rtc strike notice
-
ఆర్టీసీ కార్మికుల సమ్మె లేనట్లే..
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) విలీనానికి తొలి అడుగు పడింది. ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛను తాము అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అధ్యయన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి టి.కృష్ణబాబు, ఆర్టీసీ ఉన్నతాధికారులు శనివారం వెలగపూడిలోని సచివాలయంలో చర్చలు జరిపారు. చర్చలు ఫలప్రదంగా ముగిశాయని సమావేశం అనంతరం జేఏసీ నేతలు మీడియాకు తెలిపారు. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముఖ్యమంత్రి జగన్ సుముఖంగా ఉన్నారని, కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలియజేశారని జేఏసీ నేతలు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ నుంచి సమ్మె చేపడతామని తామిచ్చిన సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు జేఏసీ కన్వీనర్ పి.దామోదరరావు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుస్తామని, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని జేఏసీ నేతలు చెప్పారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుండడం సంతోషకరమని అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలో జరగాల్సిన సమ్మె సన్నాహక సభలను విరమించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ చర్చల్లో యాజమాన్యం తరఫున ఆర్టీసీ ఈడీలు కూడా పాల్గొన్నారు. విలీనానికి చకచకా ఏర్పాట్లు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర సర్కారు త్వరలో అధ్యయన కమిటీని నియమించనుంది. గతంలో ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా పనిచేసి, పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీలో కార్మిక సంఘాల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీ నియామకంపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. రెండు నెలల్లో ఈ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు ఖరారు చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు విలీన ప్రక్రియపై ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. -
ఆర్టీసీలో సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఈ నెల 8న చర్చలకు రావాలని ఆర్టీసీ గుర్తింపు సంఘం, జేఏసీ సహా అన్ని కార్మిక సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. సమ్మె ఆగాలంటే వెంటనే కార్మికుల వేతనాలు పెంచాలని, వేతన సవరణ చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా వేతన సవరణకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో సమ్మె చేపట్టనున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 11న తెల్లవారుజామున తొలి బస్సును నిలిపేయటం ద్వారా సమ్మె ప్రారంభిస్తామని టీఎంయూ వెల్లడించింది. దీనికి సన్నాహకంగా ఈ నెల 7 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి వెల్లడించారు. 7వ తేదీన అన్ని డిపోల ఎదుట ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన చేపడతామని, 8వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామని చెప్పారు. వేతన సవరణ గడువు ముగిసి 14 నెలలు దాటినందున వెంటనే 50 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ జరపాలని డిమాండ్ చేశారు. -
సమ్మెకు వెళ్లొద్దు : బొత్స
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉందని, సమ్మె వల్ల ఆర్థికంగా ఇంకా నష్టపోతామని, అందువల్ల సమ్మెకు వెళ్లొద్దని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రలో ఈనెల 12 అర్ధరాత్రి నుంచి ఈయూ, ఎన్ఎంయూ, తెలంగాణలో టీఎంయూ సమ్మెకు దిగడానికి సిద్ధమైన నేపథ్యంలో.. కార్మిక సంఘాల నేతలతో మంత్రి బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీకి ఈయూ, టీఎంయూ నేతలు హాజరుకాగా.. ఎన్ఎంయూ నేతలు డుమ్మా కొట్టారు. సమ్మె వల్ల సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లడంతోపాటు ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్లో ప్రజలకు ఆర్టీసీ సేవలు చాలా అవసరమన్నారు. సీమాంధ్రకు పోటీగా తెలంగాణలో సమ్మె చేస్తే ఇబ్బంది ఎదురవుతుందని చెప్పారు. అయితే సమ్మె నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేమని కార్మిక సంఘాల నేతలు మంత్రికి స్పష్టంచేశారు. టీఎంయూ సమ్మె నోటీసు..: హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయడానికి పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ టీఎంయూ బుధవారం ఈడీ(పరిపాలన) వెంకటేశ్వరరావుకు సమ్మె నోటీసు ఇచ్చింది. తాము ఏక్షణమైనా సమ్మెకు దిగుతామని టీఎంయూ నేతలు అందులో పేర్కొన్నారు. మరోవైపు టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయడానికి ఈయూ తెలంగాణ కార్యవర్గం గురువారం సమావేశం కానుంది. -
ఆర్టీసీకి ఉద్యమ సెగ, ఇరుప్రాంతాల్లో సమ్మె!
హైదరాబాద్ : ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ విభజన సెగ తగిలింది. ఇప్పటికే సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, ఉద్యమాల దెబ్బకు బస్సులు ....డిపోలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికే సీమాంధ్ర ఆర్టీసీ యూనియన్లు ఈనెల 12వ తేదీ నుంచి సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ టీఎంయూ సమ్మెకు సిద్ధమైంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌తో టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించింది. సీమాంధ్రలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైప్పటి నుంచి తెలంగాణలోనూ సమ్మె ప్రారంభిస్తామని టీఎంయూ నేత అశ్వథ్ధామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. కాగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అటువైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. సీమాంధ్రలో ఉద్యమంతో ఆర్టీసీ రోజుకు రూ. 4కోట్లు ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ....సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పోటా పోటీ సమ్మెలకు దిగితే ఆర్టీసీ కోలుకోవటం కష్టమే.