సాక్షి, హైదరాబాద్: మధ్యంతర భృతి (ఐఆర్)పై ఉద్యోగులకు నిరాశ మిగిలింది. మే 16న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా జూన్ 2న మధ్యంతర భృతి, ఆగస్టు 15న పీఆర్సీ ఫిట్‌మెంట్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. అనంతరం దీన్ని వాయిదా వేసింది. వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నివేదిక రాకుండా మధ్యంతర భృతి ప్రకటించడం సరికాదనే దీనిపై ప్రకటన చేయలేదు. పీఆర్సీ నివేదిక సిద్ధం కాకపోవడంతో ఆగస్టు 15న ఐఆర్‌పై ప్రభుత్వ ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. పీఆర్‌సీ పని ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఐఆర్‌పై ఆర్థిక శాఖ ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని తెలిసింది. తాజా పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను సవరించే ప్రక్రి య ఐదేళ్లకు ఒకసారి జరుగుతుంది. పీఆర్‌సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తాయి. పూర్తిస్థాయి నివేదిక వచ్చేలోపు ప్రభుత్వం ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. గత పీఆర్‌సీ (2013) గడువు ఈ ఏడాది జూన్ ఆఖరుతో ముగిసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో మొదటి పీఆర్‌సీని ప్రభుత్వం ఈ ఏడాది మేలోనే ఏర్పాటు చేసింది. పీఆర్‌సీ ప్రస్తుతం నివేదిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఎలాంటి మధ్యంతర నివేదికను సమర్పించలేదు. దీంతో ఐఆర్‌పై ప్రకటన ఉండే అవకాశం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో ఉద్యోగుల జీతాలు, ఫిట్మెంట్ భారీగా పెంచిన కారణంగా ఐఆర్ ఖర్చు అదేస్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. ఐఆర్ ఒక శాతం ఇస్తే ఏటా రూ.300 కోట్లు, పది శాతం ఇస్తే రూ. 3 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి వివరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు పదో పీఆర్‌సీ సందర్భంగా 27% ఐఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పదో పీఆర్‌సీ నివేదిక ఆధారంగా 43% ఫిట్‌మెంట్ ప్రకటించారు. తెలంగాణలో తొలి పీఆర్‌సీ కావడంతో ప్రస్తుతం ఐఆర్ ఎంత ఉంటుందనేది ఉద్యోగులలో ఆసక్తికరంగా మారింది.
మధ్యంతర భృతి వాయిదా!
Published Wed, Aug 15 2018 2:25 AM | Last Updated on Wed, Aug 15 2018 2:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment