సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) విలీనానికి తొలి అడుగు పడింది. ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛను తాము అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అధ్యయన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి టి.కృష్ణబాబు, ఆర్టీసీ ఉన్నతాధికారులు శనివారం వెలగపూడిలోని సచివాలయంలో చర్చలు జరిపారు. చర్చలు ఫలప్రదంగా ముగిశాయని సమావేశం అనంతరం జేఏసీ నేతలు మీడియాకు తెలిపారు.
ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముఖ్యమంత్రి జగన్ సుముఖంగా ఉన్నారని, కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలియజేశారని జేఏసీ నేతలు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ నుంచి సమ్మె చేపడతామని తామిచ్చిన సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు జేఏసీ కన్వీనర్ పి.దామోదరరావు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుస్తామని, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని జేఏసీ నేతలు చెప్పారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుండడం సంతోషకరమని అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలో జరగాల్సిన సమ్మె సన్నాహక సభలను విరమించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ చర్చల్లో యాజమాన్యం తరఫున ఆర్టీసీ ఈడీలు కూడా పాల్గొన్నారు.
విలీనానికి చకచకా ఏర్పాట్లు
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర సర్కారు త్వరలో అధ్యయన కమిటీని నియమించనుంది. గతంలో ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా పనిచేసి, పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీలో కార్మిక సంఘాల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీ నియామకంపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. రెండు నెలల్లో ఈ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు ఖరారు చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు విలీన ప్రక్రియపై ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment