Interim allowance
-
మధ్యంతర భృతి ఊసేది!?
సాక్షి, అమరావతి బ్యూరో: పదో పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) గడువు ముగిసి నాలుగు నెలలు దాటింది.. 11వ పీఆర్సీ, ఐఆర్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ స్పష్టమైన వైఖరిని ప్రకటించడంలేదు. కొత్త పీఆర్సీ వేస్తారని, తమ జీతాలు పెరుగుతాయని ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే, ప్రభుత్వం రెండు నెలల క్రితం అశుతోష్ మిశ్రా అధ్యక్షతన కంటితుడుపు చర్యగా కమిటీ వేసి నివేదిక ఇవ్వడానికి ఏడాది కాలపరిమితి విధించి చేతులు దులుపుకుంది. ఈ కమిటీ ఇంకా ఏడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. కమిటీ నివేదిక వచ్చేలోగా పెరిగిన ధరలతో ఉద్యోగులు ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల ఐక్యతకు చిచ్చు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించి వారి ఐక్యతను దెబ్బతీసింది. ఉపాధ్యాయులలో పండిట్ అప్‌గ్రెడేషన్‌తో ఎస్జీటీలకు, పండిట్లకు మధ్య చిచ్చు పెట్టింది. ఉద్యోగ సంఘాలు కూడా ఈ వివాదంలో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతుండటంతో ఐఆర్‌ను అడిగేవారు లేకుండాపోయారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు.. ఎన్జీఓలు సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెట్టారు. ఇదే అదునుగా తీసుకుని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలాగే దాటేస్తారా? ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం 11వ పీఆర్సీ వెంటనే ఇస్తామంటూ చెప్పి కనీసం ఐఆర్‌ని కూడా ప్రకటించకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. తదుపరి నిర్ణయాన్ని గవర్నర్‌కి అప్పగించి చేతులు దులుపుకుంది. ఇక్కడ కూడా జనవరిలో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు ఉండటం, ముందస్తుగా సాధారణ ఎన్నికలు జరగనున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వాలు ఇలా మభ్యపెట్టి అలస్యం చేయడంవల్ల ఇప్పటికే రెండు పీఆర్సీలు వెనకబడి ఉన్నామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రభావం పదవీ విరమణ తర్వాత ఎక్కువగా ఉంటుందని వాపోతున్నారు. డిసెంబర్లోనే నిర్ణయం ప్రకటించాలి పండిట్ అప్‌గ్రెడేషన్, పీఆర్సీ అంశాలను వేర్వేరుగా చూడాలి. ఈ రెండింటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు పీఆర్సీలను ప్రకటించే ఎన్నికలకు వెళ్లాయి. జిల్లాల పర్యటనంటూ కమిటీ కాలయాపన చేస్తోంది తప్ప ఉద్యోగుల అవసరాలను పరిగణలోకి తీసుకోలేదు. డిసెంబరులోగా ఐఆర్‌పై సహేతుక నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతాం. – ఎన్. రఘురామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (257) రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధం పీఆర్సీ గడువు ముగిసి నాలుగు నెలలు పూర్తయినా కమిటీ ఇప్పటివరకు కేవలం ఆరు జిల్లాల్లోనే పర్యటించింది. ఇంకా ఏడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న ఐఆర్‌ను వెంటనే ప్రకటించకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు దిగుతాం. ఉద్యోగుల ఆగ్రహాన్ని ఎదుర్కోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. – చేబ్రోలు శరత్చంద్ర, బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
మధ్యంతర భృతి వాయిదా!
సాక్షి, హైదరాబాద్: మధ్యంతర భృతి (ఐఆర్)పై ఉద్యోగులకు నిరాశ మిగిలింది. మే 16న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా జూన్ 2న మధ్యంతర భృతి, ఆగస్టు 15న పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. అనంతరం దీన్ని వాయిదా వేసింది. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదిక రాకుండా మధ్యంతర భృతి ప్రకటించడం సరికాదనే దీనిపై ప్రకటన చేయలేదు. పీఆర్సీ నివేదిక సిద్ధం కాకపోవడంతో ఆగస్టు 15న ఐఆర్‌పై ప్రభుత్వ ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. పీఆర్సీ పని ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఐఆర్‌పై ఆర్థిక శాఖ ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని తెలిసింది. తాజా పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను సవరించే ప్రక్రి య ఐదేళ్లకు ఒకసారి జరుగుతుంది. పీఆర్సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తాయి. పూర్తిస్థాయి నివేదిక వచ్చేలోపు ప్రభుత్వం ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. గత పీఆర్సీ (2013) గడువు ఈ ఏడాది జూన్ ఆఖరుతో ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొదటి పీఆర్సీని ప్రభుత్వం ఈ ఏడాది మేలోనే ఏర్పాటు చేసింది. పీఆర్సీ ప్రస్తుతం నివేదిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఎలాంటి మధ్యంతర నివేదికను సమర్పించలేదు. దీంతో ఐఆర్‌పై ప్రకటన ఉండే అవకాశం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో ఉద్యోగుల జీతాలు, ఫిట్మెంట్ భారీగా పెంచిన కారణంగా ఐఆర్ ఖర్చు అదేస్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. ఐఆర్ ఒక శాతం ఇస్తే ఏటా రూ.300 కోట్లు, పది శాతం ఇస్తే రూ. 3 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి వివరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు పదో పీఆర్సీ సందర్భంగా 27% ఐఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పదో పీఆర్సీ నివేదిక ఆధారంగా 43% ఫిట్మెంట్ ప్రకటించారు. తెలంగాణలో తొలి పీఆర్సీ కావడంతో ప్రస్తుతం ఐఆర్ ఎంత ఉంటుందనేది ఉద్యోగులలో ఆసక్తికరంగా మారింది. -
35% కాదు.. 37% దాటాల్సిందే
పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ సంఘాలు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల 10వ వేతన సవరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు అధికారవర్గాలు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భత్యం చెల్లిస్తున్నారు. పదో వేతన సవరణ సంఘం సిఫారసు చేసింది 29 శాతం ఫిట్మెంట్ మాత్రమే. మరో ఆరేడు శాతం పెంచి ఫిట్‌మెంట్‌ను 35 శాతంగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాలు అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం 61 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నా.. కనీసం 37 శాతం దాటితే తప్ప ఫలితం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. 37 శాతం దాటితే రెండు, 42 శాతం దాటితే మూడు ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఫిట్మెంట్లో ఒక శాతం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా మూడు వందల కోట్ల మేరకు భారం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానం గా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చింది. తొలి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం అనంతరం కసరత్తు చేయడానికి ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర వేతన సవరణ తరువాతనే కేంద్ర ఉద్యోగులతో సమాన వేతనాలను ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. -
ఆర్టీసీ సమ్మె యోచన విరమణ
-
ఆర్టీసీ సమ్మె యోచన విరమణ
27శాతం ఐఆర్ చెల్లించేందుకు ఎండీ అంగీకారం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో బుధవారం ఉదయం నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మె యోచనను విరమించుకుంటున్నట్లు గుర్తింపు కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లు మంగళవారం రాత్రి ప్రకటించాయి. ఈ నెల జీతంతో పాటే మధ్యంతర భృతిని కలిపి చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా ఇప్పటివరకు బకాయిపడిన ఐఆర్‌ను సప్లిమెంటరీ బిల్లు ద్వారా ఏప్రిల్ 15వ తేదీ నాటికి అందజేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్రావు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు సమ్మె యోచనను విరమించుకున్నాయి. అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం కార్మికశాఖ అదనపు కమిషనర్ మురళీసాగర్ ఆర్టీసీ అధికారులను, కార్మిక సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించారు. 2 గంటలపాటు చర్చలు జరిగాయి. ప్రభుత్వం గ్రాంటు అందజేయడంలో జాప్యం కారణంగానే మధ్యంతర భృతిని చెల్లించలేకపోతున్నట్లు ఆర్టీసీ ఎండీ చెప్పారు. దాంతోసమ్మెకు వెళ్లనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ఉన్న దృష్ట్యా సమ్మె యోచనను విరమింపజేయాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ఎండీ ప్రభుత్వ ఉన్నతాధికారులను సంప్రదించారు. అనంతరం మరోసారి కార్మిక నాయకులను చర్చలకు పిలిచారు. రాత్రి 10.30 గంటల వరకు చర్చలు జరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు కోరిన వెంటనే 27 శాతం మధ్యంతర భృతిని చెల్లించిన ప్రభుత్వం తమ విషయంలో వివక్ష ప్రదర్శించడం తగదని కార్మిక నాయకులు అన్నారు. దిగొచ్చిన యాజమాన్యం మధ్యంతర భృతిని ఈ నెల జీతంతోనే చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఎండీ పూర్ణచందర్రావు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వథ్ధామరెడ్డి, దామోదర్‌లు సమ్మె యోచనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
ఐఆర్‌కోసం ఆర్టీసీ కార్మికుల దీక్ష
హైదరాబాద్, న్యూస్‌లైన్: కార్మికులకు తక్షణమే మధ్యంతర భృతిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఐక్య కూటమి ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌వద్ద రెండు రోజుల దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఇ. అశ్వథ్థామరెడ్డి, ఈయూ అదనపు ప్రధాన కార్యదర్శి వీఎస్ రావులు మాట్లాడుతూ జనవరి 26న జరిగిన ఒప్పందం మేరకు ఫిబ్రవరి వేతనంతో పాటు ఐఆర్ చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మధ్యంతర భృతి రాక ఆర్టీసీలో లక్షా 25 వేల మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 12 లోగా ఐఆర్ చెల్లిస్తున్నట్లు ఆర్టీసీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 217 డిపోల్లో నిరవధిక సమ్మె ప్రారంభమవుతుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కార్మిక శాఖ కమిషనర్ చర్చలకు ఆహ్వానించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు జరగనున్నాయి. -
‘మున్సిపల్’ సమ్మె యథాతథం!
మంత్రి మహీధర్‌రెడ్డితో చర్చలు విఫలం డిమాండ్లు పరిష్కరించాలన్న కార్మికులు ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిన వైనం సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మెను కొనసాగించాలని మున్సిపల్ కార్మికులు నిర్ణయించారు. పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డితో సోమవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యంతర భృతిపై అటు మంత్రికి, ఇటు కార్మికులకు అవగాహన కుదరకపోవడంతో చర్చలు విఫలమైనట్టు తెలిపారు. మధ్యంతర భృతిని 50 శాతం ఇవ్వాలని కార్మికులు పట్టుబడుతుండగా, 25 శాతం ఇవ్వడానికి మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. అయితే, తమ వేతనాలు చాలా తక్కువగా ఉన్నందున కనీసం 40 శాతమైనా ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య కార్డులు ఇచ్చేందుకు మంత్రి అంగీకరించారు. పే రివిజన్ కమిషన్ ఇచ్చే నివేదికలో చివరి గ్రేడు ఉద్యోగులకు చెల్లించే వేతనాలను ఇవ్వడానికి కూడా మంత్రి మహీధర్‌రెడ్డి పచ్చజెండా ఊపారు. కాగా, కార్మికులు పట్టుబడుతున్న మధ్యంతర భృతిపై సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఈ మేరకు ఏఐటీయూసీ నాయకుడు కిర్ల కృష్ణారావు, బీఎంఎస్ నాయకుడు శంకర్, సీఐటీ యూ నాయకుడు పాలడుగు భాస్కర్లు తెలిపారు. మరోపక్క, శనివారం నుంచి కొనసాగుతున్న సమ్మెతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయి దుర్వాసన అలుముకుంది. పారిశుద్ధ్యంతోపాటు తాగునీటి సరఫరా, వీధి దీపాల సేవలను సైతం కార్మికులు సోమవారం నుంచి నిలిపివేయడంతో ప్రజలు మరిన్ని ఇక్కట్లు పడాల్సి వస్తోంది. -
ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులకూ 27 % మధ్యంతర భృతి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని కాంట్రాక్టు కార్మికులకు కూడా వర్తింపచేయనున్నారు. వాస్తవానికి రెగ్యులర్ కార్మికులకే దీన్ని వర్తింపచేయాల్సి ఉన్నప్పటికీ, కాంట్రాక్టు కార్మికులను ఖాళీల భర్తీ రూపంలో తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు ఇటీవల ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఐఆర్ వర్తింపు కూడా సాధ్యం కానుంది. ఈ విషయంపై కార్మిక సంఘాలు చేసిన అభ్యర్థనకు సర్కారు అంగీకరించింది. ఇటు రెగ్యులర్ ఉద్యోగం, అటు మధ్యంతర భృతి.. వెరసి కాంట్రాక్టు సిబ్బందికి ఒకేసారి రెండు ప్రయోజనాలు లభించినట్టయింది. రూ.5,670 బేసిక్‌తో శ్రామిక్‌గా పనిచేస్తున్నవారికి రూ.1,530, రూ.6,570 వేతనం పొందుతున్న కాంట్రాక్టు కండక్టర్లకు రూ.1,774, రూ.7,180 వేతనం పొందుతున్న కాంట్రాక్టు డ్రైవర్లకు రూ.1,938 చొప్పున ఐఆర్ ఉంటుందని, మిగతా అన్నిరకాల కార్మికులకు కనిష్టంగా రూ.1,530, గరిష్టంగా రూ.9,300 మేర ప్రయోజనం ఉంటుందని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ప్రధాన కార్యదర్శి పద్మాకర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్థామరెడ్డిలు ఓ ప్రకటనలో తెలిపారు. -
ఆర్టీసీలో ఐఆర్‌పై కుదరని సయోధ్య
-
ఆర్టీసీలో ఐఆర్‌పై కుదరని సయోధ్య
రవాణా మంత్రి బొత్సతో చర్చల్లో ప్రతిష్టంభన 32 శాతం కావాలన్న కార్మికులు... 21 శాతం ఇస్తామన్న ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మె తప్పదు: ఆర్టీసీ యూనియన్లు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మె తప్పేలాలేదు. మధ్యంతర భృతి (ఐఆర్) విషయంలో కార్మిక సంఘాలు, ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదరకపోవటంతో సమ్మె విషయంలో పునరాలోచన లేదని కార్మికసంఘాలు శుక్రవారం తేల్చి చెప్పాయి. ముందు చెప్పినట్టుగా ఈనెల 27 నుంచి సమ్మెకు దిగుతామని, ఇందుకు కార్మికులు సిద్ధం కావాలంటూ మరోసారి పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు గురువారమే సమ్మె తేదీని ప్రకటించటంతో రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఉదయం గుర్తింపు కార్మిక సంఘాల నేతలను చర్చలకు పిలిచారు. కానీ రెండువైపులా కొంత పట్టువిడుపుల ధోరణి కనిపించినా చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు. దీంతో ఈనెల 26న మరోసారి భేటీ అవుదామని మంత్రి బొత్స చెప్పారు. చర్చలు పూర్తికాలేదని, మరోసారి కార్మిక సంఘాలతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని సమావేశానంతరం ఆయన ప్రకటించారు. చర్చలు విఫలమయ్యాయని, తమ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోనందున అని వార్య పరిస్థితిలో సమ్మెకు సిద్ధమవుతున్నామని కార్మిక నేతలు చెప్పారు. ప్రభుత్వోద్యోగులతో సమానంగా ప్రకటించాలి: నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు ప్రకటించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ వేతనాల విషయంలో ప్రభుత్వోద్యోగుల కంటే బాగా వెనుకబడి ఉన్నందున ఐఆర్ వారి (27%) కంటే 19% అదనంగా కలిపి మొత్తం 46% ప్రకటించాలని పట్టుబట్టాయి. శుక్రవారం మంత్రి బొత్సతో జరిగిన సమావేశంలో తొలుత ఇదే ప్రతిపాదనను యూనియన్ల నేతలు ప్రస్తావించారు. కానీ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున అంత ఐఆర్ ప్రకటించటం సాధ్యం కాదని మంత్రి బొత్స తేల్చి చెప్పారు. దీంతో కాస్త మెత్తబడ్డ నేతలు దాన్ని 32 శాతంగా ఖాయం చేయాలని అడిగారు. అయితే అది కూడా చాలా ఎక్కువని, 21% ఇవ్వటానికి సిద్ధమని మంత్రి చెప్పారు. దీన్ని యూనియన్ల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ భేటీలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్థసారథి, ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు చెందిన పద్మాకర్, అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి, బాబు, ప్రసాద్‌రెడ్డి, తిరుపతి, థామస్‌రెడ్డి, నారయ్యలు పాల్గొన్నారు. 27% అంగీకరించే అవకాశం: ప్రభుత్వోద్యోగులకు ఇటీవల 27% ఐఆర్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ నష్టాల దృష్ట్యా చివరకు అంతే మొత్తం ప్రకటించినా సానుకూలంగా స్పందించేందుకు సిద్ధమని కార్మిక సంఘాలు సంకేతాలిస్తున్నాయి. అంతకంటే తక్కువ అయితే అంగీకరించకూడదని ఓ నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. మలి దఫా చర్చల్లో 27% ప్రకటిస్తే సమ్మె యోచనను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
పీఎస్‌యూ ఉద్యోగులకూ ఐఆర్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ) ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) త్వరలోనే అందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పీఎస్‌యూ ఉద్యోగులకు ఐఆర్ వర్తించదని పేర్కొనడం తెలిసిందే. ఫలితంగా దాదాపు 80 వేల మంది పీఎస్‌యూ ఉద్యోగులకు ఐఆర్ అందే అవకాశం లేకుండా పోయింది. ఈ అంశంపై ‘సాక్షి’ ఇటీవల వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం సంబంధిత జీవో సవరణకు చర్యలు చేపట్టింది. ఈమేరకు రూపొందించిన ఫైలుపై ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సంతకం చేసి ముఖ్యమంత్రి ఆమోదానికి పంపారని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం ఆమోదించాక జీవో వెలువడే అవకాశం ఉందన్నాయి. -
పెన్షనర్లకు 27 శాతం ఐఆర్... జీవో జారీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) మంజూరు చేసిన ప్రభుత్వం, తాజాగా పెన్షనర్లకు 27 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లకు కూడా ఈ ఏడాది జనవరి 1 నుంచి తాజా ఐఆర్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బందికి ఐఆర్ వర్తించదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పీఎస్‌యూ ఉద్యోగులకు ఐఆర్ వర్తించదంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై ‘సాక్షి’ కథనానికి స్పందించిన ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జీవోను సవరించేందుకు వీలుగా ఐఆర్ ఫైల్‌ను సర్క్యులేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. -
ఆర్టీసీలో తాత్కాలిక కొలువులు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ పద్ధతిలో కండక్టర్ల, డ్రైవర్ల నియామకాలకు ఆర్టీసీ ముగింపు పలికి, దానికి బదులుగా టెంపరరీ(తాత్కాలిక) విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఈమేరకు శుక్రవారం జరగనున్న పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఆలోచనను కార్మిక సంఘాలు స్వాగతించాయి. అయితే రెగ్యులర్ విధానంలో కాకుండా తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవడానికి అనుమతి ఇవ్వడం పట్ల కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నియామకాలన్నీ రెగ్యులర్ పద్ధతిలోనే చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐఆర్‌పై 17న ప్రకటన: ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వడానికి అభ్యంతరం లేదని, కానీ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఈనెల 17న నిర్ణయం వెలువరిస్తామని ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలకు తెలిపింది. సంస్థ ఎండీ జె.పూర్ణచంద్రరావు గురువారం ఈయూ, టీఎంయూ ప్రతినిధిబృందంతో చర్చలు జరిపారు. సంస్థ ప్రకటించే ఐఆర్ సంతృప్తికరంగా లేకుంటే.. అదే రోజు సమ్మె తేదీని ప్రకటిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. -
మధ్యంతర భృతి 22శాతం మించి ఇవ్వలేం
-
మధ్యంతర భృతి 22శాతం మించి ఇవ్వలేం
హైదరాబాద్: మధ్యంతర భృతిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉద్యోగ సంఘాల నేతలతో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి జరిపిన చర్చలు ముగిశాయి. ఉద్యోగ సంఘాలకు ఇచ్చే మధ్యంతర భృతిపై 22శాతం మించి ఇవ్వలేమని ప్రభుత్వం పేర్కొంది. ఈ చర్చల్లో ఉద్యోగసంఘాలు 32శాతమైనా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో 32శాతం మధ్యంతర భృతి ఇవ్వలేమని చెప్పినట్టు తెలిసింది. అయితే రేపు ఉదయం 11.30 గంటలకు క్యాంప్ ఆఫీస్‌లో మధ్యంతర భృతిపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరపనున్నట్టు సమాచారం. కాగా, మధ్యంతర భృతిపై చర్చించేందుకు మంత్రి ఆనంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం సమావేశమైన సంగతి తెలిసిందే. -
జనవరి 3న అసెంబ్లీ ముట్టడి: ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్: మధ్యంతర భృతి చెల్లింపులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనవరి 3న అసెంబ్లీని ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించాయి. శనివారం ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కిరణ్ కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్ ను 45శాతం ఐర్(మధ్యంతర భృతి)ను కోరామని చెప్పారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ ను సీఎం కిరణ్ ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో సీఎం కిరణ్ తీరుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఇందుకు నిరసనగా జనవరి 3న చలో అసెంబ్లీని నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. కాగా, ఈ సమావేశంలో ఇవాళ ఉద్యోగుల హెల్త్ కార్డులపైనే చర్చ జరిగిందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. కాగా, నాలుగైదు రోజుల్లో చర్చలకు మళ్లీ పిలుస్తామని కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పినట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. -
22-25 శాతం మధ్యంతర భృతి!
* నేడు సీఎం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి భేటీ * 30% అయినా ఇవ్వాలని కోరుతున్న ఉద్యోగ సంఘాలు * గతంలో 22% ఐఆర్ ఇచ్చిన వైఎస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కార్యాలయం ఆర్థిక మంత్రితో పాటు ఉన్నతాధికారులను, ఉద్యోగ సంఘాల నేతలను శనివారం అందుబాటులో ఉండాల్సిందిగా కోరింది. పదవ వేతన సవరణ కమిషన్ నివేదిక వచ్చే ఏడాది గానీ ప్రభుత్వానికి అందే అవకాశం లేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు గత కొంత కాలంగా మధ్యంతర భృతి (ఐఆర్)ని మంజూరు చేయాల్సిందిగా కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శనివారం ఉదయం ఆర్థిక శాఖ మంత్రి, సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమై కసరత్తు చేయనున్నారు. సాయంత్రం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోకూడా సమావేశం ఉంటుందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగిపోయినందున మధ్యంతర భృతిని 40 నుంచి 50 శాతం వరకు ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఆర్థిక శాఖ అధికారులు 17 శాతం వరకు ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల భేటీ సమయంలో 20 నుంచి 25 శాతం వరకు మధ్యంతర భృతి మంజూరుపై చర్చలు జరిగే అవకాశం ఉందని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003లో ఉద్యోగులకు 8.5 శాతమే ఐఆర్ మంజూరు చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను 16 శాతం వరకు ఇచ్చారు. అలాగే ఆయన తొమ్మిదవ వేతన సవరణ కమిషన్‌ను నియమించారు. కమిషన్ నివేదిక రాకముందే ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఐఆర్‌ను ఏకంగా 22 శాతం మేర మంజూరు చేశారు. ఆ విషయాన్ని ఇప్పుడు చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం 30 శాతం మేర అయినా మంజూరు చేయాలనేది ఉద్యోగ సంఘాల వాదనగా ఉంది. అంతిమంగా 22 నుంచి 25 శాతం మధ్యలో ముఖ్యమంత్రి ఐఆర్ మంజూరు చేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తొమ్మిదవ వేతన సవరణ కమిషన్ గడువు ఈ ఏడాది జూన్ నెలాఖరుతో ముగిసింది. పదో కమిషన్ సవరణ వేతనాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నందున అప్పటి నుంచే మధ్యంతర భృతిని మంజూరు చేయాల్సిందిగా ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. -
వారంలో ఐఆర్!
25 శాతం లేదా 26 శాతం ఇచ్చే అవకాశం? సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు మధ్యంతర భృతి(ఐఆర్)ని వారం రోజుల్లోగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈనెల 21వ తేదీలోగా ఇచ్చేలా చర్యలు చేపడతామని పేర్కొంది. శనివారం సచివాలయంలో వివిధ ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం సమావేశమై ఐఆర్‌పై చర్చించింది. సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండ్రు మురళి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, ఉపాధ్యాయ సంఘాలు, సచివాలయ ఉద్యోగుల, ఇతర సంఘాలను చర్చలకు ఆహ్వానించారు. అయితే తెలంగాణ, సచివాలయ, ఉపాధ్యాయ సంఘాలు ముందుగానే రాగా.. ఏపీఎన్జీవోస్ మరికొన్ని కొన్ని సంఘాలు తరువాత వచ్చాయి. ముందుగా వచ్చిన సంఘాలతోనే హాల్ నిండిపోవడంతో ఏపీఎన్జీవోస్, ఇతర సంఘాల నేతలు అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి తదితరులు వేచి ఉండాల్సి వచ్చింది. టీఎన్జీవోస్తోపాటు తెలంగాణకు చెందిన ఇతర సంఘాలు, పీఆర్టీయూ తదితర సంఘాలతో చర్చల అనంతరం ఏపీఎన్జీవోస్, ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ తదితర సంఘాలతో మంత్రుల బృందం చర్చలు జరిపింది. ఏయే సంఘం ఎంత ఐఆర్ ఇవ్వాలని కోరుతోంది..? దానికి ప్రాతిపదిక ఏమిటనే అంశాలపై వివరాలను సేకరించింది. ఏపీఎన్జీవోస్ నేత అశోక్‌బాబుతోపాటు ఉపాధ్యాయ సంఘాలైన పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నేతలు పి.వెంకట్‌రెడ్డి, కత్తి నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్రావు, రఘురామిరెడ్డి తదితర సంఘాల నేతలు నిత్యావసర ధరలను విపరీతంగా పెరిగినందున 50 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరారు. టీఎన్జీఓస్ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, సచివాలయ తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు నరేందర్‌రావు, మురళీకృష్ణ తదితరులు 45 శాతం అడిగారు. టీ జీవోస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు 47 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరారు. మొత్తానికి అన్ని సంఘాలు 45 శాతం నుంచి 50 శాతం వరకు ఐఆర్ ఇవ్వాలని కోరాయి. ప్రభుత్వం మాత్రం 25 శాతం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంఘాలు మరీ పట్టుపడితే.. 26 శాతం ఇచ్చే అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 18 శాతం ఐఆర్ ఇవ్వగా ఐదేళ్ల కిందట 22 శాతం ఐఆర్ ఇచ్చింది. ఐదేళ్ల కిందట ఇచ్చినపుడు ఒక్క శాతానికి రూ. 124 కోట్లు కాగా, ఇపుడు రూ. 284 కోట్లు వెచ్చించాల్సివస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎక్కువ మొత్తం ఇవ్వడం ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుందని ఆలోచనలు చేస్తోంది. గతంలో కంటే ఎక్కువ ఇచ్చామని చెప్పుకునేందుకు వీలుగా 25 శాతం లేదా 26 శాతం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై వారం రోజుల్లో (ఈనెల 21వ తేదీలోగా) ముఖ్యమంత్రి వద్ద మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకొని ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. సంఘాలను వేర్వేరుగా పిలవాల్సిందే! మంత్రుల బృందంతో చర్చల అనంతరం సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాలను వేర్వేరుగానే చర్చలకు పిలవాలని టీఎన్జీవోస అధ్యక్షుడు దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. జీఏడీ రూపొందించిన జాబితా ప్రకారం చర్చలు జరిపి జాప్యం చేయకుండా ఐఆర్ ఇవ్వాలని కోరారు. సమావేశం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు విమర్శించారు. సమావేశ మందిరంలోకి అందరినీ అనుమతించకుండా.. సంఘానికి ఇద్దరు చొప్పున అనుమతించాల్సిందన్నారు. హెల్త్ కార్డుల ఉత్తర్వులను నిలిపివేయాలని, సవరించిన తరువాత జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం వేర్వేరుగా చర్చలు జరపాలని పీఆర్టీయూ అధ్యక్షుడు వె ంకట్‌రెడ్డి పేర్కొన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సంఘాల ప్రకారం 4.5 లక్షల మంది ఉన్న టీచర్ల సంఘాలను వేరుగా పిలిచి మాట్లాడాలన్నారు. వారంలోగా సీఎంతో చర్చించి నిర్ణయం: ఆనం ఉద్యోగులకు మధ్యంతర భృతిపై వారం రోజుల్లోగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపామని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. -
47 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని కోరాం: టీఎన్జీవో
హైదరాబాద్: ఉద్యోగులకు 47 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు టీఎన్జీవో తెలిపింది. అలాగే ఏపీఎన్జీవోలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మధ్యంతర భృతిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సబ్ కమిటీ చెప్పినట్టు పేర్కొంది. అయితే ఏపీఎన్జీవో, టీఎన్జీవోలను విడివిడిగా చర్చలకు పిలవమని టీఎన్జీవో సూచించింది. కాగా, మధ్యంతర భృతిపై చర్చించేందుకు... ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మంత్రి మండలి ఉప సంఘం ఈ సాయంత్రం సచివాలయంలో సమావేశమైంది. -
పదిరోజుల్లో మధ్యంతర భృతిపై నిర్ణయం: మంత్రి ఆనం
హైదరాబాద్: పదిరోజుల్లో మధ్యంతర భృతిపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉద్యోగసంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం భేటీలు ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ఉద్యోగులు 45-50 శాతం వరకూ మధ్యంతర భృతిని కోరినట్టు చెప్పారు. మధ్యంతర భృతిపై చర్చించేందుకు... ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మంత్రి మండలి ఉప సంఘం ఈ సాయంత్రం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, కొండ్రు మురళి, ఉత్తమకుమార్ రెడ్డి హాజరయ్యారు. వారితోపాటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా హజరయ్యారు. -
ఆర్టీసీ కార్మికులకు 50% ఐఆర్ ప్రకటించాలి: ఈయూ
సాక్షి, హైదరాబాద్: ఆప్రకటించాలని, ప్రభుత్వం ఇప్పటికే భృతిని నిర్ధారించి ఉంటే ఇతర శాఖల ఉద్యోగుల కంటే ఆర్టీసీ కార్మికులకు వేర్టీసీ కార్మికులకు 50 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని వెంటనే తనంలో ఉన్న 19 శాతం వ్యత్యాసాన్ని కలపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) సర్కారును డిమాండ్ చేసింది. జీతభత్యాల సవరణపై యూని యన్ నేతలతో పే కమిటీ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈయూ ఈ మేరకు డిమాండ్ చేసినట్టు ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాశ్వత ప్రాతిపదికనే పోస్టుల భర్తీ: ఎన్ఎంయూ డిమాండ్ ఆర్టీసీలో శ్రామిక్, మెకానిక్స్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తూ డ్రైవర్, కండక్టర్ పోస్టులకు మాత్రం కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు జరపడం ఏమిటని ఎన్ఎంయూ ప్రశ్నించింది. ఈ విధానానికి వెంటనే స్వస్తి పలకాలని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, మహమూద్‌లు డిమాండ్ చేశారు.