సమ్మెకు వెళ్లొద్దు : బొత్స
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉందని, సమ్మె వల్ల ఆర్థికంగా ఇంకా నష్టపోతామని, అందువల్ల సమ్మెకు వెళ్లొద్దని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రలో ఈనెల 12 అర్ధరాత్రి నుంచి ఈయూ, ఎన్‌ఎంయూ, తెలంగాణలో టీఎంయూ సమ్మెకు దిగడానికి సిద్ధమైన నేపథ్యంలో.. కార్మిక సంఘాల నేతలతో మంత్రి బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీకి ఈయూ, టీఎంయూ నేతలు హాజరుకాగా.. ఎన్‌ఎంయూ నేతలు డుమ్మా కొట్టారు. సమ్మె వల్ల సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లడంతోపాటు ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో ప్రజలకు ఆర్టీసీ సేవలు చాలా అవసరమన్నారు. సీమాంధ్రకు పోటీగా తెలంగాణలో సమ్మె చేస్తే ఇబ్బంది ఎదురవుతుందని చెప్పారు. అయితే సమ్మె నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేమని కార్మిక సంఘాల నేతలు మంత్రికి స్పష్టంచేశారు.
టీఎంయూ సమ్మె నోటీసు..: హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయడానికి పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ టీఎంయూ బుధవారం ఈడీ(పరిపాలన) వెంకటేశ్వరరావుకు సమ్మె నోటీసు ఇచ్చింది. తాము ఏక్షణమైనా సమ్మెకు దిగుతామని టీఎంయూ నేతలు అందులో పేర్కొన్నారు. మరోవైపు టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయడానికి ఈయూ తెలంగాణ కార్యవర్గం గురువారం సమావేశం కానుంది.