ఆర్టీసీలో ఐఆర్‌పై కుదరని సయోధ్య
రవాణా మంత్రి బొత్సతో చర్చల్లో ప్రతిష్టంభన
32 శాతం కావాలన్న కార్మికులు...
21 శాతం ఇస్తామన్న ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మె తప్పదు: ఆర్టీసీ యూనియన్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మె తప్పేలాలేదు. మధ్యంతర భృతి (ఐఆర్) విషయంలో కార్మిక సంఘాలు, ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదరకపోవటంతో సమ్మె విషయంలో పునరాలోచన లేదని కార్మికసంఘాలు శుక్రవారం తేల్చి చెప్పాయి. ముందు చెప్పినట్టుగా ఈనెల 27 నుంచి సమ్మెకు దిగుతామని, ఇందుకు కార్మికులు సిద్ధం కావాలంటూ మరోసారి పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు గురువారమే సమ్మె తేదీని ప్రకటించటంతో రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఉదయం గుర్తింపు కార్మిక సంఘాల నేతలను చర్చలకు పిలిచారు. కానీ రెండువైపులా కొంత పట్టువిడుపుల ధోరణి కనిపించినా చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు. దీంతో ఈనెల 26న మరోసారి భేటీ అవుదామని మంత్రి బొత్స చెప్పారు. చర్చలు పూర్తికాలేదని, మరోసారి కార్మిక సంఘాలతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని సమావేశానంతరం ఆయన ప్రకటించారు. చర్చలు విఫలమయ్యాయని, తమ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోనందున అని వార్య పరిస్థితిలో సమ్మెకు సిద్ధమవుతున్నామని కార్మిక నేతలు చెప్పారు.
ప్రభుత్వోద్యోగులతో సమానంగా ప్రకటించాలి: నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు ప్రకటించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ వేతనాల విషయంలో ప్రభుత్వోద్యోగుల కంటే బాగా వెనుకబడి ఉన్నందున ఐఆర్ వారి (27%) కంటే 19% అదనంగా కలిపి మొత్తం 46% ప్రకటించాలని పట్టుబట్టాయి. శుక్రవారం మంత్రి బొత్సతో జరిగిన సమావేశంలో తొలుత ఇదే ప్రతిపాదనను యూనియన్ల నేతలు ప్రస్తావించారు. కానీ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున అంత ఐఆర్ ప్రకటించటం సాధ్యం కాదని మంత్రి బొత్స తేల్చి చెప్పారు. దీంతో కాస్త మెత్తబడ్డ నేతలు దాన్ని 32 శాతంగా ఖాయం చేయాలని అడిగారు. అయితే అది కూడా చాలా ఎక్కువని, 21% ఇవ్వటానికి సిద్ధమని మంత్రి చెప్పారు. దీన్ని యూనియన్ల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ భేటీలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్థసారథి, ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు చెందిన పద్మాకర్, అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి, బాబు, ప్రసాద్‌రెడ్డి, తిరుపతి, థామస్‌రెడ్డి, నారయ్యలు పాల్గొన్నారు.
27% అంగీకరించే అవకాశం: ప్రభుత్వోద్యోగులకు ఇటీవల 27% ఐఆర్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ నష్టాల దృష్ట్యా చివరకు అంతే మొత్తం ప్రకటించినా సానుకూలంగా స్పందించేందుకు సిద్ధమని కార్మిక సంఘాలు సంకేతాలిస్తున్నాయి. అంతకంటే తక్కువ అయితే అంగీకరించకూడదని ఓ నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. మలి దఫా చర్చల్లో 27% ప్రకటిస్తే సమ్మె యోచనను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది.