చేశారని శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి, మమత చెప్పారు. ప్రభుత్వం మెమో జారీ చేయకుంటే ఉన్న భూమిని మొత్తం ఆంధ్రా నేతలు అమ్ముకునేవారన్నారు. ఏపీ ఎన్జీఓలో సభ్యులుగా ఉంటూ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కోసం సత్యనారాయణ బృందం చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు పద్మాచారి, రేచల్, రామినేని శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
గెజిటెడ్ అధికారులకు ఒకే వేతన స్కేలు
సాక్షి, హైదరాబాద్: గెజిటెడ్ అధికారులందరికీ ఒకే విధమైన వేతన స్కేలు ఇవ్వాలని పీఆర్సీకి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) విజ్ఞప్తి చేసింది. కొన్ని శాఖల్లో పనిచేస్తున్న ప్రారంభ స్థాయి గెజిటెడ్ అధికారులకు నాన్ గెజిటెడ్ అధికారులతో సమానమైన వేతనాలు ఇస్తున్నారని, దీన్ని మార్చాలని కోరింది. సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో పీఆర్సీ చైర్మన్ పి.కె.అగర్వాల్ మంగళవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టీజీవో బృందం పీఆర్సీ చైర్మన్ ముందు పలు డిమాండ్లను వినిపించింది. గెజిటెడ్ అధికారుల కనీస మూల వేతనాన్ని రూ. 16,150 నుంచి రూ. 36,720కు పెంచాలని కోరారు. అలాగే, పదో పీఆర్సీని ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయాలని.. 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. వెంటనే 47 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వాలని కోరారు. ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ) పరిమితిని తొలగించి, జిల్లా కేంద్రాల్లో మూల వేతనంపై 25 శాతం, మిగతా ప్రాంతాల్లో 20 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. సీసీఏకు ప్రస్తుతం ఉన్న శ్లాబుల విధానాన్ని రద్దు చేసి మూలవేతనంపై 5 శాతం ఇవ్వాలని, యాంత్రిక పదోన్నతుల కాలాన్ని 6-12-18-24 నుంచి 5-10-15-20-25గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వంలా 2 సంవత్సరాలపాటు పిల్లల సంరక్షణ సెలవు కోసం డిమాండ్ చేశారు. అంగవైకల్యం ఉన్న మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా పిల్లల సంరక్షణ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. మహిళల సమస్యల పరిష్కారానికి హెచ్వోడీల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు.