సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు రంగం సిద్ధమైంది. మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం లేదని.. కోడ్ ముగిశాక ప్రకటన వెలువడనుందని అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని జనవరి నుంచి టీజీవో, టీఎన్జీవో సంఘాలు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ను కోరుతున్నాయి.
ఈ మేరకు సీఎం కేసీఆర్ వారికి మంగళవారం సమయం ఇచ్చారు. దీంతో టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీవో అధ్యక్షురాలు మమత, పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు, మరికొందరు నేతలు సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన పీఆర్సీని మెరుగైన ఫిట్‌మెంట్‌తో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఓకే చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. పొరుగునఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తున్నందున.. రాష్ట్రంలో ఉద్యోగులకు అంతకంటే 2, 3 శాతం ఎక్కువ ఫిట్‌మెంట్ ఖరారు చేద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఈ లెక్కన 29 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
మిగతా డిమాండ్లకూ ఓకే..
టీచర్లకు పీఆర్సీ అమలు విషయంలో వచ్చిన కథనాలను పక్కనపెడుతూ ఉద్యోగులతోపాటు వారికి కూడా పీఆర్సీని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచేందుకు ఓకే చెప్పారని.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలోని ఉద్యోగులెవరైనా సర్వీసులో ఉండగా మరణిస్తే, వారి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) ప్రొబేషన్ పీరియడ్‌ను 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గించేందుకు సీఎం ఓకే చెప్పారని.. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక టీచర్ల బదిలీలు, పదోన్నతులను త్వరగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారని.. స్పౌజ్ కేటగిరీ బదిలీలు, కారుణ్య నియామకాల విషయంలో ఎప్పుటికప్పుడు చర్యలు చేపడతామన్నారని వివరించారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
ఉద్యోగులు హెల్త్ కార్డులతో కోరుకున్న ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేలా చర్యలు చేపడతామన్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులను తెలంగాణకు తీసుకువచ్చే ఫైలుపైనా సీఎం సంతకం చేసినట్టు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇచ్చేలా చర్యలు చేపడతామని సీఎం హామీ ఇచ్చినట్టు వివరించారు.
ఎన్నికల నియామావళికి లోబడే చర్చలు: టీజీవో, టీఎన్జీవో
ఎన్నికల నియమావళికి లోబడే తాము సీఎం కేసీఆర్‌తో చర్చించామని టీజీవో, టీఎన్జీవో నేతలు మమత, రాజేందర్ వెల్లడించారు. 2014 తర్వాత దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో పీఆర్సీని సీఎం కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగుల పదోన్నతులు కూడా త్వరితగతిన ఇచ్చారన్నారు. ఉద్యోగుల సమస్యలు అన్నింటినీ పరిష్కరించే దిశగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. పీఆర్సీ విషయాన్ని సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారని, ఆయనపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.
‘ఎన్నికల నియమావళికి లోబడే చర్చలు’
ఎన్నికల నియమావళికి లోబడే తాము సీఎం కేసీఆర్‌తో చర్చించామని టీజీవో, టీఎన్జీవో నేతలు మమత, రాజేందర్ వెల్లడించారు. 2014 తర్వాత దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో పీఆర్సీని సీఎం కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగుల పదోన్నతులు కూడా త్వరితగతిన ఇచ్చారన్నారు. ఉద్యోగుల సమస్యలు అన్నింటినీ పరిష్కరించే దిశగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. పీఆర్సీ విషయాన్ని సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారని, ఆయనపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment