
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఈ నెల 8న చర్చలకు రావాలని ఆర్టీసీ గుర్తింపు సంఘం, జేఏసీ సహా అన్ని కార్మిక సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. సమ్మె ఆగాలంటే వెంటనే కార్మికుల వేతనాలు పెంచాలని, వేతన సవరణ చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజాగా వేతన సవరణకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో సమ్మె చేపట్టనున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 11న తెల్లవారుజామున తొలి బస్సును నిలిపేయటం ద్వారా సమ్మె ప్రారంభిస్తామని టీఎంయూ వెల్లడించింది. దీనికి సన్నాహకంగా ఈ నెల 7 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి వెల్లడించారు. 7వ తేదీన అన్ని డిపోల ఎదుట ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన చేపడతామని, 8వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామని చెప్పారు. వేతన సవరణ గడువు ముగిసి 14 నెలలు దాటినందున వెంటనే 50 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ జరపాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment