‘కారుణ్యం’ నిరంతరం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో నిరంతరాయంగా కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం... మృతి చెందిన సిబ్బంది కుటుంబసభ్యుల్లో అర్హులైనవారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించేందుకు మార్గం సుగమమైంది. 2010 నుంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 1,400 మందికి తాజా ఉత్తర్వులతో తక్షణమే ప్రయోజనం కలగనుంది. 1998 వరకు అవకాశం ఉన్నప్పుడల్లా కారుణ్య నియామకాలు చేపట్టే వెసులుబాటు ఉండగా, ఆ తర్వాత దానికి బ్రేక్ పడింది. అప్పటి నుంచి నియామకాలు లేకపోవటంతో వందల మంది ఎదురుచూడాల్సి వచ్చింది. కార్మిక సంఘాల నుంచి ఒత్తిడి పెరగటంతో ఎట్టకేలకు 2013లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే... 2010 డిసెంబర్ 31 వరకు మృతి చెందిన సిబ్బంది కుటుంబాలకే దాన్ని పరిమితం చేశారు. దీంతో అప్పట్లో 1,120 మందికి ఉద్యోగాలు లభించాయి. ఆ తర్వాత మళ్లీ కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి ప్రారంభించాయి. ఇటీవల సీమాంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమంలో భాగంగా జరిగిన సమ్మెను విరమింపచేసే ప్రయత్నంలో భాగంగా కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనికి అప్పట్లో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు 2010 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగాలు కల్పించటంతో పాటు ఇక నుంచి అవసరమైనప్పుడల్లా కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్టు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. తాజా ఉత్తర్వులపై ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.