ఆర్టీసీకి ఉద్యమ సెగ, ఇరుప్రాంతాల్లో సమ్మె!
హైదరాబాద్ : ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ విభజన సెగ తగిలింది. ఇప్పటికే సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, ఉద్యమాల దెబ్బకు బస్సులు ....డిపోలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికే సీమాంధ్ర ఆర్టీసీ యూనియన్లు ఈనెల 12వ తేదీ నుంచి సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ టీఎంయూ సమ్మెకు సిద్ధమైంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్తో టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించింది.
సీమాంధ్రలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైప్పటి నుంచి తెలంగాణలోనూ సమ్మె ప్రారంభిస్తామని టీఎంయూ నేత అశ్వథ్ధామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. కాగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అటువైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. సీమాంధ్రలో ఉద్యమంతో ఆర్టీసీ రోజుకు రూ. 4కోట్లు ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ....సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పోటా పోటీ సమ్మెలకు దిగితే ఆర్టీసీ కోలుకోవటం కష్టమే.